
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్‌లో రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది. ప్రభాస్ మొదలు నిఖిల్ వరకు ప్రతి తెలుగు హీరోని బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో తెలుగు హీరోల టార్గెట్ మారిపోయింది. ముఖ్యంగా మెగా హీరోలు బాలీవుడ్ మార్కెట్‌పై గట్టిగా ఫోకస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు..మెగా హీరోలంతా బీటౌన్ బాట పట్టారు.
సైరాతో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఆచార్యను కూడా అక్కడ విడుదల చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్‌లోనే ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో..తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ ఇప్పుడు గాడ్‌ఫాదర్‌తో మరోసారి బాలీవుడ్‌కు వెళ్తున్నాడు చిరు. ఈ సారి సల్మాన్‌ఖాన్ కూడా తోడవ్వడంతో బాలీవుడ్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 5న గాడ్‌ఫాదర్ విడుదల కాబోతుంది.
ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో బీటౌన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయన్నారు. ఇకపై చరణ్ నటించే ప్రతి సినిమా కూడా హిందీలో విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక చిరు,చరణ్‌తో పాటు పవన్ కల్యాణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్‌తో హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన పవన్.. తర్వాత కొన్నాళ్లపాటు బీటౌన్ ప్రేక్షకులను దూరంగా ఉన్నారు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’చిత్రంతో మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. గని తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే పాన్ ఇండియా చిత్రంలో వరుణ్ నార్త్ ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు. శక్తి ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment