ఇంటికొచ్చిన అపరిచిత పురుషులు, స్త్రీలు. వారితో పాటు పెళ్లికొడుకు. వారి ముందుకు టీ కప్పుల ట్రేతో పెళ్లికూతురు రావాలి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ‘ఇంటికెళ్లి ఏ సంగతీ చెప్తాం’ అని వాళ్లు వెళ్లిపోతారు. సంబంధం ఖాయమా కదా అనే టెన్షన్. చెడితే మళ్లీ మొత్తం సీన్ రిపీట్ చేయాలి.ఆడపిల్లలను ప్రదర్శనకు పెట్టి బాధ పెట్టే ఈ పెళ్లిచూపుల తంతును మార్చలేమా అని ప్రశ్నిస్తూ తీసిన మరాఠీ సినిమా ‘స్థల్’టొరెంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.సెప్టెంబర్ 7–18 తేదీల్లో ‘స్థల్’ అక్కడ ప్రదర్శితం కానుంది.
1970లలో 80 లలో సినిమాల్లో పెళ్లిచూపులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నగరాల్లో అయితే ఒకలాగా... పల్లెల్లో అయితే ఒకలాగా.. కొద్ది మార్పులతో. అప్పుడైనా ఇప్పుడైనా ‘ఎంచేవాడు’ అబ్బాయే అవుతున్నాడు. ‘అబ్బాయి వాళ్లు ఓకే అంటే చాలు’ అనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువమంది ఉన్నారు. అసలు అమ్మాయిని చూడటానికి రావడంలోనే మగపెళ్లివారి పైచేయి ఉంది. ఇన్నేళ్లు గడిచినా అబ్బాయిని చూసుకోవడానికి అమ్మాయి వాళ్లు తరలి రావడం వినడం లేదు. పెళ్లి అంటే అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. కాని అమ్మాయి ఔను/కాదులకు ప్రాధాన్యం లేదు. ఈ పద్ధతి ఇంకా ఎంతకాలం అని ప్రశ్నిస్తోంది మరాఠి సినిమా ‘స్థల్’. ఆ మాటకు ‘పెళ్లి సంబంధం’ అని అర్థం.
పత్తి రైతు ఇంట్లో అమ్మాయి
‘స్థల్’ సినిమా కథ మహరాష్ట్రలోని విదర్భ జిల్లాలో దోంగర్‌గావ్ అనే ఊళ్లో జరుగుతుంది. ఈ ప్రాంతమంతా పత్తి రైతులు. వయసొచ్చిన ఆడపిల్లకు తొందరగా పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే ఆడపిల్లవాళ్లు అనుకున్నంత మాత్రాన ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగిపోవు. దానికి సవాలక్ష కుదరాలి. ముందు పెళ్లిచూపుల తంతు జరగాలి. ఈ సినిమాలో బి.ఏ చదివిన సవిత అనే అమ్మాయి ‘పి.జి చదువుతాను మొర్రో’ అని మొత్తుకుంటున్నా వినకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెడతారు.
అక్కడి నుంచి రకరకాల అనుభవాలు ఆమెకు ఎదురవుతుంటాయి. విదర్భ ప్రాంతంలో పెళ్లి చూపులకు వచ్చిన వారికి పెళ్లికూతురు ‘పోహా’ తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీ. దీని ‘పోహా కార్యక్రమం’ అంటారు. ఆ పోహాతో మొదలెట్టి పెళ్లి చూపుల తంతు అయ్యేంత వరకూ ముళ్ల పీఠంపై కూర్చున్నట్టు పెళ్లి కూతురు ఎదుర్కొనే శల్య పరీక్షలను ప్రశ్నిస్తుంది ఈ సినిమా.
ఎన్నో లోపాలు, వంకలు
పెళ్లిసంబంధాల్లో పెళ్లికూతురిలో వంకలు, లోపాలు వెతకడం కొనసాగుతూనే ఉంది. దీని గురించి జయంత్ సోమల్కర్ మాట్లాడుతూ ‘చదువు, ఉద్యోగం, రంగు, ఎత్తు... వీటన్నింటి మీద అబ్బాయి తరపు వాళ్లకు ఒక అభిప్రాయం ఉంటుంది. పెళ్లికూతురిలో ఆ మేరకు లోపం వెతకడానికి చూస్తారు. వంకలు పెడతారు. ప్రతి పెళ్లిచూపుల్లో అవే ప్రశ్నలు. పెళ్లికూతురు జవాబు చెప్పి చెప్పి విసిగిపోవాలి. అసలు అంతమంది వచ్చి కూచుని ఒకమ్మాయిని గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించామా? నా చిన్నప్పుడు మా అక్కలకు ఇలాగే పెళ్లిచూపులు జరుగుతుంటే చూసేవాణ్ణి. ఇటీవల మా కజిన్‌ను చూడటానికి అబ్బాయి వస్తే అదే తంతు. సినిమా తీయాలనిపించింది’ అన్నాడు.
ఊరివాళ్లే నటులు
జయంత్ సోమల్కర్ విదర్భ ప్రాంతం వాడే. తన సొంత ఊళ్లో షూటింగ్ మొత్తం చేశాడు. ఊరి వాళ్లనే నటీనటులుగా ఎంపిక చేసుకున్నాడు. రియలిస్టిక్‌గా అనిపించేందుకే అలా చేశాడు. ‘షూటింగ్ మధ్యలో పొలానికి నీళ్లు పెట్టి వస్తానని, బర్రెకు గడ్డి వేసి వస్తానని నటీనటులు వెళ్లిపోకుండా చూడటం నాకు పెద్ద సమస్య అయ్యింది’ అంటాడు జయంత్ నవ్వుతూ. ముఖ్య పాత్రను ఊరి అమ్మాయి నందిని చిట్కె అద్భుతంగా చేయడం కూడా యూనిట్‌కు ఆశ్చర్యమే.
‘పెళ్లి చూపుల తంతును సహజమైన హాస్యంతో నేను చూపించినా సంబంధాలు వద్దనేకొద్దీ పెళ్లికూతురిలో వచ్చే తిరుగుబాటును, ఆమెలో వచ్చే ఆగ్రహాన్ని చూపించాను. నన్ను తిట్టుకున్నా సరే... పదిమందైనా మారితే అదే పదివేలు’ అంటాడు జయంత్. ప్రతిష్టాత్మక 48వ టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘డిస్కవరీ సెక్షన్’లో భారతదేశం నుంచి ‘స్థల్’ ఒక్కటే ఎంపికైంది. ఇక్కడ ప్రదర్శితమయ్యాక ఇండియాలో రిలీజ్ చేయడానికి దర్శకుడు సిద్ధమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment