
టచ్ చేస్తే... చుక్కలు చూపిస్తా!.
ఏరా అబ్బాయిలు... దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడండి! టచ్ చేసిన తర్వాత కూడా మీరు స్టడీగా ఉంటే నన్ను కుమ్మేసుకోండి! అంటున్నారు మాస్ మహారాజ రవితేజ. ఈ బంపర్ ఆఫర్ ఓన్లీ విలన్లకు మాత్రమే! బలుపున్నోడు భలే ఆఫర్ ఇచ్చాడని వాళ్లెవరైనా టచ్ చేశారో... పట్టపగలే చుక్కలు కనిపించేలా కొడతాడట! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘టచ్ చేసి చూడు’. ఇందులో టైటిల్‌కు తగ్గట్టు కాన్సెప్ట్ బేస్డ్ మాసీ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫైట్ డిజైన్ చేశారని సమాచారం.
ఫైట్ కాన్సెప్ట్ ఏంటంటే... హీరోను విలన్లలో ఎవరు టచ్ చేస్తే వాళ్లకి చుక్కలే. బహుశా... ఇది హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 24 వరకు రవితేజ, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.