జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, శాకాహారి, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు.
వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్‌లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్‌లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు.
వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్‌కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్‌లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు.
వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్‌లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్‌ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్.
ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది?
ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు.ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు.
ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు
►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది.
► తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది.
► వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది.
► వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు.
► జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
► భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది.
► సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.
-సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment