
కోపిష్ఠి పక్షులతో... కామెడీ బాబు!
ప్రపంచంలో ఏ పక్షీ కోపంగా ఉన్నట్టు కనబడదు. ఒక్క యాంగ్రీ బర్డ్ తప్ప. నూనెలో ఆవాలు చిటపటలాడినట్లు మొహం మీద ఎప్పుడూ చిటపటలే. ఇంతకీ యాంగ్రీ బర్డ్స్ నిజమైన పక్షులు కావనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల కోసం సృష్టించబడిన పక్షులివి. యాంగ్రీ బర్డ్స్ గేమ్స్, కార్టూన్ షోస్ గురించి తెలిసే ఉంటుంది. ఈ పక్షులు బంగారం లాంటి ఆ బాబుని కలవాలనుకున్నాయ్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీకి వెళ్లాయి. బాబేమో హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నాడు. హఠాత్తుగా ఊడిపడిన ఈ కోపిష్ఠి పక్షులను చూసి, ఖుష్ అయ్యాడు.
మీ కోపాన్ని పోగొట్టేస్తానంటూ సరదాగా జోకులేశాడు. అంతే... కోపిష్ఠి పక్షులు ఫక్కున నవ్వేశాయ్. మామూలుగా కాదు.. పొట్టచెక్కలయ్యేలా నవ్వేశాయ్. బంగారం లాంటి బాబుగా వెంకటేశ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బాబు... బంగారం’. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ పరిచయమైపోయిన యాంగ్రీ బర్డ్స్ వేషాలతో షాపింగ్ మాల్స్‌లో కొంతమంది సందడి చేస్తు న్నారు. వీళ్లే ‘బాబు...బంగారం’ సెట్‌లోకి అడుగుపెట్టారు. బిజీగా షూటింగ్ చేస్తున్న చిత్రబృందం పక్షుల రాకతో కాసేపు రిలాక్స్ అయింది.