హీరోయిన్లు అంత ఈజీగా దొరుకుతారా?
30 ఇయర్స్ ఇండస్ట్రీ... అదే ఎనర్జీ... సినిమా తర్వాత సినిమా చేస్తూ వెంకటేశ్ బిజీగా ఉంటున్నారు. ఇన్నేళ్లుగా యాక్ట్ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులకు ఆయన ఏమాత్రం బోర్ కొట్టలేదు. ఈ ఫ్యామిలీ హీరో నటించిన ‘బాబు బంగారం’ ఈ నెల 12న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. వెంకీ చెప్పిన విశేషాలు...
‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ రీమేక్స్ తర్వాత స్ట్రయిట్ సినిమాతో వస్తున్నారు?
నాకు రీమేక్, స్ట్రయిట్ అనే భేదం లేదు. కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉండాలి. చాలా రోజులుగా మారుతి నాతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. గతంలో ‘రాధ’ చేయాల్సింది. కానీ, మెటీరియలైజ్ కాలేదు. ‘బాబు బంగారం’ కథ చెప్పగానే బాగా నచ్చింది. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
‘బాబు బంగారం’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి?
మంచి కథ, కామెడీ.. అన్నీ కుదిరాయి. నా క్యారెక్టరైజేషన్‌లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. గత ఐదేళ్లలో స్క్రీన్‌పై నేనిలా కనిపించలేదు. డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. చెప్పకూడదు గానీ.. చూడ్డానికి చాలా బాగున్నాను (నవ్వుతూ). జిబ్రాన్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు.
ఓ పెద్ద హీరోతో మారుతి పని చేయడం ఇదే తొలిసారి. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?
మారుతి వెరీ వెరీ కూల్ అండ్ ఫ్రెండ్లీ డెరైక్టర్. ఎప్పుడూ అప్‌సెట్ అవ్వడు, కన్ఫ్యూజన్ అసలు ఉండదు. ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాడు. మారుతి వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు సీనియర్ దర్శకులు గుర్తొచ్చారు. ఎవరైనా సలహా ఇస్తే ఆలోచిస్తాడు, స్వీకరిస్తాడు.
‘భలే భలే మగాడివోయ్’కి ముందు మారుతి చేసిన చిత్రాలు ఆయనకు వేరే ఇమేజ్ తెచ్చాయ్ కదా..?
‘భలే భలే మగాడివోయ్’కి ముందే మారుతీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. మామూలుగా దర్శకుడి గత సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌లు, ఇమేజ్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ పట్టించుకోదు. కథ నచ్చితే చాన్స్ ఇస్తుంది. నేనూ అంతే.
సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఉన్నట్టుంది?
ఉంటుంది. ఇప్పుడు మా వయసు ఏంటి? హీరోయిన్‌లు అంత ఈజీగా దొరుకుతారా.. ఏంటి? నిజం అంగీకరించక తప్పదు. గతంలో నేను 26 మంది హీరోయిన్‌లను పరిచయం చేశాను. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలి (నవ్వుతూ..) ముందు స్క్రిప్ట్ దొరకాలి. వయసుకు తగ్గ పాత్రలు వస్తే.. తర్వాత హీరోయిన్ ఎవరో ఒకరు దొరుకుతారు.
హీరోగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?
30 ఏళ్లైనా ప్రేక్షకులు ఇంకా నన్ను చూస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. షూటింగ్ మధ్యలో ఉండగానే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయని తెలుస్తుంది. నటుడిగా అంతకంటే వరస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు. బయటకు మన బాధ చెప్పుకోలేం. పైగా నవ్వుతూ షూటింగ్ చేయాలి. అటువంటి సందర్భాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఎక్కడో ఓ సినిమా విడుదలవుతుంది. ఓ ఇరవై సన్నివేశాలు కాపీ చేసి మన సినిమాలో పెట్టేస్తారు. అంతా హ్యాపీ.‘ఇండియానా జోన్స్’ స్ఫూర్తితో ‘బొబ్బిలి రాజా’ సెకండాఫ్ తీశాం. ఇలాంటివి ఎన్నో జరిగాయి.
మీ అబ్బాయి అర్జున్ వచ్చే వరకూ సినిమాల్లో నటిస్తానన్నారు. తనను హీరో చేస్తారా?
మొన్నా మధ్య క్రికెట్ లీగ్‌లో ఎవరో ‘మీ నాన్న పెద్ద హీరో. ఆయన బాటలో నడుస్తావా?’ అనడిగారు. ‘ఐ హావ్ గాట్ మై ఓన్ ఫుట్ స్టెప్స్. మై ఓన్ ఐడెంటిటీ’ అన్నాడు. 8వ తరగతి చదువుతున్నాడు. బాస్కెట్‌బాల్ బాగా ఆడుతున్నాడు. ఏమవుతాడో చూద్దాం.
‘గోపాల గోపాల’ తర్వాత ఆర్నెల్లు గ్యాప్. ఇప్పుడేమో వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు?
మంచి కథలొస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా ఉంది. రానాతో ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’
వెంకటేశ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న చిత్రానికి ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘కిశోర్ తిరుమల కథ చెప్పగానే నాకు సూటవుతుందా? అన్నాను. ‘మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెషన్, ఈ కామెడీ టైమింగ్ చాలు’ అన్నాడు. సరే అన్నాను. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ఆరంభమవుతుంది.