కరోనా వచ్చింది.. సినిమాల విడుదలను వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగ్గింది. వాయిదా పడిన సినిమాలు రిలీజవుతున్నాయి. మామూలుగా ఏడాదికి ఒక సినిమాలో కనిపించే స్టార్ హీరోలు ఈ ఏడాది రెండు మూడు సినిమాల్లో కనిపించనున్నారు. ఫ్యాన్స్‌కి డబుల్.. త్రిబుల్ ట్రీట్ అన్నమాట. ఈ ట్రీట్ గురించి తెలుసుకుందాం.
రెండేళ్ల క్రితం వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి మరోసారి వెండితెరపై కనిపించలేదు. కరోనా పరిస్థితుల వల్ల చిరంజీవి ‘ఆచార్య’ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా కనిపిస్తారు. ఇంకా దర్శకులు మోహన్‌రాజాతో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్‌తో ‘భోళా శంకర్’, బాబీతో (కేఎస్ రవీంద్ర) ‘వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్), వెంకీ కుడుములతో ఓ సినిమా.. ఇలా వరుసగా సినిమాలు కమిటయ్యారు చిరంజీవి. అయితే ‘గాడ్ ఫాదర్’, ‘బోళా శంకర్’.. ఈ రెండు సినిమాల్లో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇలా ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిరంజీవి.
ఇక ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’తో సందడి చేశారు నాగార్జున. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ఘోస్ట్’ సినిమా చేస్తున్నారు. అలాగే దాదాపు 20 ఏళ్ల తర్వాత హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 9న విడుదల కానుంది. ‘ఘోస్ట్’ చిత్రాన్ని కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. నాగ్ ఫ్యాన్స్‌కి త్రిబుల్ ట్రీట్ అన్నమాట. ఇంకో వైపు స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు రవితేజ. ‘ఖిలాడి’, ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు బయోపిక్’.. ఇలా ఐదు సినిమాలతో రవితేజ బిజీ. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడి’ ఈ నెల 11న, శరత్ మండవ దర్శకత్వంలోని ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25న లేదా ఏప్రిల్ 15న, సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘రావణాసుర’ సెప్టెంబరు 30న విడుదల కానున్నాయి. నాగ్‌లానే రవితేజ కూడా తన ఫ్యాన్స్‌కి త్రిబుల్ ట్రీట్ ఇవ్వనున్నారన్న మాట.
ఇక పవన్ కల్యాణ్ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. పవన్ రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలోని ‘భీమ్లా నాయక్’, క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తోన్న ‘హరి హరవీరమల్లు’ చిత్రాలు ఈ ఏడాదే థియేటర్స్‌కు రానున్నాయి. మరోవైపు 2018లో వచ్చిన ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ను తెరపై చూసుకోలేకపోయారు ఆయన ఫ్యాన్స్. ఈ ఏడాది రెండు సినిమాల్లో కనిపించనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న, ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ‘ఆదిపురుష్’ ఆగస్టు 11న విడుదల కానున్నాయి. ఇంకా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ చిత్రాలున్నాయి. ‘సలార్’ రెండు భాగాలుగా రిలీజవుతుందని, తొలి పార్ట్ ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌కు వస్తుందనే వార్తలు ఉన్నాయి.
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ హీరో (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో)గా చేసిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజులకు ‘ఆచార్య’ విడుదలవుతుంది. ఇంకోవైపు తండ్రితో కలసి సంక్రాంతికి ‘బంగార్రాజు’తో అలరించిన నాగచైతన్య చేసిన మరో రెండు చిత్రాలు ‘థ్యాంక్యూ’, ‘లాల్‌సింగ్ చద్దా’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చైతూ చేసిన ‘థ్యాంక్యూ’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది.
డబుల్ ట్రీట్ ఇవ్వనున్న హీరోల్లో నాని ఉన్నారు. నాని నటించిన ‘అంటే.. సుందరానికి’, ‘దసరా’ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ‘అంటే... సుందరానికి’ ఈ ఏడాది ఫస్టాప్‌లో, శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ‘దసరా’ సెకండాఫ్‌లో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఇక కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఫిబ్రవరి 25న, శ్రీ కార్తీక్ డైరెక్షన్‌లో చేసిన ‘ఒకే ఒక జీవితం’ వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’లో ఒక హీరోగా నటించిన రానా ‘1945’ మూవీతో జనవరిలో థియేటర్స్‌కు వచ్చారు.
‘భీమ్లా నాయక్’ కూడా ఈ ఏడాదే విడుదలకు షెడ్యూల్ అయింది. వేణు ఉడుగుల డైరెక్షన్‌లో రానా చేసిన ‘విరాటపర్వం’ కూడా రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ఇంకో యువ హీరో వరుణ్ తేజ్ ఓ హీరోగా చేసిన ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్ మరో హీరో. అలాగే కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న రిలీజ్ కానుంది. వీళ్లే కాదు.. మరికొందరు హీరోలు కూడా ఈ ఏడాది రెండు మూడు సార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment