నిజంగానే మద్యం తాగి నటిస్తా !
తమిళసినిమా: మందు కొట్టి నటించే సన్నివేశాలప్పుడు నిజంగానే మద్యం తాగుతానన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్‌ఆంటోని. తొలుత సంగీత రంగంలోకి దూసుకొచ్చి, ఆ తరువాత నటుడిగా వరుస విజయాలు సాధిస్తున్న ఈ బహుముఖ ప్రతిభాశాలి నటుడు శ్రీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన నంబియార్ చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. నటి సునైనా నాయకిగా నటించిన ఈ చిత్రంలో ప్రస్తుతం కథానాయకుడిగా హిట్ మీద హిట్ కొడుతున్న నటుడు సంతానం హాస్య పాత్రలో నటించడం ప్రస్తావనార్హం. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నంబియార్ చిత్రానికి సంగీతం అందించడంతో పాట ఒక పాటలో చిన్నగా చిందులేసిన విజయ్‌ఆంటోనితో చిన్న భేటీ..
ప్ర: నంబియార్ చిత్రం గురించి?
జ: బాహ్య ప్రపంచంలో మనం అంతా మంచి వాళ్లుగా నటిస్తున్నాం. నిజం చెప్పాలంటే సినిమాల్లో నంబియార్‌లా మనలోనూ చె డ్డవాడు ఉంటాడు. అలాంటి వాడికి ఒక రూపం ఇచ్చి మనతో పయనించేలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు తెరరూపం నంబియార్ చిత్రం.
ప్ర: చిత్రంలో శ్రీకాంత్ నటన గురించి?
జ: ఆయన చాలా బాగా నటించారు.
ప్ర: సంతానం పాత్ర గురించి?
జ: ఆ పాత్రను ఆయన మాత్రమే చేయగలరు.సంతానం పాత్ర నంబియార్ చిత్రానికి చాలా సపోర్టుగా నిలుస్తుంది. ఆయన చిత్రాల్లో పాడాలన్న ప్రయత్నాన్ని చేయలేదు. ఈ చిత్రంలో సంతానంతో ఒక పాట పాడించాం. శ్రీకాంత్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఆయన ఇందులో పాడారు. మద్యం తాగి ఆడి పాడే ఐటమ్ గీతం అది. సంతానం నిజంగా మందు తాగినట్లే నటించారు. నిజం చెప్పాలంటే తాను సలీమ్ చిత్రంలో మందు పాటలో నటించాను. అందుకు నిజంగానే మద్యం సేవించి నటించాను. సంతానం అలాకాదు. చాలా రియలిస్టిక్‌గా నటించారు. వెరైటీగా ఉంటుందని పాటకు కాస్త స్లో బాణీలు కట్టాను.
ప్ర: మందు పాటలో మీరు చిందేశారటగా?
జ: నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ అసలు రాదు. వారు అడిగారని వెళ్లి పాటలో నిలబడి వచ్చానంతే.
ప్ర: సంతానంతో పాడించిన అనుభవం?
జ: చెబితే నమ్మరు గానీ సంతానం ఆ ఐటమ్ సాంగ్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేశారు. ఆయనతో పాడించడం నిజంగా నాకు మంచి అనుభవం.
ప్ర: సాధారణంగా మీరు మెలోడీకి ప్రాముఖ్యతనిస్తారు. మరి ఈ చిత్రంలో?
జ: నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. నంబియార్ చిత్రంలోనూ మూడు మెలోడి పాటలున్నాయి. చిత్రాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కథలోని భావాన్ని తెలిపేది నేపథ్య సంగీతమే. ఈ చిత్రంలో అది బాగుంటుంది.