
ఆరంభం అదిరింది కానీ..!
2016 సంవత్సరానికి సూపర్ సక్సెస్లతో గ్రాండ్గా వెల్ కం చెప్పింది టాలీవుడ్. ఏడాది తొలి రోజునే నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సినీ అభిమానులకు మంచి సంకేతాలను ఇచ్చింది. ఈ జోరు కంటిన్యూ చేస్తూ సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాలు విజయాలు సాధించటంతో ఇక 2016 టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అదే జోరు ను కొనసాగించటంతో టాలీవుడ్ పెద్దలు తడబడ్డారు.
సంక్రాంతి రిలీజ్ల తరువాత సూపర్ హిట్ అనిపించుకునే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి చిన్న సినిమాలు మ్యాజిక్ చేసినా.. కోట్లల్లో కాసులు కురిపించే సినిమాలు మాత్రం రాలేదు. ఊపిరి సినిమా ఒక్కటి టాలీవుడ్కు బాక్సాఫీస్కు కాస్త ఊపు తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కాసుల పంట పడించింది.
సమ్మర్ బరిలో దిగిన సరైనోడు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటగా.. అదే సీజన్లో వచ్చిన సర్థార్ గబ్బర్సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తరువాత విడుదలైన సుప్రీం, అ.. ఆ.., జెంటిల్మన్ సినిమాలు టాలీవుడ్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించి సెకండాఫ్ మీద ఆశలు కల్పించాయి.
అయితే ద్వితీయార్థంలో కూడా ఇంత వరకు బాక్సాఫీస్ దుమ్ముదులుపే సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోజులు మారాయి, సెల్పీరాజా, నాయకీ లాంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవటంతో సెకండ్ హాఫ్ డల్‌గా మొదలైంది. ఇటీవల విడుదలైన జక్కన్న వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా.. హిట్ టాక్ మాత్రం రాలేదు. అయితే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన పెళ్లిచూపులు మాత్రం మరోసారి కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది.
ప్రస్తుతం సాధారణ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా రాబోయే సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో మరోసారి వరుస హిట్స్ అలరిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఈ వారం శ్రీరస్తు, శుభమస్తు, మనమంతా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌తో కలెక్షన్ల వేట మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాలతో అయినా ఏడాది మొదట్లో చూపించిన జోరు.. టాలీవుడ్ మరోసారి చూపిస్తుందేమో చూడాలి.