నేను చివరగా చెప్పిన అబద్ధం అదే!
ఒకటి కాదు.. రెండు కాదు.. త్రిష చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. మోహిని, సదురంగ వేటై్ట, గర్జనై, 96, 1818, హే జడ్జ్, స్వామి–2.. ఆ సినిమాలు ఇవే. వీటిలో మోహిని, గర్జనై.. లేడీ ఓరియంటెడ్ మూవీస్. ‘1818’లో తనే లీడ్ రోల్ చేస్తున్నారు. ఆరేడేళ్లుగా ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన త్రిష ఇప్పుడు 7 సినిమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరదా ప్రశ్నలకు త్రిష చెప్పిన జవాబులు తెలుసుకుందాం.
1 ఏంటండీ బాబూ.. ఒకేసారి ఏడు సినిమాలా?
ఈ ఏడాది నా టార్గెట్ 9 సినిమాలు. ఇప్పటికి 7 కమిట్ అయ్యా. ఇంకో రెండు సినిమాల గురించి త్వరలో అనౌన్స్ చేస్తా.
2 ఇన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వగలుగుతారా?
ఒకసారి డైరీ చెక్ చేశా. ఇచ్చే స్కోప్ ఉంది. పైగా ఒప్పుకున్న సినిమాలన్నీ ‘ది బెస్ట్’ అనొచ్చు. ఒకేసారి ఇన్ని సినిమాలంటే కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది. అయినా ఓకే.
3 పర్సనల్ విషయాలకొద్దాం.. మీ సొంతూరు చెన్నైలో మీకిష్టమైన ప్లేస్?
ఇంకేముంటుంది? మా ఇల్లు.
4 మిమ్మల్ని ద్వేషించేవారికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా...?
సందేశాలెందుకు? వారిని అలాగే కొనసాగనిద్దాం.
5 అపజయాల నుంచి మీరు ఎలా తేరుకుంటారు?
గాఢంగా నిద్రపోతా. ఐస్‌క్రీమ్ లాగించేస్తా.
6 మీకు ప్రేరణ ఎవరు?
నా అంతరాత్మే నాకు ఇన్‌స్పిరేషన్.
7 మీరు బాగా నిరుత్సాహపడ్డప్పుడు వెంటనే తీసుకునే స్టెప్ ఏది?
బాగా ఫీలవుతాను. తర్వాత ఏడుస్తా. కాసేపటికి బాధ దానంతట అదే మాయమవుతుంది.
8 మీరు చివరిగా చెప్పిన అబద్ధం?
షూటింగ్‌లో ఉన్నాను. తర్వాత కలుస్తాను.
9 మిమ్మల్ని భయపెట్టే విషయం ఏదైనా ఉందా?
ఎవరైనా దిండుతో ఊపిరి ఆడకుండా చేస్తారని భయంగా ఉంటుంది.
10 టీనేజ్ గాళ్స్‌కి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ధైర్యంగా ఉండండి. మీ కలలను సాధించుకునే దిశగా అడుగులు వెయ్యండి.
11 పెళ్లి తర్వాత మీరు సినిమాల్లో కొనసాగుతారా... లేక ఇంటికే పరిమితమవుతారా?
ఈ రోజుల్లో మహిళలు ఇటు ఇల్లు, అటు ఉద్యోగం రెంటినీ చక్కగా చూసుకోగలుగుతున్నారు.
12 మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా.. అబద్ధం చెప్పకూడదు సుమా..
సరే అబద్ధం చెప్పను. అయితే ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ గురించి ఏం చెప్పలేను.
13 మీకు కోపం తెప్పించే విషయం?
ఎదుటి వ్యక్తులకు కొంతమంది నీతులు చెబుతారు. కానీ, చెప్పేవాళ్లు పాటించరు. అలాంటివాళ్లంటే కోపం.
14 మీ గురించి వచ్చే పుకార్లకు ఎలా స్పందిస్తారు?
ఇంట్లో పెద్దగా నవ్వుకుని వదిలేస్తాను. పట్టించుకోను.
15 మీ కుంటుంబం గురించి ఒక్క మాటలో?
నా బలం..నా ఎంటర్‌టైన్‌మెంట్.
16 దేవుడు మీ ముందు ప్రత్యక్షమయితే ఏం అడుగుతారు?
ఏమీ అడగను. నాకేం ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు.