కృషి ఉంటే... త్రిషలా ఉండొచ్చు! | Trisha Krishnan Beauty Tips and Fitness Secrets | Sakshi
Sakshi News home page

కృషి ఉంటే... త్రిషలా ఉండొచ్చు!

Published Tue, Jul 28 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Trisha Krishnan Beauty Tips and Fitness Secrets

 త్రిష గురించి సింపుల్‌గా చెప్పాలంటే...
 థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ...
 థర్టీ టూ ఇయర్స్ ఏజ్..!
 కానీ త్రిష మాగ్నెట్‌లాగా యూత్ హార్ట్స్‌ని గుంజుకుంటూనే ఉన్నారు.
 చూసీ చూసీ మనకు బోర్ లేదు.
 చేసి చేసీ తనకూ బోర్ రాలేదు.
 త్రిషలో ఏదో మేజిక్ ఉంది.
 ఆమె ఒంటి మీద వయసు వాలడం ఆగిపోయిందా?
 ఆ గ్లామర్... ఆ ఫ్రెష్‌నెస్... ఆ ఫిట్‌నెస్... ఎలా మెయింటెయిన్ చేయగలుగుతున్నారామె.
 త్రిష దగ్గరే ఆ సీక్రెట్స్ తెలుసుకుందామా...

 
 ఫిట్‌నెస్
 ‘స్ట్రెచింగ్’ ఎక్సర్‌సైజులు శరీరానికి మంచివి అంటారు త్రిష. ప్రతి రోజూ ఉదయం ఆమె యోగా చేస్తారు. రకరకాల ఆసనాలు చేస్తుంటారు. వాటిలో ఏది చేసినా చేయకపోయినా స్ట్రెచింగ్ ఆసనాలు మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. కార్డియో ఎక్సర్‌సైజ్‌తో పాటు మరికొన్ని వ్యాయామాలు కూడా చేస్తారామె. బాగా ఖాళీ దొరికితే స్విమ్మింగ్ చేస్తారు. ఈత వల్ల శరీరాకృతి బాగుంటుందని చెబుతారు త్రిష. ఇన్నేళ్లల్లో శరీరాకృతిలో మార్పు రాకపోవడానికి కారణం తాను చేసే యోగా, వ్యాయామాలని చెబుతారు. వ్యాయామాలు శరీరానికి బాగుంటాయి. యోగా అయితే శరీరంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండటానికి ఉపకరిస్తుందని అంటున్నారు త్రిష.
 
 డైట్
 ఉదయం త్రిష డైట్ గ్రీన్ టీతో మొదలవుతుంది. అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటారు. పరోటాలు, ఆమ్లెట్స్.. ఇలా ఏది అనిపిస్తే అది తింటారు. కడుపు నిండా లాగించేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెవీగా తీసుకుంటే... అంత మంచిది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, మన పనులు మనం సునాయాసంగా చేసుకోగలుగుతాం అంటారు త్రిష. బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ మధ్య చిరుతిండి తినరు. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తాగుతారు. ముఖ్యంగా నిమ్మ, బత్తాయి... ఇలా ‘విటమన్ సి’ మెండుగా ఉన్న పండ్లు తీసుకుంటారు. లంచ్, డిన్నర్‌కి ఏది ఇష్టం అనిపిస్తే అది తింటారు. ఇంత సన్నగా ఉంటారు కాబట్టి, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారనుకుంటే పొరపాటు. నచ్చినవాటిని మితంగా తింటారు. త్రిషకు సీ ఫుడ్ చాలా ఇష్టం. తన డైట్‌లో అవి కంపల్సరీగా ఉండేలా చూసుకుంటారు. రోజూ ఆరేడు గంటలు నిద్రపోతారు.
 
 మేకప్
 అందంగా లేనివాళ్లను అందంగా, అందంగా ఉన్నవాళ్లని మరింత అందంగా చూపించే సత్తా మేకప్‌కి ఉంది. త్రిష అందంగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై మరింత అందంగా కనిపించడం కోసం లైట్‌గా మేకప్ చేసుకుంటారు. త్రిషకు హెచ్‌డి (హై డెఫినిషన్) మేకప్ అంటే ఇష్టం. ఎక్కువగా అదే వాడతారు. ఐ లైనర్, మస్కరా, లిప్ కలర్.. డే టైమ్‌లో అయితే ఇవన్నీ లైట్‌గా ఉండేలా చూసుకుంటారు. నైట్ టైమ్ మాత్రం ముదురు రంగులు వాడతారు. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మేకప్ చేసుకుంటారు.
 
 స్టయిలింగ్
 త్రిషకు ఇండియన్, వెస్ట్రన్.. రెండు రకాల దుస్తులు ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత బాగుంటారో చీరల్లోనూ అంతే అందంగా ఉంటారామె. కంటికి నచ్చినవల్లా కాకుండా ఒంటికి నప్పేవి కొనుక్కుంటారు. హెయిర్ స్టయిల్ విషయానికొస్తే... జుత్తుని ఫ్రీగా వదిలేయడం త్రిషకు ఇష్టం. కానీ, వేసుకున్న డ్రెస్‌కి అనుగుణంగా హెయిర్ స్టయిల్ ఉండాలి. అందుకని ఆ డ్రెస్‌కి తగ్గట్టు, తన ఫేస్‌కి సూట్ అయ్యే హెయిర్ స్టయిల్ చేసుకుంటారు. త్రిషకు టాటూలంటే ఇష్టం. సినిమాల్లో పాత్ర డిమాండ్ మేరకు మాత్రమే కాదు.. పర్సనల్‌గా కూడా టాటూ వేయించుకుంటారు.

 ఫైనల్‌గా త్రిష ఏం చెబుతారంటే... మనం అనారోగ్యం బారిన పడటానికి ముఖ్య కారణం ఒత్తిడి అని, ఎంత ఒత్తిడికి గురి చేసే విషయాన్నయినా తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం అని కూడా చెబుతున్నారు. త్రిష దాదాపు పాజిటివ్‌గానే ఉంటారట. వయసు పెరుగుతున్నా తరుగుతున్నట్లు కనిపించడానికి అదో కారణం అని చెప్పొచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement