పదిహేడేళ్ల తర్వాత!
‘వాస్సి వాడి తస్సాదియ్యా...’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. జోరుగా ఉండే తండ్రి పాత్ర, కూల్‌గా ఉండే కొడుకు పాత్రను నాగ్ అద్భుతంగా పోషించారు. అన్ని ఏరియాల వాళ్లనీ ఆకట్టుకున్న చిత్రం ఇది. ఇప్పుడీ రెండు పాత్రల్లో కన్నడ ప్రేక్షకులు ఉపేంద్రను చూడనున్నారు. విలక్షణమైన పాత్రలతో కన్నడిగులనే కాదు.. తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఉపేంద్రకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చాలా నచ్చిందట. అందుకే కన్నడ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలుగులో రమ్యకృష్ణ చేసిన పాత్రను కన్నడంలో ప్రేమ చేయనున్నారు. విశేషం ఏంటంటే...
1999లో ఉపేంద్ర, ప్రేమ జంటగా ‘ఉపేంద్ర’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. పదిహేడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ జతకట్టనున్న చిత్రం ఇదే. మరో విశేషం ఏంటంటే... ఈ చిత్రంతోనే ప్రేమ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. అరుణ్ లోకనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘మత్తె హుట్టి బా, ఇంతి ప్రేమ’ అనే టైటిల్ నిర్ణయించారు. ఆ సంగతలా ఉంచితే నాగ్ మంచి రొమాంటిక్ హీరో. ఉపేంద్ర ఫుల్ మాస్ హీరో. అందుకే తన ఇమేజ్‌కీ, కన్నడ ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్టుగా ‘సోగ్గాడే..’ కథను మలుస్తున్నారట.