రూ.25 లక్షల ప్యాకేజీ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. అయినా పెళ్లికి ఇది సరిపోదు.. | New Trend Pelli Choopulu In Hotels - Sakshi
Sakshi News home page

అమ్మాయికి మంచి ప్యాకేజీ ఉంటే చాలు.. ఇక సాఫ్ట్‌వేర్‌ అయితే, మరీ మంచిది.. మిగతావన్నీ తర్వాతే...

Published Sun, Apr 23 2023 10:44 AM | Last Updated on Mon, Apr 24 2023 8:50 AM

New Trend Pelli Choopulu In Hotels  - Sakshi

పెళ్లి సంబంధం కుదరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. సంపాదన ఏడాది ప్యాకేజీ ఎంత అన్నదీ కీలకంగా చూస్తున్నారు. ‘ప్యాకేజీ’ నచ్చితేనే అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు ఓకే చేస్తున్నారు. లేకుంటే మరో ఆప్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పెళ్లి చూపులు కూడా సరికొత్త రూపు దాలుస్తున్నాయి. వధువు ఇంట జరగాల్సిన పెళ్లి చూపులకు హోటళ్లు.. ఇతర ప్రదేశాలు వేదికగా సాగుతున్నాయి.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన దీప్తి డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఇదే జిల్లాకు చెందిన అబ్బాయి రాకేష్‌ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే వీరిద్దరి పెళ్లిచూపులు అయ్యాయి. వచ్చే నెల ఇండియాలో పెళ్లి జరగబోతోంది. 

►గుంతకల్లుకుచెందిన సురేష్‌కు నాలుగైదు సంబంధాలు వచ్చినా.. కుదరలేదు. కారణమేంటంటే.. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లయినా పెద్ద కుటుంబం కదా ఇంతమందికి పెట్టుపోతలు కష్టమని అమ్మాయి తరఫు వారు వెనక్కు తగ్గుతున్నారు. 

►ఆస్తులు, అంతస్తులు.. ముందు పది తరాలు, వెనుక పది తరాలు.. బలమూ బలగమూ ఇవి ఉంటే చాలు గతంలో అమ్మాయికి ఎలాంటి ఢోకా లేదని పెళ్లి కుదుర్చుకునే వారు. రానురాను కాలం మారింది. ఆస్తులేమోగానీ బలమూ బలగానికి చోటు లేదు. ఇప్పుడంతా ‘ప్యాకేజీ’లే. నెలజీతం ఎవరూ అడగడం లేదు. వార్షిక ప్యాకేజీ (యాన్యువల్‌ ప్యాకేజీ)ని బట్టి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. ప్యాకేజీ లేకపోతే వందెకరాల భూస్వామి కొడుక్కు కూడా పిల్లనిస్తామని వచ్చేవారు లేరు. అదే  హైదరాబాద్‌.. బెంగళూరుల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ అబ్బాయిలు, అమ్మాయిలకు అయితే డిమాండ్‌ బాగుంది.  

అమ్మాయిల ప్యాకేజీల పైనా ఆరా.. 
అబ్బాయికి ఏడాదికి రూ.25 లక్షలు ప్యాకేజీ అయినంత మాత్రాన పదో తరగతి చదివిన అమ్మాయిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు, అదీ మంచి ప్యాకేజీతో వేతనం ఉన్న వారికి త్వరగా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల విషయంలో కట్న కానుకలు రెండో ప్రాధాన్యత అంశంగా   మారింది. కానుకల         విషయంలో వెసులుబాటూ కలుగుతోంది. 

డాక్యుమెంట్లు చూపించండి 
ఆస్తులు, డబ్బే ఇప్పుడు పెళ్లిళ్లను కుదురుస్తున్నట్టుంది. ఆస్తులున్నట్టు చెబితే డాక్యుమెంట్లు అడుగుతున్న వారూ లేకపోలేదు. ఉమ్మడి ఆస్తులకు లెక్కచెప్పండి.. నీ వాటా  ఎంత వస్తుంది, ఎప్పుడు      పంచుకుంటున్నారు..మార్కెట్‌ వ్యాల్యూ ఎంత   ఉంటుంది.   ఇలాంటివన్నీ అడుగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

విదేశాల్లోనే వివాహ బంధాలు 
అమెరికా, కెనడాల్లో స్థిరపడిన అబ్బాయిలు, అమ్మాయిలు.. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో అక్కడే పెళ్లిచూపులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడి తల్లిదండ్రులు ఆస్తులు, ఇళ్లు, డబ్బు వగైరాలు ఆరా తీసి ఓకే చేస్తున్నారు. ఇలా అయితే ప్రత్యేకంగా హెచ్‌1 వీసాలు, డిపెండెంట్‌ వీసాలు అక్కర్లేదని అక్కడికక్కడే సంబంధం వెతుక్కుంటున్నారు. 

ఆడపడుచులు..అన్నదమ్ములు ఉంటే.. 
ఉమ్మడి కుటుంబమంటే పెళ్లి చూపులకు కూడా మొగ్గుచూపని పరిస్థితి నెలకొంది. చివరకు అబ్బాయి తరఫున ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నా ఇలాంటి వాటికి అమ్మాయి తరఫు వాళ్లు మక్కువ చూపడం లేదు. ‘ఇంతమందికి మా అమ్మాయి సేవలు చేయలేదు’ అని ముఖాన్నే చెప్పేస్తున్నారు. పెళ్లవగానే అబ్బాయి వేరు కాపురం పెడితేనే వస్తామనే అమ్మాయిలూ లేకపోలేదు.
 
హోటళ్లలోనే పెళ్లిచూపులు 
కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లి చూపులు ఇంటివద్ద చేయడం లేదు. ఎక్కువ సంబంధాలు వచ్చి వెనక్కు వెళుతున్నాయన్న వంక చూపిస్తారని..హోటళ్లలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇరువురూ మాట అనుకోవడం.. హోటల్‌కు రావడం కాఫీ తాగుతూ అబ్బాయి.. అమ్మాయి మాట్లాడుకోవడం. ఇదీ పెళ్లిచూపుల తంతు. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కాఫీతోనే పెళ్లిచూపులు ముగుస్తున్నాయి. 

‘ప్యాకేజీ’కే ప్రాధాన్యం 
రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులంతా ఏడాది వేతనాని (యాన్యువల్‌ సాలరీ ప్యాకేజీ)కే ప్రాధాన్యమిస్తున్నారు. ఈడు జోడు, జాతకాలు, ఇతరత్రాలు అన్నీ గొప్ప సంపాదన ముందు తక్కువే అని వధూవరులు భావిస్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి కెరియర్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు  
– బత్తలపల్లి సత్య రంగారావు, వధూవరుల పరిచయ వేదిక 

పిల్లల అభిప్రాయాలదే చెల్లుబాటు  
మేము పాతికేళ్లుగా  వివాహాలు చేయిస్తున్నాం.  ముందు రోజుల్లో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఆలోచించకుండా ఒప్పుకునేవారు. ఇప్పుడు పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వివాహాది సంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. అతి స్వేచ్ఛ వల్ల కూడా చాలా వివాహ బాంధవ్యాలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. 
–గరుడాద్రి సురేష్‌ శర్మ, పురోహితులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement