
సెర్బియాకు వివేగం చిత్ర యూనిట్
తమిళసినిమా: వివేగం చిత్రం మరోసారి యూరప్ దేశాలకు వెళ్లనుందన్నది తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకి, అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తున్న ఇందులో హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే వివేగం చిత్రంలో వివేక్ ఓబెరాయ్‌ది విలన్ పాత్ర కాదని ఆ చిత్ర దర్శకుడు శివ ఇటీవల వెల్లడించారు. కాగా సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సర్వైవా అనే సింగిల్ సాంగ్ విడుదలై అజిత్ అభిమానుల్ని ఖుషీ పరుస్తున్నాయి. అజిత్ ఇటర్‌పోల్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆయన అభిమానులు చిత్ర విడుదల ఎప్పుడెప్పుడాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా వివేగం చిత్రం పూర్తిగా యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ముఖ్యంగా బల్గేరియాలో అధిక భాగం షూటింగ్‌ను నిర్వహించారు. ఇటీవలే షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్ చెన్నై చేరుకుంది. కాగా మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి సెర్బియా వెళ్లనున్నట్లు చిత్ర దర్శకుడు శివ తెలిపారు. కాగా వివేగం చిత్రాన్ని ఆగస్ట్ నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.