మల్లెల వానకు మంచి రెస్పాన్స్
‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు విక్టరీ వెంకటేశ్, నయనతార. వీరిద్దరూ కలసి ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం ‘బాబు బంగారం’. ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌కు మారుతి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ నెల 24న పాటలు, ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 29న ‘బాబు బంగారం’ విడుదల కానుందనే టాక్ వినిపించింది.
కానీ, ఆడియో, చిత్రం విడుదల తేదీలను దర్శకుడు స్పష్టం చేయడంతో వెంకీ అభిమానులకు మూవీపై స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రంలో వెంకీ పోలీస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. జిబ్రాన్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటల్లో ఇటీవల విడుదల చేసిన ‘మల్లెల వానలా మంచు తుఫానులా..’ పాటకు మంచి స్పందన లభించిందని దర్శక-నిర్మాతలు చెప్పారు.