
స్లమ్ కిడ్స్ చదువుకోసం ట్వింకిల్ ఖన్నా సాయం
ముంబై: రచయితగా మారిన బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా మురికివాడల్లోని పిల్లల చదువుకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. ముంబైలోని ఓ మురికివాడలో ఆదివారం పర్యటించిన ట్వింకిల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పిల్లల చదువుకోసం తనవంతుగా ఎంతటి సాయమైనా చేస్తానని ప్రకటించింది. ‘ఇక్కడికి వచ్చాక పిల్లలు ప్రదర్శించిన ఓ సినిమా సన్నివేశం చూశాను. ఉదయం పేపర్ చూడగానే కనిపించే భయంకర వార్తలు, టీవీ పెట్టగానే వినిపించే రోధనలే కాదు.. అందమైన, ఆహ్లాదమైన ప్రపంచం ఎంతో ఉందనిపించింది. ఈ పిల్లలను చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను.
అయితే వీరంతా చదువుకోలేకపోతున్నారని తెలిసి బాధగా అనిపించింది. అందుకే వీరి చదువు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడనంత వరకు, వారి బాధలను మనతో పంచుకోనంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఆ జీవితం కూడా నిస్సారంగా ఉంటుంది. అందుకే ఈ పిల్లల జీవితాలు మార్చడానికి ఏదైనా చేయాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాన’ని చెప్పింది.