ఇళయరాజా ఓ మానస సరోవరం : ప్రకాశ్‌రాజ్
ఇళయరాజా ఓ మానస సరోవరం : ప్రకాశ్‌రాజ్
Published Mon, Mar 31 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
‘‘నా జీవితాన్ని మలిచిన గురువుల్లో ఇళయరాజా ఒకరు. సినీ సంగీతానికి ఆయన మానస సరోవరంలాంటి వారు. సినీ రంగంలో ఆయనకు నేను కూడా సమకాలికుణ్ణి అయినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు, దర్శక - నిర్మాత ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన త్రిభాషా చిత్రం ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం తెలుగు వెర్షన్ పాటలను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర సమర్పకులైన సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు సారథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు సంగీత దర్శకుడు ఇళయరాజాను ఘనంగా సన్మానించారు.
చిన్నారులు కీర్తనలను ఆలపిస్తూ, నర్తిస్తుండగా వైవిధ్యంగా ఈ సత్కారం సాగింది. ఈ ఆత్మీయ సత్కారానికి ఇళయరాజా స్పందిస్తూ, ‘‘నా దృష్టిలో పాట అంటే దేనికదే ఉండాలి. ఒకదానిలా మరొకటి ఉండకూడదు. అలా ఉంటే అది కాపీ అవుతుంది’’ అన్నారు. మరింత వివరణనిస్తూ, ‘‘అయితే, ఒక పాటను విని ఆ స్ఫూర్తితో మరో పాట చేయడం వేరు. సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆయన బాణీ కట్టిన ఓ పాట స్ఫూర్తితోనే ‘ఓ నెంజమే...’ అనే తమిళ గీతానికి స్వరరచన చేశాను’’ అన్నారు. సాధారణంగా ఇలాంటి సన్మానాలకు దూరంగా ఉండే ఇళయరాజా, ఆ మాటే చెబుతూ,
‘‘ఉగాది రోజున మీ అందరినీ కలుసుకోవడానికి ఇదొక అవకాశంగా భావించి అంగీకరించాను’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ‘ప్రసాద్ ల్యాబ్స్’ అధినేత రమేశ్‌ప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి. కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, కీరవాణి, మణిశర్మ, ప్రకాశ్‌రాజ్, స్నేహ, ‘ఉలవచారు బిర్యాని’ చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement