హీరో డేట్స్ రెడీ.
కానీ డెరైక్టర్ హ్యాపీగా లేడు.
ఎందుకంటే కథ లేదు.
స్టార్ హీరోకి కథ అంటే మాటలా?
అప్పటికప్పుడు కొత్త కథ అంటే కష్టమే!
మరేం చేయాలి?
ఐడియా...
వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తే?
ఓ సినిమా నచ్చింది.
దాన్ని కాపీ కొట్టేస్తే?
‘ఫ్రీమేక్’ చేశాడని అంటారు.
అందుకే, రీమేక్ చేద్దామనుకున్నాడు.
హీరోగారికి కూడా సినిమా నచ్చేసింది.
షూటింగ్ షురూ!
ఫలితం...
ఇప్పుడు తెలుగులో
అరడజనుకు పైగా కత్తి లాంటి
సినిమాలు రీమేక్ అవుతున్నాయ్.
చిరంజీవి సేఫ్ గేమ్!
ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి చూశారూ.. అవి చాలా డేంజర్. ఓ పట్టాన నిర్ణయానికి రానివ్వవు. చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఏడెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడం, మెగాస్టార్ హీరోగా 150వ సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయ్. దాంతో ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందో మెగా కాంపౌండ్ ఓ పట్టాన డిసైడ్ చేసుకోలేకపోయింది. స్టార్ డెరైక్టర్లు, స్టార్ రైటర్లు చెప్పిన కథలు విన్నప్పటికీ ‘ఇంకా ఏదో కావాలి’ అనిపించి ఉంటుంది.
అలాంటి సమయంలోనే తమిళ ‘కత్తి’ మీద దృష్టి పడి ఉంటుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆల్రెడీ ఓ భాషలో ప్రూవ్ చేసుకుంది.. కథలో మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ కూడా ఉంది కాబట్టి ఇది ‘సేఫ్’ అవుతుందనుకున్నారేమో. చివరికి 150వ సినిమాకి స్ట్రైట్ స్టోరీని కాకుండా రీమేక్‌ని సెలక్ట్ చేసుకున్నారు. ‘ఖైదీ నం. 150’ పేరుతో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దీన్ని రామ్‌చరణ్ నిర్మిస్తుండటం విశేషం.
మూవీ జానర్: యాక్షన్ డ్రామా.
‘కత్తి’ బడ్జెట్: దాదాపు 100 కోట్లకు పైగా,
వసూళ్లు: సుమారు 124 కోటు్లూ
పవన్ కల్యాణ్ డబుల్ ధమాకా!
పవన్ కల్యాణ్ కెరీర్‌లో మంచి హిట్ సాధించిన వాటిలో ‘సుస్వాగతం’, ‘ఖుషి’, ‘గబ్బర్‌సింగ్’ మూడూ రీమేక్సే. ‘తమ్ముడు’ సినిమా కూడా హాలీవుడ్ చిత్రం ‘బ్రేకింగ్ ఎవే’కి ఇన్‌స్పిరేషన్ అంటారు. సో.. రీమేక్స్ పవన్‌కి కలిసొస్తాయనే చెప్పాలి. మరి.. కథలు దొరక్కో.. లేక ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆశించిన ఫలితం సాధించకపోవడం వల్లో రీమేక్ మూవీకి ఓటేసారు. పైగా ఒకటి కాదు... ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఒకటి ‘వీరమ్’, ఇంకోటి ‘వేదాలం’. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ‘వీరమ్’ బాక్సాఫీస్‌ని షేకాడించింది. ‘వేదాలం’ కూడా అజిత్-శివ కాంబినేషన్‌లో తెరకెక్కినదే. తమిళంలో ఈ సినిమా నిర్మించిన ఎ.యం. రత్నం తెలుగు రీమేక్‌కి కూడా నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ‘కాటమరాయుడు’ పేరుతో ‘వీరమ్’ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
‘వేదాలం’ బడ్జెట్: 60 కోట్లు, వసూళ్లు: 125 కోటు్లూ (జానర్: యాక్షన్ మసాలా).
‘వీరమ్’ బడ్జెట్: 50 కోట్లు, వసూళ్లు: 130 కోటు్లూ (జానర్: యాక్షన్ మూవీ).
వెంకీ.. రీమేక్ రాజా!
బహుశా వెంకటేశ్ చేసినన్ని రీమేక్ చిత్రాలు వేరే ఏ హీరో చేసి ఉండరేమో. భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు, టు టౌన్ రౌడీ, చంటి, చినరాయుడు, సుందరాకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు, సూర్యవంశం, వసంతం, రాజా, శీను, ఘర్షణ, జెమిని, సంక్రాంతి, ఎ వెన్స్‌డే, నాగవల్లి, బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాల గోపాల.. ఏంటండీ.. లెక్క చాలా ఎక్కువగా ఉందనుకుంటున్నారా? మరందుకే రీమేక్ రాజా అన్నది. ఈ చిత్రాల్లో సక్సెస్ అయినవే ఎక్కువ. అందుకే వెంకీ నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’పై బోల్డన్ని అంచనాలు.
సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి ‘గురు’ రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వెంకీ కండలు పెంచారు. ‘గురు’ లుక్ ఇప్పటికే బోల్డన్ని కాంప్లిమెంట్స్ అందుకుంది. వాస్తవానికి హిందీలో వసూళ్లు ఆశించిన విధంగా లేకపోయినా మంచి సినిమా అనిపించుకుంది. తమిళంలో ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయింది.
మూవీ జానర్: స్పోర్ట్స్ డ్రామా.‘ఇరుది సుట్రు’
బడ్జెట్: దాదాపు 5 కోట్లకు పైగా,
వసూళ్లు: సుమారు 15 కోటు్లూ
డిస్కషన్స్‌లో ఉన్న చిత్రాలు
మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘ఒప్పమ్’. ఇది క్రైమ్ థ్రిల్లర్. హీరో అంధుడు. సంబంధం లేని ఓ నేరంలో ఇరుక్కున్న అతడు ఎలా బయటపడ్డాడు? అనేది కథ. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 7 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్, రీమేక్ హక్కులను ఓ నిర్మాత పొందారని సమాచారం.
మరి.. అనువదించి విడుదల చేస్తారో లేక రీమేక్ చేస్తారో చూడాలి. ఒకవేళ రీమేక్ చేస్తే.. వెంకటేశ్ హీరోగా నటించే అవకాశం ఉందని వినికిడి. ఇక.. వార్తల్లో ఉన్న మరో చిత్రం ‘అప్పా’ (నాన్న అని అర్థం). దర్శక-నటుడు సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. మంచి ఎమోషనల్ మూవీ అనిపించుకున్న ఈ చిత్రాన్ని 12 భాషల్లో రీమేక్ చేయాలని సముద్రఖని భావిస్తున్నారట. - డి.జి. భవాని
నా దృష్టిలో రీమేక్‌లు చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఓ మంచి చిత్రాన్ని మన ప్రేక్షకులకు కూడా చూపించాలనే ప్రయత్నం. రెండు.. కొత్త కథలతో ఎందుకొచ్చిన గొడవ. పక్క భాషలో హిట్టయింది కదా, ఇక్కడా హిట్ వచ్చేస్తుందనే భావన. సేఫ్‌గా రీమేకులే చేద్దామనుకునే వాళ్లు లైఫ్‌లో కొత్తగా చేయలేరు. కొత్త కథలు విందాం, చేద్దామనే ఫైర్ హీరోల్లో ఉంటే కొత్త కథలు వస్తాయి. రిస్క్ తీసుకునే గట్స్ హీరోలకు ఉండాలి. - పూరి జగన్నాథ్
అవసరాల బోల్డ్ స్టెప్
బోల్డ్ కంటెంట్‌తో తీసిన హిందీ చిత్రం ‘హంటర్’. తెలుగులో హోమ్లీగా కనిపించిన రాధికా ఆప్టే ఈ చిత్రంలో చాలా చాలా బోల్డ్‌గా నటించడం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను రెజీనా చేస్తున్నారు. కాగా, దర్శకుడిగా-నటుడిగా పద్ధతిగా ఉన్న చిత్రాలూ, పాత్రలూ చేసిన అవసరాల శ్రీనివాస్ ఈ రీమేక్‌లో సెక్స్ అడిక్ట్‌గా నటించడానికి రెడీ కావడం ఓ బోల్డ్ స్టెప్. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మూవీ జానర్: అడల్ట్ కామెడీ.
‘హంటర్’ బడ్జెట్: దాదాపు 6 కోట్లు,
వసూళ్లు: సుమారు 13 కోటు్లూ
పంజాబీ సినిమా రీమేక్‌లో చైతు?
మలయాళ ‘ప్రేమమ్’ అక్కడ సూపర్ డూపర్ హిట్. అదే పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ అయిన ఆ చిత్రం ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్. చైతూ మరో రీమేక్‌లో నటించనున్నారు. నిజానికి ‘ప్రేమమ్’ విడుదలకు ముందే ఆ రీమేక్‌ని ఫైనలైజ్ చేశారు. పంజాబీలో మంచి విజయం సొంతం చేసుకున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ నచ్చి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. విశేషం ఏంటంటే.. భారతీయ భాషలన్నింట్లోనూ సినిమాలు తీయాలనుకున్న డా. డి. రామానాయుడు తీసిన తొలి పంజాబీ సినిమా ఇది. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందనుందని భోగట్టా.
మూవీ జానర్: రొమాంటిక్ కామెడీ.
‘సింగ్ వెర్సస్ కౌర్’ బడ్జెట్: 35 లక్షలు,
వసూళ్లు: సుమారు 1 కోటీ 60 లక్షలుూ
తెలుగులో రెండు రాష్ట్రాలు
ప్రముఖ రచయిత చేతన్ భగత్ అద్భుత నవలల్లో ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ‘త్రీ ఇడియట్స్’గా, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ను ‘కై పోచే’గా హిందీలో తీశారు. ఈ రెండు చిత్రాలూ మంచి ఆదరణ పొందాయి. ఆయన రాసిన ‘టు స్టేట్స్’ నవల అదే పేరుతో హిందీలో రూపొందింది. చిన్న బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దక్కించుకున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకట్ కుంచెమ్ దర్శకునిగా పరిచయం కానున్నారు.
మూవీ జానర్: రొమాంటిక్ కామెడీ డ్రామా.
‘టు స్టేట్స్’ బడ్జెట్: 35 కోట్లు,
వసూళ్లు: సుమారు 150 కోటు్లూ
తెలుగులో ఫస్ట్ రీమేక్..!
ఇప్పటివరకూ రామ్‌చరణ్ చేసినవి తొమ్మిది చిత్రాలు. వీటిలో హిందీ ‘జంజీర్’ ఒకటి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’కి ఇది రీమేక్. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఒక్కోసారి రిజల్ట్ అటూ ఇటూ ఉంటుంది. అంత మాత్రాన రీమేక్ కలసి రాదు అనడానికి లేదు. అలా ఆలోచించే రామ్‌చరణ్ తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్‌లో నటించాలనుకుని ఉంటారు. తమ్ముడు ‘జయం’ రవితో అన్న మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్ హిట్. రామ్‌చరణ్ టైటిల్ రోల్‌లో ‘ధృవ’గా గీతా ఆర్ట్స్ రీమేక్ చేస్తోంది. తెలుగులో రామ్‌చరణ్ చేస్తున్న తొలి రీమేక్ మూవీ ఇది. ఇందులో ఐపీయస్ ఆఫీసర్‌గా కనిపించడం కోసం రామ్‌చరణ్ మేకోవర్ అయ్యారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది.
మూవీ జానర్: యాక్షన్ థ్రిల్లర్.
‘తని ఒరువన్’ బడ్జెట్: దాదాపు 20 కోట్లు,
వసూళ్లు: సుమారు 105 కోటు్లూ
రీమేక్ కత్తి గురూ!
Published Mon, Oct 31 2016 11:16 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement