
గోపాల గోపాల... వన్స్‌మోర్!
గోపాల రావుకి దేవుడిపై అస్సలు మమకారం ఉండదు. పైగా ఒళ్లంతా వెటకారమే. అలాంటోణ్ణి కష్టాల నుంచి కాపాడి దేవుడిపై నమ్మకం కలిగేలా చేస్తాడు గోకుల కృష్ణుడు అలియాస్ గోపాలుడు. సింపుల్‌గా ‘గోపాల గోపాల’ కథ ఇంతే! ఈ కథ కంటే గోపాలరావుగా వెంకటేశ్, గోపాలుడిగా పవన్‌కల్యాణ్‌ల కాంబినేషన్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న సినిమాలో వెంకీ అతిథిగా కనిపిస్తారు. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో వేసిన ఇరానీ కేఫ్ సెట్‌లో ప్రస్తుతం ఆయనపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ అంటే పవన్, త్రివిక్రమ్‌లకు ప్రత్యేక అభిమానం. అలాగే, వెంకీకి కూడా! అందుకే, అడిగిన వెంటనే అతిథి పాత్ర చేయడానికి అంగీకరించి ఉంటారని ఊహించవచ్చు. ప్రస్తుతానికి వెంకీ పాత్ర ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్.