'స్ట్‌ట్వి' తిప్పి చదవండి | Twist is tollywood movies | Sakshi
Sakshi News home page

'స్ట్‌ట్వి' తిప్పి చదవండి

Published Wed, Jul 20 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

Twist  is tollywood movies

ఒక ఫ్లోలో పోతున్న కథ సడన్‌గా మలుపు తిరుగుతుంది. దాన్నే ట్విస్ట్ అంటారు. పైన హెడ్డింగ్ తిప్పి చదివితే కనపడేది ట్విస్టే. చిన్నా పెద్దా సినిమా తేడా లేకుండా ఇలాంటి ట్విస్టులు హీరోల, డైరక్టర్ల, ప్రొడ్యూసర్ల కెరియర్‌లకు మంచి ట్విస్ట్ ఇస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన కొన్ని ట్విస్టులు ఇవి.
 
బాహుబలి
 తెలుగు సినిమాకు ప్రాంతీయ హద్దులు చెరిపేసి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా ‘బాహుబలి’. తన సినిమాలలో ఇంటర్వెల్‌కి మంచి బ్యాంగ్ ఇవ్వడం దర్శకుడు రాజమౌళి అలవాటు. ఆయన గత చిత్రాలన్నీ అదిరిపోయే ఇంటర్వెల్‌తో వచ్చినవే. ‘బాహుబలి’ కథను రెండు పార్టులుగా చెప్పాలనుకున్నప్పుడు, మొదటి పార్ట్‌ను ఫస్ట్ హాఫ్‌లా ట్రీట్ చేశారు. క్లైమాక్స్‌లో ఇంటర్వెల్ లాంటి ట్విస్ట్ ఇచ్చారు. అదే కట్టప్ప బాహుబలిని చంపే సీన్. రాజు మాట శిరసావహించి ప్రాణాలైనా ఇచ్చే కట్టుబానిస కట్టప్ప రాజుని ఎందుకు చంపాడన్నది ఆసక్తికరమైన మలుపు. బాహుబలి ద బిగినింగ్ క్లైమాక్స్‌లో వచ్చిన ఈ సీన్... మొత్తం సినిమాకే హైలైట్ గా మారింది. శివుడిగా ప్రభాస్ చేసిన సాహసాలు, అవంతిక క్యారెక్టర్‌లో తమన్నా అందాలు, భారీ సెట్టింగ్‌లు, కనువిందు చేసే గ్రాఫిక్స్, ఫ్రీ క్లైమాక్స్‌లో యుద్ధ సన్నివేశాలు... ఇవన్నీ ఒక ఎత్తై... ఫ్లాష్ బ్యాక్ చివర్లో బాహుబలిని కట్టప్ప చంపడమే ఎక్కువ గుర్తుండిపోయింది. రెండో పార్ట్ సినిమాగా రావడానికి ఈ ట్విస్టే క్యూరియాసిటీని నిలబెడుతోంది.
 
 సోగ్గాడే చిన్ని నాయన
 బంగార్రాజు సరసం, సాయం తెలిసిన  వ్యక్తి. ఊళ్లో పెద్ద తలకాయ. బడులు కట్టడం, గుడి సంపదలు కాపాడటం బాధ్యతగా భావిస్తుంటాడు. ఒక రోజు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆత్మగా మారి మళ్లీ ఇంటికొస్తాడు. రొమాన్స్ తెలీని కొడుకుతో కోడలు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడితే ఆత్మ రూపంలో కొడుకు శరీరంలోకి వెళ్లి ఆ కాపురాన్ని నిలబెడతాడు. బంగర్రాజు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని యాక్సిడెంట్ చేసి చంపారనేది కథలో ట్విస్ట్. బంగర్రాజు ట్రస్టీగా ఉన్న గుడిలో ఉన్న విలువైన ఆభరణాల కోసం ఆయన బంధువులే చంపేస్తారు. ఆత్మరూపంలో వచ్చిన బంగర్రాజుకు ఈ విషయం తెలుస్తుంది. దేవుడి సహాయంతో బంగార్రాజు గుడి ఆభరణాలు కాపాడతాడు. ట్విస్టు అల్లినట్లు కాకుండా కథలో నిజాయితీగా కలిసిపోవడం వల్ల ‘సోగ్గాడే చిన్ని నాయన’ సక్సెస్‌ఫుల్ సినిమా అయ్యింది.
 
 టెంపర్
 ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరో రౌడీలతో కుమ్మక్కై లక్షలు దండుకునే పోలీస్ క్యారెక్టర్ చేయడమే పెద్ద ట్విస్ట్. అయితే కథలోనూ మంచి ట్విస్ట్ ఉంది. అవినీతి పోలీసు ఆఫీసర్ నిజాయితీ ఆఫీసర్‌గా మారడమే ఒక్క లైన్‌లో ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా. అయితే కథానాయకుడు ఒక అమ్మాయి కన్నీటి గాథ విని మారాడని చూపిస్తే రొటీన్ అవుతుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ అలా సాదాసీదాగా స్టోరీ చెబుతాడా? ఏదో పవర్‌ఫుల్ ఎలిమెంట్ తీసుకొస్తాడు. క్లైమాక్స్‌లో అసలు సిసలు ట్విస్ట్ చూపించాడు. నేరస్తులను నేరుగా పట్టివ్వలేకపోయిన హీరో తానే నేరం (అత్యాచారం) చేశానని జైలుకెళ్లి విలన్ల భరతం పడతాడు. ఈ ట్విస్ట్ పండింది.
 
జెంటిల్‌మన్
 విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అమ్మాయిలు స్నేహితులవుతారు. సరదాగా మాటల్లో పడతారు. ఇద్దరి ప్రేమ విషయాలు పంచుకుంటారు. ఒక అమ్మాయి తనకు త్వరలో పెళ్లి జరగబోతోందని చెబుతుంది. మరో అమ్మాయి తన లవ్ స్టోరీ చెప్పేస్తుంది. ఇలా ఒకరికొకరు తన లైఫ్ ‘బాయ్’ గురించి మాట్లాడు కుంటారు. విమానం ల్యాండ్ అవగానే ఎదురొచ్చిన కుర్రాడు అ ఇద్దరు ఇప్పటిదాకా చెప్పుకున్న వ్యక్తే. ఇదే సినిమాలో అసలు సిసలు ట్విస్ట్. కథానాయకుడు ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డాడన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇంటికెళ్లగానే ప్రేమికుడు చనిపోయాడన్న వార్త తెలియడం మరో మలుపు. ఇలా రెండు ట్విస్టులతో కథను టేకాఫ్ చేసిన దర్శకుడు అనేక సన్నివేశాల్లో దీనికి కారణాలు చూపిస్తూ క్లైమాక్స్ ల్యాండింగ్ చేస్తాడు. ఇది క్లుప్తంగా నాని కొత్త సినిమా ‘జెంటిల్‌మన్’ కథ. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తన కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నమిది. ఇన్నోసెంట్ కామెడీ సినిమాలు చేస్తున్న నానీకి కొత్త తరహా చిత్రమే. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ మంచి ప్రయత్నంగా మిగిలింది.        
 
క్షణం
 ఈ ఏడాది అనూహ్య విజయాన్ని సాధించిన సినిమా ‘క్షణం’. ఒక పాప కిడ్నాప్ మిస్టరీని అనేక మలుపులతో ఆసక్తికరంగా తెరక్కెకించాడు దర్శకుడు రవికాంత్ పేరేపు. కాలిఫోర్నియాలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఉద్యోగం చేసుకునే రిషీ.....శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్లిద్దరు శారీరకంగా ఒక్కటవుతారు. కూతురు ప్రేమ విషయం తెల్సుకున్న తండ్రి వేరే కుర్రాడికిచ్చి హడావిడిగా పెళ్లి చేసేస్తాడు. వీళ్లకు పుట్టిన పాపను కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. భర్త పట్టించుకోకపోవడంతో రిషీ సాయం కోరుతుంది శ్వేత. ఇండియాకు వచ్చిన రిషీ....అపహరించిన పాపను కాపాడతాడు. శ్వేత భర్తే పాపను కిడ్నాప్ చేయించాడన్నది కథలో మేలిమలుపు.
 
నేను.. శైలజ...
 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చినుకులు పడ్డ ఓ సాయంత్రం కలల సుందరి లాంటి అమ్మాయి ఎదురైతే....గుండె లవ్ లవ్ అంటూ కొట్టుకుంటుంది. ‘నేను శైలజ’ సినిమాలో ఇలాంటి సందర్భమే హీరో రామ్‌కు ఎదురవుతుంది. మనసు ఆ అమ్మాయికి ఇచ్చి... ప్రేమ మాయలో పడిపోతాడు.  ఈ హీరోకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో ఎదురెదురు ఇళ్లలో పిల్లలుగా తనూ  శైలజ. ఆ చిన్నారి స్నేహితురాలే ...ప్రస్తుతం తను ప్రేమిస్తున్న శైలజ అని తెలియడం ఈ ప్రేమకథలో ట్విస్ట్. కుటుంబంలో పరిస్థితులు హీరోయిన్‌కు ప్రతిబంధకాలవుతాయి. ఆ కష్టాలను తీర్చి... ప్రేమికురాల్ని తన దగ్గరకు చేర్చుకుంటాడు హీరో. సహజత్వానికి దగ్గరగా మన చుట్టూ జరిగే కథగా తెరకెక్కిన ‘నేను శైలజ’ ...ఈ మలుపులతో బాక్సాఫీస్ గెలుపు బాట పట్టింది.
 
  దృశ్యం...
 ఒక అందమైన పల్లెటూరు, అందులో అనుబంధాల పొదరిల్లు. తండ్రి కేబుల్ ఆపరేటర్. తల్లి, ఇద్దరు ఆడపిల్లలు. పొరుగూరు షాపింగ్‌కి వెళ్లడం వాళ్లకో పెద్ద కల. సరదాలతో ప్రతి రోజూ పండగ రోజులా గడుపుతుంటారు. ఇంతలో ఈ హ్యాపీ ఫ్యామిలీని కుదిపేసే సంఘటన  ఒకటి జరుగుతుంది. వాళ్లకది తట్టుకోలేని విషాదం. అయితే పెడబొబ్బలు పెట్టి విషయాన్ని బయటపడకుండా ప్రతీకారం తీర్చుకోవాలని అంతా అనుకుంటారు. తన కూతురుని చెరచాలని చూసిన యువకుణ్ణి చంపేసి పోలీస్ స్టేషన్ కిందే పూడ్చిపెట్టడం పెద్ద ట్విస్ట్. అనుమానంతో అణువణువూ వెతికిన పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కుండా కథనాయకుడు, అతని కుటుంబం ఆడిన మైండ్ గేమ్ అబ్బురపరుస్తుంది. ఒక  క్రూరత్వానికి కుటుంబం వేసిన శిక్ష సరైనదే అనిపిస్తుంది. దేశంలో సినీ పరిశ్రమ ఉన్న అన్ని భాషల్లోకి అనువాదమవుతున్న అరుదైన సినిమా ‘దృశ్యం’. ఈ మళయాల కథలోని ట్విస్టే పేక్షకులను థ్రిల్ చేసింది. తెలుగులో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు.
 
రైట్ రైట్
 ట్విస్టు కథలతో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్  కాలేదు. ‘శౌర్య’, ‘రైట్  రైట్’  లాంటి సినిమాలు అపజయాలనూ చవిచూశాయి. హీరోయిన్‌ను విలన్లు చంపడం చూసుంటాం కానీ, ‘శౌర్య’ సినిమాలో హీరోనే నాయికను చంపానని కోర్టులో చెబుతాడు. ఇలా ఎందుకు చెప్పాడన్నది కథలో మలుపు. దర్శకుడు దశరథ్  తెరకెక్కించిన ‘శౌర్య’ సినిమాకు బాక్సాపీస్ దగ్గర కూడా ట్రాజెడీ ఫలితమే దక్కింది. చేదు ఫలితాన్ని చూసిన మరో ట్విస్ట్  సినిమా ‘రైట్  రైట్’. బస్ కండక్టర్, డ్రైవర్ స్నేహితులవుతారు. బస్సు వెళ్లే ఊళ్లో ఓ మాస్టారు వీళ్లకు సాయం చేస్తుంటాడు. ఓసారి ప్రయాణంలో డ్రైవర్ తాగి కండక్టర్‌ను బస్సు నడపమంటాడు. ఆ బస్సు ఓ వ్యక్తిని ఢీ కొంటుంది. మరణించిన వ్యక్తి మాస్టారు కొడుకు కావడం విషాదం. ఐతే  బస్సు ఢీ కొట్టడం వల్ల మాస్టారు కొడుకు చనిపోలేదని...చంపి బస్సు కింద  పడేశారన్నది కథలో ట్విస్ట్. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న అతన్ని చంపిందెవరు అనేది క్లైమాక్స్‌లో తేలుస్తాడు దర్శకుడు. ‘రైట్ రైట్’ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చింది..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement