బెంగళూరు : ప్రముఖ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సుశీల్ స్వస్థలం మండ్యలో మంగళవారం చోటుచేసుకుంది. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 30 ఏళ్ల వయసున్న సుశీల్ ఆత్మహత్యకు పాల్పడటం అతని స్నేహితుల్లో, శాండల్‌వుడ్‌లో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. అంతపుర అనే రొమాంటిక్ సీరియల్‌లో నటించిన సుశీల్ మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా ఉన్నారు. అలాగే కన్నడ చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. హీరో దునియా విజయ్ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆత్మహత్యకు పాల్పడి అందరినీ షాక్‌కు గురిచేశారు. (చదవండి : కరోనాపై పాట రాసి.. దానికే బలైన నిస్సార్!)
సుశీల్ ఆత్మహత్యపై దునియ విజయ్ ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ‘నేను సుశీల్‌ను మొదటిసారి చూసినప్పుడు అతను హీరో కావాల్సిన వ్యక్తి అనుకున్నాను. కానీ మూవీ విడుదలకు ముందే అతను మనల్ని విడిచి వెళ్లిపోయాడు. సమస్య ఏదైనా ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు. ఈ ఏడాది వరుస మరణాలు కనుమరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని అనిపిస్తోంది. ఇది కేవలం కరోనా వైరస్ భయం వల్లనే కాదు.. జీవనం సాగించడానికి డబ్బు దొరకదనే నమ్మకం కోల్పోవడం వల్ల కూడా. ఈ కష్ట సమయంలో మనం అత్యంత ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.
సుశీల్ ఆత్మహత్యపై అతని సహానటి అమితా రంగనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ వార్త నేను నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. అతను చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. అతను చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు చాలా కూల్‌గా ఉంటాడు. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం చాలా బాధ కలిగిస్తోంది’ అని అమిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment