40 సెన్సార్ కట్స్: సినిమా పేరు మార్చాలి
ఈ ఏడాది రూపుదిద్దుకున్న వాటిలో అత్యంత వివాదాస్పద సినిమాగా ఇప్పటికే పేరుమోసిన 'ఉడ్తా పంజాబ్' కు సెన్సార్ బోర్డు 40 కట్స్ చెప్పింది. డ్రగ్స్ వినియోగం, మాఫియా చుట్టూ తిరిగే ఈ సినిమాలో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా చూపారని ఎక్కడికక్కడ కట్స్ విధించారు బోర్డు సభ్యులు. డ్రగ్స్ సబ్జెక్ట్ తో తీసిన సినిమాలో డ్రగ్స్ (వాస్తవానికి షూటింగ్ లో వేరే పదార్థాలు వాడతారు) చూపకపోతే ఎలా? అంటూ సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శక నిర్మాతలు ట్రిబ్యూల్ ను, సమాచార ప్రసారాల శాఖ అధికారులను కలిసేప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో షాహిద్ కపూర్, కరీనా, ఆలియా భట్ లు ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉడ్తా పంజాబ్' జూన్ 17న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ చిక్కుల్లోపడి ఆలస్యమైంది.
ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా 'ఉడ్తా పంజాబ్' లో చూపిన అంశాలను ప్రస్తావిస్తూ ట్విటర్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఆ సినిమాలో చూపించిన విషయాలు ఒక్క పంజాబ్ లోనే దేశం, ప్రపంచం అంతటా కనిపిస్తాయని, అందుకే దానికి ఉడ్తా పంజాబ్ అని కాకుండా ఉడ్తా ఇండియా అనో, ఉడ్తా వరల్డ్ అనో టైటిల్ పెట్టాలని సూచించారు. ఇక హీరో షాహిద్ మాత్రం మరోలా స్పందించాడు. ఉడ్తా పంజాబ్ విడుదలైన తర్వాత అన్ని రాష్ట్రాలు ఈ సినిమాకి పన్ను మినహాయింపును ప్రకటించడం ఖాయమని, సినిమా అంత గొప్పగా, సమాజానికి పనికివచ్చేలా రూపొందించామని షాహిద్ అన్నాడు.