babu bangaram
-
పూరి దర్శకత్వంలో వెంకీ..?
డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టెంపర్ తరువాత పూరి తెరకెక్కించిన సినిమాలేవి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేసిన పూరి, నాగార్జున హీరోగా రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరోసారి సీనియర్ స్టార్ వెంటేష్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. బాబు బంగారంతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకటేష్, ప్రస్తుతం రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా గురు రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు. అదే సమయంలో పూరి సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ. -
అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి
కెరీర్ స్టార్టింగ్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో సక్సెస్ అయిన మారుతి తరువాత ఎంతో కష్టపడి ఆ ముద్ర చేరిపేసుకున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాకు ఫాలో అయిన ఓ సెంటిమెంట్‌ను తన నెక్ట్స్ సినిమాలలో కూడా కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడీ యువ దర్శకుడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో క్యారెక్టర్ మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటుంది. ఆ తరువాత తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో హీరో పాత్ర విపరీతమైన దయ కలిగిన పోలీస్ ఆఫీసర్. తన నెక్ట్స్ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్‌కు ఇలాంటి ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. శర్వానంద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మారుతి, ఆ సినిమాతో హీరో బ్రాండ్ల పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన హీరో ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని లవ్ చేయటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ఏ వస్తువైనా బ్రాండెడ్ అయితేనే వాడే పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. మరి ఈ సారి మారుతి ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
మలయాళీ దర్శకుడితో వెంకీ
బాబు బంగారం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన బాబు బంగారం వెంకీకి మంచి కిక్ ఇచ్చింది. అదే జోరులో ఇప్పుడు ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మాధవన్ హీరోగా తెరకెక్కిన ఇరుద్ది సుత్తుర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విక్టరీ హీరో, మరో సినిమాను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు. మళయాలి దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఇప్పటికే జోసెఫ్ చెప్పిన కథకు ఓకె చెప్పిన వెంకీ, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని సూచించాడట. గతంలో జీతూ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమాను తెలుగులో శ్రీ ప్రియ దర్శకత్వంలో రీమేక్ చేశారు. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న జీతూ జోసెఫ్, వెంకీ ఇమేజ్‌కు బాడీ లాంగ్వేజ్ తగ్గ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
బాబు బంగారం సక్సెస్ మీట్
-
'బాబు బంగారం' భారీ కలెక్షన్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'బాబు బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో రూ. 25 కోట్లు కలెక్షన్లు సాధించింది. వెంకటేశ్ సోలోగా నటించిన సినిమాకు భారీస్థాయిలో చాలా కాలం తర్వాత వసూళ్లు వచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. నాలుగు రోజుల వీకెండ్ లో ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్, రూ. 17 కోట్ల షేర్ సాధించిందని వెల్లడించారు. తమ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. 'బాబు బంగారం'కు స్పందన బాగుందని, తమ సినిమా విజయవంతం అయిందనడానికి వసూళ్లే నిదర్శనమని అన్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదలైంది. వెంకటేశ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. -
'బాబు బంగారం' మూవీ రివ్యూ
టైటిల్ : బాబు బంగారం జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వెంకటేష్, నయనతార, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : మారుతి నిర్మాత : నాగవంశీ, పిడివి ప్రసాద్ గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్, చాలా కాలం తరువాత తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకీ సరసన నయనతార హీరోయిన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను బాబు బంగారం అందుకున్నాడా..? కథ : ఎసిపి కృష్ణ (వెంకటేష్) తన తాత లాగే అందరిపై జాలి పడే మనస్థత్త్వం ఉన్న వ్యక్తి. తను పోలీస్ ఆఫీసర్ అయినా సరే.. తను పట్టుకున్న దొంగల మీద కూడా జాలీ చూపించే అంత మంచి తనం. అలాంటి కృష్ణకు శైలజ(నయనతార) పరిచయం అవుతుంది. తొలి చూపులనే ఆమెను ఇష్టపడ్డ కృష్ణ శైలజతో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే శైలజ కుటుంబానికి ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని కృష్ణమురళి), మల్లేష్ యాదవ్( సంపత్ రాజ్ )ల నుంచి ముప్పు ఉంటుంది. అసలు పుచ్చప్ప, మల్లేష్లతో శైలజ కుటుంబానికి ఉన్న గొడవ ఏంటి..? పుచ్చప్ప, మల్లేష్లకు కృష్ణ ఎలా బుద్ది చెప్పాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో నటించిన వెంకటేష్, తనలోని కామెడీ టైమింగ్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అందంగా కనిపించాడు. తన మార్క్ కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. శైలజ పాత్రలో నయనతార ఆకట్టుకుంది. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా గ్లామర్‌తో కట్టిపడేసింది. ముఖ్యంగా వెంకటేష్, నయనతార కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. కామెడీ విలన్లుగా పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్‌లు మెప్పించారు. బత్తాయి బాబ్జీ పాత్రలో 30 ఇయర్స్ పృథ్దీ, ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌లు తమ పరిధి మేరకు నవ్వించారు. సాంకేతిక నిపుణులు : తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు మారుతి ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా పక్కా కమర్షియల్ మూసలో సినిమాను తెరకెక్కించాడు. హీరో అందరి మీద జాలి పడటం అన్న ఒక్క పాయింట్ కామెడీ కోసం కొత్తగా ప్రజెంట్ చేసినా మిగతా సినిమా అంతా రొటిన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్లా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్స్‌తో సెకండ్ హాఫ్ యాక్షన్ డ్రామాతో లాగించేశాడు. గిబ్రాన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : వెంకటేష్ కామెడీ సీన్స్ స్టైలిష్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి స్క్రీన్ ప్లే ఓవరాల్‌గా బాబు బంగారం, సరదాగా నవ్వుకునే రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ -
నయన్ కనిపించటం లేదు..!
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార, వివాదాలతో వార్తలో నిలుస్తోంది. ఇప్పటికే బాబు బంగారం యూనిట్‌తో గొడవపడి ఓ పాట షూటింగ్‌కు రాలేందన్న వార్తలతో టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యూనిట్ సభ్యులు అలాంటిదేమి లేదని కొట్టి పారేసినా.. గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి నయనతార పేరు ఫిలిం నగర్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న బాబు బంగారం సినిమా ప్రమోషన్లో ఇంత వరకు నయనతార కనిపించలేదు. వెంకటేష్ లాంటి స్టార్ హీరో కూడా స్పెషల్ ఇంటర్వూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంటే.., నయనతార మాత్రం కనిపించటం లేదు. బాబు బంగారం యూనిట్‌తో వచ్చిన వివాదాల కారణంగానే నయనతార ప్రమోషన్‌కు దూరంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో దాసరి లాంటి సినీ ప్రముఖులు హీరోయిన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటంపై ఘూటుగానే స్పందించారు. అయినా మన హీరోయిన్ల తీరులో మాత్రం మార్పు రాలేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. -
హ్యాట్రిక్ మీద కన్నేశాడు
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం చాలా కష్టపడుతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి సక్సెస్ సాధించిన సాయి తరువాత విడుదలైన రేయ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో 20 కోట్ల వసూళ్ల మార్క్‌కు చేరువైన సాయి.. ఆ తరువాత విడుదలైన సుప్రీంతో, ఆ మార్క్‌ను ఈజీగా దాటేశాడు. తాజాగా తిక్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా వారసుడు, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. అయితే సాయి తిక్కకు ఒక్క రోజు ముందే వెంకటేష్ బాబు బంగారం రిలీజ్ అవుతుండటంతో తిక్క కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి సీనియర్ హీరో ఇమేజ్ను దాటి సాయి ధరమ్ తేజ్ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలి. -
మారుతిపై వెంకీ ప్రశంసలు
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరో వెంకటేష్, బాబు బంగారం సినిమాతో ఆడియన్స్ ముందు వస్తోన్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో వెంకటేష్.. దర్శకుడు మారుతిని ఆకాశానికెత్తేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో రాధ అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. అయినా మారుతి నిరుత్సాహపడకుండా మరో కథతో వెంకీని ఒప్పించాడు. అదే బాబు బంగారం. చాలా కాలం తరువాత వెంకీ మరోసారి ఫుల్ ఎనర్జీతో, తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అలరించనున్నాడు. తనను ఇలా ప్రజెంట్ చేయటం మారుతి ప్రతిభే అన్న వెంకీ.. ఈ యువ దర్శకుణ్ని సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణతో పోల్చాడు. మారుతి కూడా కోడి రామకృష్ణ లానే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంగారు పడడని.. తన పని తాను కూల్‌గా చేసుకుపోతాడని తెలిపాడు. వెంకటేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. గిబ్రాన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వెంకటేష్ లుక్స్, నయన్ వెంకీల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
హీరోయిన్లు అంత ఈజీగా దొరుకుతారా?
30 ఇయర్స్ ఇండస్ట్రీ... అదే ఎనర్జీ... సినిమా తర్వాత సినిమా చేస్తూ వెంకటేశ్ బిజీగా ఉంటున్నారు. ఇన్నేళ్లుగా యాక్ట్ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులకు ఆయన ఏమాత్రం బోర్ కొట్టలేదు. ఈ ఫ్యామిలీ హీరో నటించిన ‘బాబు బంగారం’ ఈ నెల 12న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. వెంకీ చెప్పిన విశేషాలు... ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ రీమేక్స్ తర్వాత స్ట్రయిట్ సినిమాతో వస్తున్నారు? నాకు రీమేక్, స్ట్రయిట్ అనే భేదం లేదు. కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉండాలి. చాలా రోజులుగా మారుతి నాతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. గతంలో ‘రాధ’ చేయాల్సింది. కానీ, మెటీరియలైజ్ కాలేదు. ‘బాబు బంగారం’ కథ చెప్పగానే బాగా నచ్చింది. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ‘బాబు బంగారం’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మంచి కథ, కామెడీ.. అన్నీ కుదిరాయి. నా క్యారెక్టరైజేషన్లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. గత ఐదేళ్లలో స్క్రీన్‌పై నేనిలా కనిపించలేదు. డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. చెప్పకూడదు గానీ.. చూడ్డానికి చాలా బాగున్నాను (నవ్వుతూ). జిబ్రాన్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. ఓ పెద్ద హీరోతో మారుతి పని చేయడం ఇదే తొలిసారి. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? మారుతి వెరీ వెరీ కూల్ అండ్ ఫ్రెండ్లీ డెరైక్టర్. ఎప్పుడూ అప్సెట్ అవ్వడు, కన్ఫ్యూజన్ అసలు ఉండదు. ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాడు. మారుతి వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు సీనియర్ దర్శకులు గుర్తొచ్చారు. ఎవరైనా సలహా ఇస్తే ఆలోచిస్తాడు, స్వీకరిస్తాడు. ‘భలే భలే మగాడివోయ్’కి ముందు మారుతి చేసిన చిత్రాలు ఆయనకు వేరే ఇమేజ్ తెచ్చాయ్ కదా..? ‘భలే భలే మగాడివోయ్’కి ముందే మారుతీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. మామూలుగా దర్శకుడి గత సినిమా సక్సెస్, ఫెయిల్యూర్లు, ఇమేజ్ను సురేశ్ ప్రొడక్షన్స్ పట్టించుకోదు. కథ నచ్చితే చాన్స్ ఇస్తుంది. నేనూ అంతే. సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఉన్నట్టుంది? ఉంటుంది. ఇప్పుడు మా వయసు ఏంటి? హీరోయిన్లు అంత ఈజీగా దొరుకుతారా.. ఏంటి? నిజం అంగీకరించక తప్పదు. గతంలో నేను 26 మంది హీరోయిన్లను పరిచయం చేశాను. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలి (నవ్వుతూ..) ముందు స్క్రిప్ట్ దొరకాలి. వయసుకు తగ్గ పాత్రలు వస్తే.. తర్వాత హీరోయిన్ ఎవరో ఒకరు దొరుకుతారు. హీరోగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? 30 ఏళ్లైనా ప్రేక్షకులు ఇంకా నన్ను చూస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. షూటింగ్ మధ్యలో ఉండగానే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయని తెలుస్తుంది. నటుడిగా అంతకంటే వరస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు. బయటకు మన బాధ చెప్పుకోలేం. పైగా నవ్వుతూ షూటింగ్ చేయాలి. అటువంటి సందర్భాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఎక్కడో ఓ సినిమా విడుదలవుతుంది. ఓ ఇరవై సన్నివేశాలు కాపీ చేసి మన సినిమాలో పెట్టేస్తారు. అంతా హ్యాపీ.‘ఇండియానా జోన్స్’ స్ఫూర్తితో ‘బొబ్బిలి రాజా’ సెకండాఫ్ తీశాం. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మీ అబ్బాయి అర్జున్ వచ్చే వరకూ సినిమాల్లో నటిస్తానన్నారు. తనను హీరో చేస్తారా? మొన్నా మధ్య క్రికెట్ లీగ్‌లో ఎవరో ‘మీ నాన్న పెద్ద హీరో. ఆయన బాటలో నడుస్తావా?’ అనడిగారు. ‘ఐ హావ్ గాట్ మై ఓన్ ఫుట్ స్టెప్స్. మై ఓన్ ఐడెంటిటీ’ అన్నాడు. 8వ తరగతి చదువుతున్నాడు. బాస్కెట్‌బాల్ బాగా ఆడుతున్నాడు. ఏమవుతాడో చూద్దాం. ‘గోపాల గోపాల’ తర్వాత ఆర్నెల్లు గ్యాప్. ఇప్పుడేమో వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు? మంచి కథలొస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా ఉంది. రానాతో ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ వెంకటేశ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న చిత్రానికి ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘కిశోర్ తిరుమల కథ చెప్పగానే నాకు సూటవుతుందా? అన్నాను. ‘మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్, ఈ కామెడీ టైమింగ్ చాలు’ అన్నాడు. సరే అన్నాను. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ఆరంభమవుతుంది. -
బిచ్చగాడు డైరెక్టర్‌తో వెంకీ
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా డైరెక్టర్ శశితో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శశి కూడా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనతో ఓ సీనియర్ హీరోతో సినిమా చేసుందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబు బంగారం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్.. ఆ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో బిచ్చగాడు దర్శకుడు శశితో కూడా సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు వెంకీ. ఇప్పటికే వెంకీకి కథ వినిపించిన శశి, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన శశి, స్ట్రయిట్ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?
‘‘గాయాలతో ఆస్పత్రిపాలైన క్రిమినల్స్ బాధ చూసి ఏసీపీ కృష్ణ జాలిపడితే ఎటకారంగా చూశారు. సున్నితత్వానికి అమ్మమ్మలాంటి కృష్ణ క్యారెక్టర్లో సడన్‌గా మార్పు వచ్చింది. క్రిమినల్స్‌కి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఈ మార్పుకి కారణం ఏంటి? అనడిగితే ‘బాబు బంగారం’ కాన్సెప్ట్ అంటాడు కృష్ణ. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి’’ అంటున్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ లభించింది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జిబ్రాన్ స్వరపరిచిన పాటలు, ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. వెంకటేశ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. వెంకటేశ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది’’ అన్నారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: బృంద, శేఖర్, స్టంట్స్: రవివర్మ, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ. -
'బాబు బంగారం' సెన్సార్ పూర్తి
'భలే భలే మగాడివోయ్' సినిమాతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి.. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో ఆగష్టు 12న సినిమా విడుదలకు సిద్ధమైనట్టే. ఈ సినిమాలో వెంకీ.. కామెడీ టచ్ ఉన్న పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. వినోదాత్మకంగా మలచిన ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని టాక్. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. -
ఆరంభం అదిరింది కానీ..!
2016 సంవత్సరానికి సూపర్ సక్సెస్‌లతో గ్రాండ్‌గా వెల్ కం చెప్పింది టాలీవుడ్. ఏడాది తొలి రోజునే నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సినీ అభిమానులకు మంచి సంకేతాలను ఇచ్చింది. ఈ జోరు కంటిన్యూ చేస్తూ సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాలు విజయాలు సాధించటంతో ఇక 2016 టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అదే జోరు ను కొనసాగించటంతో టాలీవుడ్ పెద్దలు తడబడ్డారు. సంక్రాంతి రిలీజ్‌ల తరువాత సూపర్ హిట్ అనిపించుకునే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి చిన్న సినిమాలు మ్యాజిక్ చేసినా.. కోట్లల్లో కాసులు కురిపించే సినిమాలు మాత్రం రాలేదు. ఊపిరి సినిమా ఒక్కటి టాలీవుడ్‌కు బాక్సాఫీస్‌కు కాస్త ఊపు తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కాసుల పంట పడించింది. సమ్మర్ బరిలో దిగిన సరైనోడు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటగా.. అదే సీజన్లో వచ్చిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తరువాత విడుదలైన సుప్రీం, అ.. ఆ.., జెంటిల్మన్ సినిమాలు టాలీవుడ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించి సెకండాఫ్ మీద ఆశలు కల్పించాయి. అయితే ద్వితీయార్థంలో కూడా ఇంత వరకు బాక్సాఫీస్ దుమ్ముదులుపే సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోజులు మారాయి, సెల్పీరాజా, నాయకీ లాంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవటంతో సెకండ్ హాఫ్ డల్‌గా మొదలైంది. ఇటీవల విడుదలైన జక్కన్న వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా.. హిట్ టాక్ మాత్రం రాలేదు. అయితే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన పెళ్లిచూపులు మాత్రం మరోసారి కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. ప్రస్తుతం సాధారణ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా రాబోయే సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో మరోసారి వరుస హిట్స్ అలరిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఈ వారం శ్రీరస్తు, శుభమస్తు, మనమంతా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌తో కలెక్షన్ల వేట మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాలతో అయినా ఏడాది మొదట్లో చూపించిన జోరు.. టాలీవుడ్ మరోసారి చూపిస్తుందేమో చూడాలి. -
తమిళంలోకి డబ్ అవుతున్న బాబు బంగారం
వెంకటేష్, నయనతారలు జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావటంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాబు బంగారం సినిమాను తమిళ్లో సెల్వీ పేరుతో భద్రకాళి ఫిలింస్ అధినేత భద్రకాలి ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. తమిళ్లో మంచి సక్సెస్‌లు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ సంగీతం అదించటంతో పాటు, నయనతార తమిళ నాట వరుస సక్సెస్‌లు సాధిస్తుండటం ఈ సినిమాకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
‘బాబు బంగారం’ ఆడియో రిలీజ్
-
అప్పటివరకూ కచ్చితంగా నటిస్తా! - వెంకటేశ్
‘‘ఈ 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ‘మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా’ అని మారుతిని అడిగా. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా’’ అని వెంకటేశ్ అన్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. నయనతార హీరోయిన్. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని డి.సురేశ్‌బాబుకి అందజేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ - ‘‘బాబు బంగారమని నేను 30 ఏళ్ల క్రితమే చెప్పాను. తెలుగులో ఓ నిర్మాత కుమారుడు స్టార్ హీరోగా ఎదగడం, 30 ఏళ్లు పూర్తి చేసుకోవడమనేది ఒక్క వెంకటేశ్‌తోనే జరిగింది. రామానాయుడిగారి ఆశీస్సులతో ఏ ఒక్క నిర్మాతతో కూడా విమర్శలు లేకుండా మంచి పేరుతో వెంకటేశ్ ముప్ఫయ్యేళ్లు విజయవంతంగా కెరీర్ పూర్తి చేసుకున్నాడు. నిర్మాతల కష్టాలు తెల్సిన హీరో. కాశ్మీర్లో ‘బ్రహ్మపుత్రుడు’ షూటింగ్ చేస్తుంటే.. భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండలు ఎక్కాడు. క్రమశిక్షణ, విధేయత, సమయపాలన, ఆసక్తి, ఉత్సాహం, ప్రయత్నం.. అన్నీ కలిపితే వెంకటేశ్. అవే మనల్ని విజయంవైపు నడిపిస్తాయి. అతని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. కథను బట్టి నటించాడు తప్ప, సంస్థను బట్టి కాదు. కథ ప్రాధాన్యంగా సినిమాలు నిర్మించబడ్డాయంటే అవి వెంకటేశ్ సినిమాలే. ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు అందుకున్నదీ వెంకీనే. మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో గానీ, చాలా మంచి టైటిల్ పెట్టాడు. ఈ సినిమా విజయం తర్వాత స్టార్ డెరైక్టర్ అవుతాడు. ఖర్చుకి వెనకాడకుండా కథని నమ్మి సినిమాలు నిర్మించే ఉత్తమ అభిరుచి గల నిర్మాత చినబాబు (రాధాకృష్ణ). చినబాబు కుమారుడు వంశీ, పీడీవీ ప్రసాద్ మంచి విజయం అందుకోవాలి’’ అన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ‘‘వి అంటే విక్టరీ అని ‘కలియుగ పాండవులు’లోనే చూపించా. జనరల్‌గా హీరో కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు, నిర్మాత కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు. నెగటివ్ క్యారెక్టర్‌తో మొదలు పెట్టి దాన్ని పాజిటివ్‌గా చూపించి ‘కలియుగ పాండవులు’ తీశా. ఆగస్టు 14న విడుదలైన ఆ చిత్రం ఇరవైఐదు వారాలు ఆడింది. ఇప్పుడు ‘బాబు బంగారం’ కూడా ఆగస్టులో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా ఇరవై ఐదు వారాలు ఆడాలి, ఆడుతుంది’’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘నేను ఆడియో వేడుకలకు వచ్చేది అభిమానుల ప్రేమ, కళ్లల్లో ఆనందం కోసమే. నా మొదటి చిత్రం నుంచి నాతో ప్రయాణం చేసిన 24 క్రాఫ్ట్స్వారికి థ్యాంక్స్. ఈ సినిమా విడుదల తర్వాత పెళ్లికాని ప్రసాద్ అంటారో.. బాబు బంగారం అని పిలుస్తారో.. మీ ఇష్టం’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ - ‘‘మా నిర్మాత రాధాకృష్ణగారికి ‘బాబు బంగారం’ టైటిల్ బాగా సూటవుతుంది. ఏం కావాలంటే అది ఇచ్చారు. సురేశ్‌బాబు వాళ్ల ఫ్యామిలీలో నన్ను ఓ మెంబర్లా చూసుకున్నారు. దాసరి గారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆగస్టు 12న సినిమా విడుదల వుతుంది’’ అన్నారు. నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, సురేశ్‌బాబు, ‘జెమిని’ కిరణ్, ‘దిల్’ రాజు, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ, హీరో నాని, హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, మ్యూజిక్ డెరైక్టర్ జిబ్రాన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఆ పాట లేకుండానే బాబు బంగారం రిలీజ్..?
వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా కబాలి రిలీజ్ డేట్ ప్రకటించకపోవటంతో బాబు బంగారం సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అదే సమయంలో హీరోయిన్ నయనతార షూటింగ్‌కు సహకరించక పోవటం కూడా ఒక కారణం అన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోవటంతో ఒక పాట షూటింగ్ మిగిలి ఉండగానే, నయనతార ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. దీంతో ఇక షూటింగ్లో పాల్గొనేది లేదంటూ నయన్ చెన్నై వెళ్లిపోయింది. తరువాత నయన్‌ను ఒప్పించి ఆ ఒక్క పాట షూట్ చేయడానికి యూనిట్ సభ్యులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇప్పటికే వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న నయనతార, మరో సారి వెంకటేష్ కోసం డేట్స్ ఇవ్వలేకపోయింది. ఇక చేసేదేమి లేక ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. -
వరుసగా రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో చాలా రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్‌ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫైనల్‌గా ఈ నెల 22న కబాలి రిలీజ్ అవుతున్నట్టుగా తేలిపోవటంతో మిగతా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లు కన్ఫామ్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కబాలి దెబ్బకు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక తికమక పడ్డ బాబు బంగారం, జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావటంతో ఆగస్ట్ 12న ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా తన నెక్ట్స్ సినిమా జక్కన్నకు డేట్ ప్రకటించేశాడు. ముందుగా 22న రిలీజ్ చేయాలని భావించిన అదే రోజు కబాలి రిలీజ్ అవుతుండటంతో ఒక వారం ఆలస్యంగా 29న ఇడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు. సుప్రీమ్ సినిమా సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న సాయి తిక్క సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కబాలి హవా తెలుగు నాట వారానికి మించి ఉండదన్న నమ్మకంతో కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. -
ఆగస్టులో బాక్స్ ఆఫీస్ బిగ్ ఫైట్
-
మల్లెల వానకు మంచి రెస్పాన్స్
‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు విక్టరీ వెంకటేశ్, నయనతార. వీరిద్దరూ కలసి ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం ‘బాబు బంగారం’. ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌కు మారుతి ఫుల్స్టాప్ పెట్టారు. ఈ నెల 24న పాటలు, ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 29న ‘బాబు బంగారం’ విడుదల కానుందనే టాక్ వినిపించింది. కానీ, ఆడియో, చిత్రం విడుదల తేదీలను దర్శకుడు స్పష్టం చేయడంతో వెంకీ అభిమానులకు మూవీపై స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రంలో వెంకీ పోలీస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. జిబ్రాన్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటల్లో ఇటీవల విడుదల చేసిన ‘మల్లెల వానలా మంచు తుఫానులా..’ పాటకు మంచి స్పందన లభించిందని దర్శక-నిర్మాతలు చెప్పారు. -
'బాబు బంగారం'కి డేట్ దొరికింది
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా ఆలస్య కావటం వెంకటేష్ సినిమాకు కలిసొచ్చింది. తొలిసారిగా మారుతి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా బాబు బంగారం. వెంకటేష్, నయనతారలు జంటగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌పై చిత్రయూనిట్ డైలమాలో ఉన్నారు. కబాలి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటం ఆలస్యం కావటంతో బాబు బంగారం రిలీజ్ డైలామాలో పడింది. ఫైనల్‌గా జూలై 15న సినిమా రిలీజ్ చేద్దామని భావించినా.., వారం గ్యాప్‌లో కబాలి రిలీజ్ ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ ఉండటంతో సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా జనతాగ్యారేజ్ వాయిదా పడటంతో బాబు బంగారం యూనిట్ రిలీజ్ డేట్‌ను ముందుకు తీసుకువచ్చారు. జనతా గ్యారేజ్ రిలీజ్ అవుతుందనుకున్న ఆగస్టు 12న బాబు బంగారం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. -
దొరలో నయన
రియల్గానైనా, రీల్లోనైనా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నటి పేరు నయనతార. ప్రేమ వ్యవహారంలో ప్రకంపనలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ నటనాపరంగా సంచలనం కలిగిస్తున్నారు. రీఎంట్రీ తరువాత కూడా టాప్ నాయకిగా వెలుగొందుతున్న అరుదైన నటి నయనతార అనవచ్చు. ఇటు ప్రముఖ కథానాయకులతోనూ ఇటు వర్ధమాన నటులతోనూ నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న ఆ కేరళ భామ ప్రస్తుతం కోలీవుడ్‌లో విక్రమ్ సరసన ఇరుముగన్, కార్తీతో కాష్మోరా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తున్నారు. తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రాన్ని పూర్తి చేశారు. త్వరలో మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. అలాగే జయంరవితో మరోసారి జత కట్టనున్నట్లు ప్రచారంలో ఉంది. నయనతార ఇంతకు ముందు నటించిన కథానాయకి ఇతివృత్తంతో కూడిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు దాస్ దర్శకత్వంలో తాజాగా మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు తంబిరామయ్య, హరీష్ఉత్తమ్ ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ల ద్వయం సంగీతాన్ని దినేశ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రానికి దొర అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇది బుల్లి తెరలో ప్రచారం అవుతున్న ఒక పాపులర్ కార్యక్రమం పేరులోని ఒక భాగం అన్నది గమనార్హం. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మొత్తం మీద మాయతో ప్రేక్షకులను అలరించిన నయనతార ఈ దొరతో ఏ మేరకు వారి హృదయాలను దోచుకుంటుందో చూద్దాం. -
బాబు బంగారం కొత్త కథే..!
భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా బాబు బంగారం. వెంకటేష్ నయనతార జంటగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తి చేసి ఈ నెల 29న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్, నయనతారల కాంబినేషన్లో మారుతి దర్శకత్వంలో రాధ అనే సినిమా ప్రారంభమై.. ఆగిపోయింది. అయితే అదే కథను కొద్ది పాటి మార్పులతో బాబు బంగారంగా తెరకెక్కిస్తున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపించింది. ఈ వార్తలను ఖండించిన మారుతి, రాధ కథతో బాబు బంగారానికి అసలు సంబందం లేదని, ఇది పూర్తిగా కొత్త కథ అని క్లారిటీ ఇచ్చాడు. -
వెంకటేష్‌ను ఇబ్బంది పెడుతున్న రజనీ
చాలా కాలం తరువాత సోలో హీరోగా కమర్షియల్ స్టామినా చూపించడానికి వస్తున్నాడు సీనియర్ హీరో వెంకటేష్. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.., రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ముందుగా జూలై 1న బాబు బంగారాన్ని రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రజనీ కబాలి రిలీజ్ అవుతుందన్న ప్రకటన రావటంతో వెనక్కు తగ్గారు. అయితే కబాలి రిలీజ్ డేట్ ఇంత వరకు అధికారంగా ప్రకటించకపోవటంతో బాబు బంగారం టీం ఆలోచనలో పడింది. తొందరపడి డేట్ ప్రకటిస్తే తరువాత రజనీకాంత్‌తో పోటి పడాల్సి వస్తుంది, అలా అని ఆలస్యం చేస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు. -
చెన్నైకు బంగారం
బాబు బంగారంలాంటోడు. అందుకే ఆ బాబంటే అందరికీ ఇష్టం. మరి.. ఈ బాబు ఏం చేస్తాడు? అసలు బంగారం అని ఎందుకు అనిపించుకుంటాడు? అనేది ‘బాబు బంగారం’లో చూడాల్సిందే. టైటిల్ రోల్లో వెంకటేశ్ నటిస్తుండగా, ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి పాటను చెన్నైలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జూలై 4 నుంచి 8 వరకూ చిత్రీకరించనున్నారు. జిబ్రాన్ స్వరపరిచిన పాటలను అదే నెల 9న, సినిమాని 29న విడుదల చేయాలనుకుంటున్నారు. -
రిలీజ్‌కు రెడీ అవుతున్న బాబు బంగారం
సక్సెస్ ఫుల్ జంట వెంకటేష్, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. ఇంతకుముందు భలే భలే మొగాడివోయ్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న మారుతి, ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక్క పాట మినహా ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా.. తాజాగా ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జులై 9న ఈ సినిమా ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే బాబు బంగారం సినిమా రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో బాబు బంగారం రిలీజ్ డేట్ ను కూడా పెండింగ్ లో పెట్టారు. కబాలితో పోటీ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బాబు బంగారం యూనిట్. -
జూలై 9న 'బాబు బంగారం' ఆడియో
సక్సెస్ ఫుల్ పెయిర్ వెంకటేష్, నయనతారలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. భలే భలే మొగాడివోయ్తో తానేంటో ప్రూవ్ చేసుకున్న మారుతి, ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక్క పాట మినహా ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా.. తాజాగా ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 9న ఈ సినిమా ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
అయ్యో... అయ్యో అయ్యయ్యో...
ఏసీపీ కృష్ణ సిన్సియర్ పోలీసాఫీసర్. క్రిమినల్స్‌ను తుక్కు రేగ్గొట్టడంలో ఫస్ట్. అలానే ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉంటే కరిగిపోవడంలో కూడా ఫస్టే. మంచితనానికి మారు పేరులాంటివాడు. కృష్ణకు ఓ మంచి అమ్మాయి కనె క్ట్ అయింది. మనసుకు మనసు, జాలికి జాలి... అలానే ఏజ్‌కు ఏజ్ కూడానూ. ‘బాబు బంగారం’లో ఏసీపీ కృష్ణగా కనిపించనున్న హీరో వెంకటేశ్ పాత్ర చిత్రణ నవ్వులు పూయిస్తుందని సోమవారం విడుదల చేసిన టీజర్ ద్వారా మారుతి చిన్న హింట్ ఇచ్చేశారు. ఈ పన్నెండేళ్ల కాలంలో ‘ఘర్షణ’, ‘ఈనాడు’ చిత్రాల తర్వాత వెంకటేశ్ పోలీస్‌గా కనిపించనున్న చిత్రం ఇదే. ‘బొబ్బిలి రాజా’లో వెంకటేశ్ సిగ్నేచర్ డైలాగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో...’ను మళ్లీ ఈ సినిమాలో ఉపయోగించి, ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్న వెంకీ
పేరులోనే విక్టరీని సొంతం చేసుకున్న హీరో వెంకటేష్. తన కెరీర్లోన బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బొబ్బిలి రాజా చిత్రంలో వెంకీ 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అంటూ కామెడీని పండించిన విషయం తెలిసిందే. ఆ ఊతపదం కూడా కొన్ని సంవత్సరాల వరకూ జనాల నోళ్లలో బాగా నానింది. మరోసారి ఆ ఊతపదంతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన అతడి తాజా చిత్రం 'బాబు బంగారం' టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో అతడు ఓ కామెడీ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. టీజర్లో.... మదర్ థెరిస్సా మళ్లీ పుట్టి పోలీస్ డ్రస్ వేస్తే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ అనే డైలాగ్‌తో వెంకీ పాత్రను చెప్పకనే చెప్పారు. ఇక టీజర్లో హీరోయిన్ నయన్‌తార, వెంకటేష్ జంట కనువిందు చేస్తోంది. గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ పోలీస్ సినిమాలోని పాత్ర తరహాలోనే బాబు బంగారం సినిమాలోనూ కామెడీ పోలీస్ గా కనిపించనున్నాడు వెంకీ. అందుకు తగ్గట్టుగా ఫిట్ బాడీతో ఘర్షణ సినిమాలో కనిపించినట్టుగా ఈ సినిమాలో కూడా కనిపించాడు. తన గత సినిమాలతో పోలిస్తే ఈ ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. అలాగే యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయటంలో మారుతికి కూడా మంచి రికార్డ్ ఉంది. దీంతో బాబు బంగారం సినిమాతో వెంకీకి మరో హిట్ ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తీసుకుని వెంకటేష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగ వంశి, పీడీవీ ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. -
అనుష్కకు వెల్కమ్.. నయనకు నో..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలను హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాగ్ లాంటి స్టార్లు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటుంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్న హీరోలు మాత్రం తమ వయసుకు తగ్గ జోడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రం సీనియర్ హీరోలకు సూట్ అవుతుండటంతో వారి మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. అనుష్క బాహుబలి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సీనియర్ హీరోల సినిమాలు నయనతార చేతికి వెళుతున్నట్టుగా కనిపించాయి. బాహుబలి షూటింగ్ చివరి దశకు రావటంతో సౌత్ ఇండస్ట్రీలో సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ముందు నుంచి నయనతార హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అనుష్క పేరును పరిశీలిస్తున్నారట. బాబు బంగారం షూటింగ్ విషయంలో నయన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక పోవటం కూడా ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3, తలా 57 సినిమాల్లో నటిస్తున్న అనుష్క, చిరు సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి. -
వెంకీని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్
దృశ్యం, గోపాల గోపాల లాంటి హిట్ సినిమాల తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.., ప్రస్తుతం యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎడల్ట్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న మారుతి, భలే భలే మొగాడివోయ్ సినిమా సక్సెస్‌తో ఆ ఇమేజ్ను దూరం చేసుకున్నాడు. తొలిసారిగా వెంకటేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో ఆ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలనే కసితో పని చేస్తున్నాడు. వెంకీ కూడా బాబు బంగారం సినిమా సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన జనరేషన్ హీరో అయినా నాగార్జున భారీ సక్సెస్‌లు సాధిస్తుండటం, కుర్ర హీరోల నుంచి గట్టి పోటి ఉండటంతో బాబు బంగారం సక్సెస్ వెంకీ కెరీర్‌కు కీలకం కానుంది. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్‌ను హీరోయిన్ తెగ ఇబ్బంది పెడుతుందట. ఈ సినిమాలో వెంకీ సరసన మూడోసారి జత కడుతున్న నయనతార, సరైన సమయంలో షూటింగ్‌కు హజరు కాకుండా చిత్రయూనిట్‌ను ఇబ్బందికి గురి చేస్తోందట. నయన్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు షూటింగ్ ఆలస్యం అయ్యింది. కేవలం నయన్ డేట్స్ అడ్జస్ట్ చేయని కారణంగానే ముందుగా అనుకున్నట్టుగా జూలై 1న సినిమాను రిలీజ్ చేయటం సాధ్ పడటం లేదంటున్నారు చిత్రయూనిట్. అయితే వెంకీకి నయన్ హిట్ పెయిర్ కావటంతో పాటు వెంకీ ఏజ్‌కు సూట్ అయ్యే స్టార్ హీరోయిన్లు ఎవరు లేకపోవటంతో ఎలాగోలా నయన్‌తోనే సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారట. -
పూరి డైరెక్షన్లో వెంకీ
టాలీవుడ్ అగ్ర కథానాయకులు మైల్ స్టోన్ మూవీస్‌కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను ప్రారంభించగా, నందమూరి బాలకృష్ణ కూడా 100వ సినిమాను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లో మరో సీనియర్ హీరో జాయిన్ అవుతున్నాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన కెరీర్లో 75 సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన 73వ సినిమాగా మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు. ఈ రెండు సినిమాల తరువాత తన 75 సినిమాను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే వెంకీ కోసం ఓ లైన్ సిద్ధం చేశాడట. వెంకీకి కూడా ఆ లైన్ నచ్చటంతో పూర్తి స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రోగ్ సినిమాను పూర్తి చేసిన పూరి, కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాను ప్రారంభించాడు. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి వెంకటేష్ సినిమా ఈ సినిమాలు పూర్తయ్యాక ఉంటుందా..? లేక మధ్యలోనే పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
కోపిష్ఠి పక్షులతో... కామెడీ బాబు!
ప్రపంచంలో ఏ పక్షీ కోపంగా ఉన్నట్టు కనబడదు. ఒక్క యాంగ్రీ బర్డ్ తప్ప. నూనెలో ఆవాలు చిటపటలాడినట్లు మొహం మీద ఎప్పుడూ చిటపటలే. ఇంతకీ యాంగ్రీ బర్డ్స్ నిజమైన పక్షులు కావనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల కోసం సృష్టించబడిన పక్షులివి. యాంగ్రీ బర్డ్స్ గేమ్స్, కార్టూన్ షోస్ గురించి తెలిసే ఉంటుంది. ఈ పక్షులు బంగారం లాంటి ఆ బాబుని కలవాలనుకున్నాయ్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీకి వెళ్లాయి. బాబేమో హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నాడు. హఠాత్తుగా ఊడిపడిన ఈ కోపిష్ఠి పక్షులను చూసి, ఖుష్ అయ్యాడు. మీ కోపాన్ని పోగొట్టేస్తానంటూ సరదాగా జోకులేశాడు. అంతే... కోపిష్ఠి పక్షులు ఫక్కున నవ్వేశాయ్. మామూలుగా కాదు.. పొట్టచెక్కలయ్యేలా నవ్వేశాయ్. బంగారం లాంటి బాబుగా వెంకటేశ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బాబు... బంగారం’. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ పరిచయమైపోయిన యాంగ్రీ బర్డ్స్ వేషాలతో షాపింగ్ మాల్స్‌లో కొంతమంది సందడి చేస్తు న్నారు. వీళ్లే ‘బాబు...బంగారం’ సెట్లోకి అడుగుపెట్టారు. బిజీగా షూటింగ్ చేస్తున్న చిత్రబృందం పక్షుల రాకతో కాసేపు రిలాక్స్ అయింది. -
బాబు బంగారంలో వెంకీ ఇలా..
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో 'బాబు బంగారం' సినిమా చేస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మారుతి.. వెంకటేష్ హీరోగా కూడా మరోసారి పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ముఖ్యంగా తన వయసుకు, ఇమేజికి తగ్గ కథ కోసం చాలాకాలం ఎదురుచూసిన వెంకీ ఈ సినిమాతో మంచి సక్సెస్ మీద కన్నేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది సందర్భంగా రిలీజ్ అయ్యింది. గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ పోలీస్ సినిమాలోని పాత్ర తరహాలోనే బాబు బంగారం సినిమాలోనూ కామెడీ పోలీస్ గా కనిపించనున్నాడు వెంకీ. అందుకు తగ్గట్టుగా ఫిట్ బాడీతో ఘర్షణ సినిమాలో కనిపించినట్టుగా ఈ సినిమాలో కూడా కనిపించనున్నాడు. తన గత సినిమాలతో పోలిస్తే ఈ ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయటంలో మారుతికి కూడా మంచి రికార్డ్ ఉంది. దీంతో బాబు బంగారం సినిమాతో వెంకీకి మరో హిట్ ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
'బాబు బంగారం' యూత్‌కు కనెక్టయితే హిట్టే
సినీ దర్శకుడు మారుతి చిన్న సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మారుతి. వరుసగా ఐదు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తన సక్సెస్ సీక్రెట్‌ను చెప్పారు. యూత్ ఆలోచనలకు దగ్గరగా సినిమా ఉంటే హిట్టు గ్యారంటీ అని అన్నారు. ప్రస్తుతం తన పంథాను విడిచి పెద్ద హీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మారుతి.. భట్లపాలెం బీవీసీ కళాశాలలో జరుగుతున్న హోరైజన్-2కే16 ముగింపు ఉత్సవాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - అమలాపురం రూరల్ ‘‘మచిలీపట్నంలో డిగ్రీ చదివాను. నేమ్ బోర్డులు తయారు చేసేవాడిని. కంప్యూటర్ యానిమేషన్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లాను. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈరోజుల్లో... బస్టాప్ వంటి లో బడ్జెట్ సినిమాలు తీశాను. అవి మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో నిలదొక్కుకున్నాను. నాదంటూ ట్రెండ్ ఏమీ ఉండదు. మనం తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్టయితే తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హీరో వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమా తీస్తున్నాను. షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. త్వరలోనే యానిమేషన్ చిత్రాలు తీయాలనుకుంటున్నాను. దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్, జంధ్యాల, ప్రస్తుత తరంలో రాజమౌళి అంటే ఇష్టం. ఇక నాకంటూ ఓ స్టైల్ ఉంది. దానితోనే సక్సెస్ అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. వారితో కలిసి పనిచేశాను. కెరీర్లో స్థిరపడాలంటే యువత లక్ష్యం నిర్దేశించుకోవాలి. మనం ఏం చేస్తున్నా.. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం.’’ -
మరో తమిళ్ రీమేక్‌లో వెంకీ
కొంత కాలంగా స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అయిన సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. అయితే పెద్దగా రిస్క్ చేయటం ఇష్టం లేని ఈ సీనియర్ హీరో ఎక్కువగా రీమేక్ సినిమాల మీదే దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే ఓ రీమేక్‌కు ఓకే చెప్పేసిన వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌పై కూడా దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్న వెంకటేష్, ఆ సినిమా తరువాత బాలీవుడ్లో మంచి విజయం సాధించిన 'సాలా ఖద్దూస్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన వెంకీ, ఆ సినిమాతో పాటు మరో రీమేక్‌కు కూడా రెడీ అవుతున్నాడు. ఇటీవల తమిళ్లో రిలీజ్ అయిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించే అవకాశం ఉంది. -
జూన్ 1న 'బాబు బంగారం'
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్లో నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి మంచి ఫాంలో ఉండటం కూడా సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. 'భలే భలే మొగాడివోయ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి, వెంకటేష్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బాబు బంగారం సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు. మేకింగ్‌తో పాటు రిలీజ్ విషయంలో కూడా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాంటి పోటీ లేకుండా జూన్ 1న సోలోగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వెంకటేష్ సరసన హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార నటిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ కామెడీ పోలీస్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
వెంకటేష్ 'బాబు బంగారం'
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కుర్ర హీరోల పోటీ పెరిగిపోవటంతో ఎలాంటి కథను ఎంచుకోవాలనే ఆలోచనలతో చాలా టైం తీసుకున్న వెంకీ, తాజాగా భలే బలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'బాబు బంగారం' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. లక్ష్మీ, తులసీ లాంటి హిట్ సినిమాల తరువాత మరోసారి నయనతార వెంకటేష్‌తో జోడి కడుతోంది. ప్రజెంట్ భారీ సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నయనతార హీరోయిన్గా నటిస్తుండటం ఈ సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించి 2016 జూన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.