'బాబు బంగారం' మూవీ రివ్యూ
టైటిల్ : బాబు బంగారం
జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
తారాగణం : వెంకటేష్, నయనతార, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్
సంగీతం : గిబ్రాన్
దర్శకత్వం : మారుతి
నిర్మాత : నాగవంశీ, పిడివి ప్రసాద్
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్, చాలా కాలం తరువాత తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకీ సరసన నయనతార హీరోయిన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను బాబు బంగారం అందుకున్నాడా..?
కథ :
ఎసిపి కృష్ణ (వెంకటేష్) తన తాత లాగే అందరిపై జాలి పడే మనస్థత్త్వం ఉన్న వ్యక్తి. తను పోలీస్ ఆఫీసర్ అయినా సరే.. తను పట్టుకున్న దొంగల మీద కూడా జాలీ చూపించే అంత మంచి తనం. అలాంటి కృష్ణకు శైలజ(నయనతార) పరిచయం అవుతుంది. తొలి చూపులనే ఆమెను ఇష్టపడ్డ కృష్ణ శైలజతో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే శైలజ కుటుంబానికి ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని కృష్ణమురళి), మల్లేష్ యాదవ్( సంపత్ రాజ్ )ల నుంచి ముప్పు ఉంటుంది. అసలు పుచ్చప్ప, మల్లేష్లతో శైలజ కుటుంబానికి ఉన్న గొడవ ఏంటి..? పుచ్చప్ప, మల్లేష్లకు కృష్ణ ఎలా బుద్ది చెప్పాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో నటించిన వెంకటేష్, తనలోని కామెడీ టైమింగ్ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అందంగా కనిపించాడు. తన మార్క్ కామెడీ సీన్స్తో పాటు యాక్షన్, సెంటిమెంట్ సీన్స్తోనూ ఆకట్టుకున్నాడు. శైలజ పాత్రలో నయనతార ఆకట్టుకుంది. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా గ్లామర్తో కట్టిపడేసింది. ముఖ్యంగా వెంకటేష్, నయనతార కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. కామెడీ విలన్లుగా పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్లు మెప్పించారు. బత్తాయి బాబ్జీ పాత్రలో 30 ఇయర్స్ పృథ్దీ, ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్లు తమ పరిధి మేరకు నవ్వించారు.
సాంకేతిక నిపుణులు :
తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు మారుతి ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా పక్కా కమర్షియల్ మూసలో సినిమాను తెరకెక్కించాడు. హీరో అందరి మీద జాలి పడటం అన్న ఒక్క పాయింట్ కామెడీ కోసం కొత్తగా ప్రజెంట్ చేసినా మిగతా సినిమా అంతా రొటిన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్లా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్స్తో సెకండ్ హాఫ్ యాక్షన్ డ్రామాతో లాగించేశాడు. గిబ్రాన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్
కామెడీ సీన్స్
స్టైలిష్ యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరి
స్క్రీన్ ప్లే
ఓవరాల్గా బాబు బంగారం, సరదాగా నవ్వుకునే రొటీన్ కామెడీ ఎంటర్టైనర్