
వివాదంలో ‘దంగల్’ నటి
ముంబై: ‘దంగల్’ సినిమాలో నటించిన వసీం జైరా(16) వివాదంలో చిక్కుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. జైరా వ్యాఖ్యలపై కశ్మీర్ వేర్పాటువాదులు మండిపడడంతో ఆమె క్షమాపణ చెప్పింది. ‘దంగల్’ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది జైరా. ఆమె సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్.
జైరా తన తల్లిదండ్రులతో పాటు శనివారం కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీని కలిసింది. విద్యాభ్యాసం, కెరీర్, దంగల్ సినిమా షూటింగ్ అనుభవాలు ముఫ్తీతో పంచుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని తర్వాత ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసింది. ఆమె వ్యాఖ్యలను వేర్పాటువాదులు తీవ్రంగా ఆక్షేపించారు. తన వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పింది. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించివుంటే క్షమించాలని వేడుకుంది. తనను ఎవరూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
‘కశ్మీరీ యువతకు రోల్ మోడల్ గా నన్ను చూపించారు. నన్ను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని స్పష్టం చెబుతున్నాను. రోల్ మోడల్ గా కూడా పెట్టుకోవద్దు. నేను 16 ఏళ్ల అమ్మాయిని. నా వయసును దృష్టిలో పెట్టుకుని నేను చేసిన వ్యాఖ్యలను చూడాల’ని జైరా కోరింది. కాగా, జైరాపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. 16 ఏళ్లతో అమ్మాయితో బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు.