అప్పటివరకూ కచ్చితంగా నటిస్తా! - వెంకటేశ్
‘‘ఈ 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ‘మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్‌పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా’ అని మారుతిని అడిగా. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా’’ అని వెంకటేశ్ అన్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. నయనతార హీరోయిన్. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని డి.సురేశ్‌బాబుకి అందజేశారు.
అనంతరం దాసరి మాట్లాడుతూ - ‘‘బాబు బంగారమని నేను 30 ఏళ్ల క్రితమే చెప్పాను. తెలుగులో ఓ నిర్మాత కుమారుడు స్టార్ హీరోగా ఎదగడం, 30 ఏళ్లు పూర్తి చేసుకోవడమనేది ఒక్క వెంకటేశ్‌తోనే జరిగింది. రామానాయుడిగారి ఆశీస్సులతో ఏ ఒక్క నిర్మాతతో కూడా విమర్శలు లేకుండా మంచి పేరుతో వెంకటేశ్ ముప్ఫయ్యేళ్లు విజయవంతంగా కెరీర్ పూర్తి చేసుకున్నాడు. నిర్మాతల కష్టాలు తెల్సిన హీరో. కాశ్మీర్‌లో ‘బ్రహ్మపుత్రుడు’ షూటింగ్ చేస్తుంటే.. భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండలు ఎక్కాడు. క్రమశిక్షణ, విధేయత, సమయపాలన, ఆసక్తి, ఉత్సాహం, ప్రయత్నం.. అన్నీ కలిపితే వెంకటేశ్. అవే మనల్ని విజయంవైపు నడిపిస్తాయి. అతని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. కథను బట్టి నటించాడు తప్ప, సంస్థను బట్టి కాదు. కథ ప్రాధాన్యంగా సినిమాలు నిర్మించబడ్డాయంటే అవి వెంకటేశ్ సినిమాలే. ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు అందుకున్నదీ వెంకీనే. మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో గానీ, చాలా మంచి టైటిల్ పెట్టాడు. ఈ సినిమా విజయం తర్వాత స్టార్ డెరైక్టర్ అవుతాడు. ఖర్చుకి వెనకాడకుండా కథని నమ్మి సినిమాలు నిర్మించే ఉత్తమ అభిరుచి గల నిర్మాత చినబాబు (రాధాకృష్ణ). చినబాబు కుమారుడు వంశీ, పీడీవీ ప్రసాద్ మంచి విజయం అందుకోవాలి’’ అన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ‘‘వి అంటే విక్టరీ అని ‘కలియుగ పాండవులు’లోనే చూపించా. జనరల్‌గా హీరో కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు, నిర్మాత కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు. నెగటివ్ క్యారెక్టర్‌తో మొదలు పెట్టి దాన్ని పాజిటివ్‌గా చూపించి ‘కలియుగ పాండవులు’ తీశా. ఆగస్టు 14న విడుదలైన ఆ చిత్రం ఇరవైఐదు వారాలు ఆడింది. ఇప్పుడు ‘బాబు బంగారం’ కూడా ఆగస్టులో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా ఇరవై ఐదు వారాలు ఆడాలి, ఆడుతుంది’’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘నేను ఆడియో వేడుకలకు వచ్చేది అభిమానుల ప్రేమ, కళ్లల్లో ఆనందం కోసమే. నా మొదటి చిత్రం నుంచి నాతో ప్రయాణం చేసిన 24 క్రాఫ్ట్స్‌వారికి థ్యాంక్స్. ఈ సినిమా విడుదల తర్వాత పెళ్లికాని ప్రసాద్ అంటారో.. బాబు బంగారం అని పిలుస్తారో.. మీ ఇష్టం’’ అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ‘‘మా నిర్మాత రాధాకృష్ణగారికి ‘బాబు బంగారం’ టైటిల్ బాగా సూటవుతుంది. ఏం కావాలంటే అది ఇచ్చారు. సురేశ్‌బాబు వాళ్ల ఫ్యామిలీలో నన్ను ఓ మెంబర్‌లా చూసుకున్నారు. దాసరి గారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆగస్టు 12న సినిమా విడుదల వుతుంది’’ అన్నారు. నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, సురేశ్‌బాబు, ‘జెమిని’ కిరణ్, ‘దిల్’ రాజు, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ, హీరో నాని, హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, మ్యూజిక్ డెరైక్టర్ జిబ్రాన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.