ఇకపై నా కథలు అన్నయ్యకు వినిపిస్తా
– వీవీ వినాయక్
‘‘ఈ చిత్రానికి ముందు చిరంజీవి గారు ఓ యాభై కథలు విన్నా, నచ్చలేదు. ‘కత్తి’ నచ్చడంతో రీమేక్ చేద్దామని నాతో అన్నారు. నేను తమిళ ‘కత్తి’ చూసి, ఆయన ఇమేజ్‌కి, నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ నేడు. వినాయక్ మాట్లాడుతూ...
► నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో హిట్స్, ఫ్లాపులు రెండూ ఉన్నాయి. ఫ్లాప్ అయిన చిత్రాల కథలు బాగున్నా ప్రేక్షకులకు నచ్చలేదు. అన్నయ్య రీ–ఎంట్రీ అని ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని దేవిశ్రీ ప్రసాద్ ఓ ట్యూన్ ఇచ్చాడు. అది అభిమానులను కూడా అలరిస్తుందని ‘ఖైదీ నంబర్ 150’ కి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్‌లైన్ పెట్టాం.
► పరుగులు పెట్టి సినిమాలు తీసేరకం కాదు నేను. నాకు కథ బాగుండాలి. అప్పుడే ముందు కెళతా. ఎటువంటి కథ అయితే బాగుంటుందనే విషయంలో అన్నయ్యకు (చిరంజీవి) మంచి జడ్జిమెంట్ ఉంది. ఇకపై నేను ఏ కథ రాసినా, ముందుగా అన్నయ్య చిరంజీవి గారికి వినిపించాలనుకుంటున్నా.
► ‘ఠాగూర్’ చిత్రమప్పుడు అన్నయ్య ఎలా ఉన్నారో ఇన్నేళ్ళ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’కి వచ్చినా అలాగే ఉన్నారు. అరవై ఏళ్లు వచ్చినా డ్యాన్స్, ఫైట్స్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. అల్లరి చిల్లరగా తిరిగే దొంగగా కత్తి శ్రీను పాత్రలో, గ్రాడ్యుయేట్ శంకర్ పాత్రలో అన్నయ్య కనిపిస్తారు. ‘ఠాగూర్’లో క్లయిమాక్స్ కోర్ట్ సీన్ లాగా ఇందులోనూ ఓ సీన్ ఉంటుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి.
► హీరోయిన్లుగా అనుష్క, సమంతలను అనుకున్నా ఫైనల్‌గా కాజల్‌ని ఓకే చేశాం. ‘గణితన్’ చిత్రం చూసి విలన్‌గా తరుణ్ అరోరాను ఎంచుకున్నా. తర్వాతే తెలిసింది తను అంజలా ఝవేరీ భర్త అని. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి మంత్రి పాత్ర చేశారు. లెన్త్ ఎక్కువైందని తనకు చెప్పి, కొంత తీసేశాం. కానీ, తను బాధపడుతూ మెసేజ్ పెట్టడంతో అలాగే ఉంచాం.
► సరైన కథ కుదిరితే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ. నా తదుపరి చిత్రాలు ఏమిటన్నది ఇంకా ఫైనల్ కాలేదు. రెండు, మూడు చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్ అయ్యాక చెబుతా.