‘అందుకే నన్ను రిజెక్ట్‌ చేశారు’ | Vijay Devarakonda talks about his journey to stardom | Sakshi
Sakshi News home page

దోచుకుంటున్నాడు.. దాచుకుంటున్నాడు

Published Sat, Dec 29 2018 11:52 PM | Last Updated on Sun, Dec 30 2018 11:31 AM

Vijay Devarakonda talks about his journey to stardom   - Sakshi

గండర గండ సోగ్గాడివంట..కండలు తిరిగిన పోరగానివంట..‘బందిపోటు దొంగలు’ సినిమాలో పాట ఇది.విజయ్‌ దేవరకొండ ఏం తక్కువ బందిపోటు కాదు.బుట్టల కొద్దీ మనసులు దోచుకుంటున్నాడు..కట్టల కొద్దీ లవ్‌ లెటర్స్‌ దాచుకుంటున్నాడు.ఎవరికీ దొరకనంటాడు..‘సాక్షి’ రీడర్‌కి దొరికాడు.

‘2018 నాదే’ అని హ్యాపీగా చెప్పుకునేలా ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి రెండు హిట్స్‌ ఇచ్చారు. ఈ ఏడాది గురించి  మీ ఒపీనియన్‌?
విజయ్‌: ఈ సంవత్సరం చాలా పని చేశాను. అటే అంత పని చేశానని కంప్లైంట్‌లా చెప్పడంలేదు. నాలుగు రిలీజులు, వాటిలో రెండు లీకైన సినిమాలు, విజయాలు, అపజయాలు, ప్లేబ్యాక్‌ సింగింగ్, సమస్యలు, సమస్యలను అధిగమించడం, నా సొంత ‘క్లాతింగ్‌ లైన్‌’ని ఆరంభించడం, నిర్మాణ సంస్థను ప్రారంభించడం... వీటన్నిటితో బిజీ బిజీగా చాలా లైవ్లీగా 2018 గడిచింది.

కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలేమైనా?
నేనెప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. అనిపించింది చెయ్యాలి... ఇష్టంగా చెయ్యాలి. పూర్తిగా బతకాలి. నేను ప్రతిరోజూ ట్రై చేసేది ఇదే.

100 కోట్ల క్లబ్‌ (‘గీత గోవిందం’)లో ఇంత త్వరగా చేరుకుంటానని అనుకున్నారా?
మనందరం మన గురించి ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకుంటుంటాం. నేను ఏం చేసినా నచ్చి చేశాను కానీ రిజల్ట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అయితే ప్రతి రిజల్ట్‌ నాకేం చెప్పిందంటే ‘రేయ్‌.. ఇది జరుగుతుంది అని అనుకోకుండా నువ్వు ఇది చేసి ఉంటే.. నువ్వింకా పెద్దవి సాధించే సత్తా నీలో ఉంది’ అని. అందుకే నేనింకా పెద్ద కలలు కంటూ, నన్ను ఇంకా ముందుకు పుష్‌ చేసుకుంటున్నాను.

మీరీ రేంజ్‌కి రావటం వెనక దాదాపు ఏడేళ్ల కష్టం, నిరీక్షణ ఉన్నాయి. ఆ టైమ్‌లో మానసికంగా మీరు డౌన్‌ అయిన సందర్భాలు ఏమైనా?
ఉండేవి ఎలానూ ఉంటాయి. కానీ జీవితం అన్నాక మినిమమ్‌ ఆ మాత్రం డ్రామా ఉంటేనే మనకు రోజులు గడుస్తాయి. ఆ కష్టాలను, ఎత్తుపల్లాలను అధిగమించి సక్సెస్‌ అయినప్పుడే మనకి ఒక ఎత్తు, ఒక సంతృప్తి, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది.

మీ లుక్స్‌ బాగుంటాయి కాబట్టి ‘ఫేస్‌ అద్దంలో చూసుకున్నావా’ అని మిమ్మల్ని రిజెక్ట్‌ చేసే ఛాన్సే లేదు. మరి చాన్సుల కోసం వెళ్లినప్పుడు ఏ కారణంతో మిమ్మల్ని రిజెక్ట్‌ చేశారు?
మనుషులెప్పుడూ వాళ్ల ఫేస్‌ వల్ల రిజెక్ట్‌ అవ్వరు. వాళ్లు ‘నో వన్‌’ (ఏమీ కారు) అనే  కారణంతో తిరస్కరణకు గురవుతారు. అప్పుడు నేను  ‘నో వన్‌’. అందుకే నన్ను రిజెక్ట్ చేశారు.

కొందరు యూత్‌ వెంటనే సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు. మీ లైఫ్‌ నుంచి వారికి ఇచ్చే సలహా?
నేను సలహాలు ఇచ్చే బిజినెస్‌లో లేను (నవ్వేస్తూ).

ఒకవేళ మీరు ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యుంటే ఇంత హ్యాపీనెస్‌ ఉండేదా? ఓపిక వహించి సక్సెస్‌ కొట్టడంలోనే ఎక్కువ మజా ఉందా?
హ్యాపీనెస్‌ స్టార్‌ అవ్వడంలో లేదు. ఆనందం ఎందులో ఉంటుందంటే.. తినడానికి, ఖర్చులకు డబ్బులు ఉండటం, ఉండటానికి ఇల్లు, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు భయంతో కాకుండా నచ్చింది చేయడం, అమ్మానాన్న, నా ఫ్రెండ్స్‌ ఫేసెస్‌లో గర్వం, సంతోషం చూడటంలో ఉంటుంది. సో ఇవి ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా నాకు ఓకే.

బ్యాగ్రౌండ్‌ ఉండటం చాలా మంచిదంటారు. కానీ బ్యాగ్రౌండ్‌ కన్నా టాలెంట్‌ పెద్దదైతే అప్పుడు ఏ బ్యాగ్రౌండ్‌ అక్కర్లేదనడానికి మీరో ఎగ్జాంపుల్‌. మీరేమంటారు?
ప్రకృతి ఎప్పుడూ ‘డిమాండ్‌ అండ్‌ సప్లై’ మీద నడుస్తుంటుంది. ఉన్నవాళ్లకి డిమాండ్‌ ఉంటుంది. నేను నా అంతట నాకు డిమాండ్‌ క్రియేట్‌ చేసుకుని, సప్లై అయ్యాను.

రౌడీ బాయ్స్‌ అండ్‌ గాళ్స్‌ అంటూ ఫ్యాన్స్‌ని సంబోధిస్తుంటారు. ఫ్యాన్స్‌ని ఇలా సంబోధించాలనే ఆలోచన ఎక్కడిది?
ఫ్యాన్స్‌ అనే పదంతో నాక్కొంచెం ఇబ్బంది. ఆ పదానికి బదులు వేరే ఏదో ఉంటే బాగుంటుందనుకున్నా. అది బై చాన్స్‌ ‘రౌడీ’ అయ్యింది (నవ్వుతూ).
ఒకరి ఫెయిల్యూర్‌ని ఇంకొకరు సెలబ్రేట్‌ చేసుకుంటూన్నారంటే.. ఫెయిల్యూర్‌ని ఎదుర్కొన్న వ్యక్తి టాప్‌లో ఉన్నట్టే. మరి మీ సినిమా ఫెయిల్యూర్‌కి పార్టీ చేసుకున్న వాళ్ల గురించి ఏమంటారు?
హహ్హహ్హ... అసూయ, పోటీతత్వం అనేవి సహజమైన ఎమోషన్స్‌. ఆ ఫీలింగ్స్‌ నుంచే ఇంకా వర్క్‌ చేద్దాం, ఇంకా ఏదైనా ట్రై చేద్దాం, ఇంకా.. ఇంకా అనే బోలెడన్ని మంచి ఫీలింగ్స్‌ వస్తుంటాయి. అందుకని అలాంటివి జరగడం మంచిదే.
 

కాంపిటీషన్‌ని డీల్‌ చేయడం, స్టార్‌డమ్‌ని హ్యాండిల్‌ చేయడంలో ఉన్న కష్టాల?
సినిమా ప్రపంచం చాలా విచిత్రమైనది. ఓ యాక్టర్‌గా జీవితం చాలా అసహజంగా ఉంటుంది. అందుకే నాకు నేను ఎప్పటికప్పుడు  ‘మనం ఇక్కడ ఉన్నది నటించడానికి మాత్రమే. పోటీని ఎదుర్కోడానికి, స్టార్‌డమ్‌ని హ్యాండిల్‌ చేయడానికి కాదు’ అని గుర్తు చేసుకుంటుంటాను. మన పని మనం చెయ్యాలంతే.

మీ డ్రెస్‌ కోడ్‌ విచిత్రంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్కెట్‌ చేసుకోవడంలో ఇది ఓ భాగమా?
వేసుకునే బట్టల గురించి పెద్దగా డిస్కషన్‌ అవసరం లేదని నా ఫీలింగ్‌. ఎవరు ఏ బట్టలు వేసుకున్నా మనకెందుకు? వాళ్లు హ్యాపీగా ఉండి, ప్రెజెంటబుల్‌గా ఉంటే చాలనుకుంటాను.

ఒక రెండేళ్ల క్రితం మీ బొమ్మ బయట ఏ గోడ మీదా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటుంటే ఆ ఫీలింగ్‌ ఎలా ఉంది? 
నేను ఈ రోడ్డు మీద ఉన్న బొమ్మ నుంచి ‘డిటాచ్‌’ అయిపోయా. ఆ గోడ మీద ఉన్న అతను నాకు కేవలం ఒక నటుడు మాత్రమే. అతను అతని పని చేసుకుంటున్నాడు అనుకుంటా. అతన్ని చూసినప్పుడు నాకెలాంటి ఫీలింగ్స్‌ ఉండవు.

మీ కెరీర్‌ ఎదుగుదలలో ఎవరికైనా కృతజ్ఞతగా ఉండాలంటే.. చెప్పడానికి ఏమైనా పేర్లున్నాయా?
కృతజ్ఞతలు తెలపడం మాత్రమే కాదు దాన్ని ‘రీపే’ చేసి తీరుస్తా. ఇవాళ నేను ఏంటి? నేను ఎక్కడున్నాను? అనే ఈ జర్నీలో తెలిసీ తెలియక చాలామంది వ్యక్తులు కీలకపాత్ర పోషించారు. నా శక్తి మేరకు వాళ్ల జీవితాలకు తిరిగి ఏదైనా చేయడానికి ట్రై చేస్తా. 

 యూత్‌ఫుల్‌ హీరోని సీరియస్‌ క్వొశ్చన్స్‌ అడుగుతున్నాం. ఇప్పుడు మీ ఏజ్‌కి తగ్గట్టు పార్టీయింగ్‌ గురించి మాట్లాడుకుందాం. ఆర్‌ యు ఏ పార్టీ యానిమల్‌?
నాకు ఫ్రెండ్స్‌తో ట్రావెల్‌ చేయడం ఇష్టం. అలాగే వాళ్లతో స్పోర్ట్స్‌ ఆడటం ఇష్టం. నా ఇంటి టెర్రస్‌ మీద రాత్రుళ్లు గంటల తరబడి మాట్లాడంలో ఓ మజా ఉంటుంది. పార్టీయింగ్‌ అనే కాన్సెప్ట్‌ నాకు లేదు.

లవ్‌ ఫెయిల్యూర్‌ అయితే ‘అర్జున్‌ రెడ్డి’లో డ్రగ్స్‌ తీసుకున్నారు. మరి రియల్‌ లైఫ్‌లో ఎవరైనా అలా చేస్తే?
అది సినిమాలో క్యారెక్టర్‌. అంతే.. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ చేయరు. బుద్ధి ఉన్నోళ్లు వాటి వైపు వెళ్లరు కూడా.

 ఒకవేళ మీరు లవ్‌లో ఫెయిల్‌ అయితే దేవదాస్‌ అవుతారా?
ఏమో.. ఫెయిల్‌ అయినప్పుడు తెలుస్తుంది.

 ఈ మధ్య కాలంలో మీరు అందుకున్న లవ్‌ లెటర్స్‌లో మిమ్మల్ని బాగా ఎగై్జట్‌ చేసిన లెటర్‌?
నాకు రాసిన ప్రతి లెటర్‌ని చదివేటప్పుడు నేను ఎమోషనల్‌ అవుతా. అందుకే అన్ని లెటర్స్‌ని జాగ్రత్తగా దాచుకోవాలని డిసైడ్‌ అయ్యాను.

‘నా పంతం ఎంతా.. ఈ విశ్వమంతా..’ అని ‘అర్జున్‌రెడ్డి’లో పాడారు. అమ్మాయిల్లో మీ ఫాలోయింగ్‌ విశ్వమంత. మరి ‘నన్నే పెళ్లాడాలని’ ఎవరైనా పంతం పడితే?
పెళ్లికి నేను రెడీగా లేను. సో.. ఇప్పుడు ఏమీ చేయలేను.

కొడుకు సక్సెస్‌ తల్లికి బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది. మీ అమ్మ గురించి చెప్పండి?
పట్టలేనంత ఆనందం, సంతృప్తి అరుదుగా కలుగుతుంటాయి. అమ్మ కళ్లలో ఆనందం చూసినప్పుడు నేనలా ఫీలవుతాను. నా సినిమాలు హిట్టయినప్పుడు కూడా పెద్దగా ఏమీ అనిపించదు. మా అమ్మానాన్నకు పెద్ద పెద్ద కోరికలు ఏవీ లేవు. ఒక్క సొంత ఇల్లు తప్ప నన్ను ఏమీ అడగలేదు. నా సక్సెస్‌ని వాళ్లు బాగా ఎంజాయ్‌ చేయాలని, కొత్త కొత్తవి కొనుక్కోవాలని, ట్రావెల్‌ చేయాలనీ ఉంటుంది. కానీ వాళ్లు ఇవన్నీ కాకుండా జస్ట్‌ నా వర్క్, ప్రేక్షకుల నుంచి నాకు దక్కుతున్న ప్రేమను చూసి ఆనందపడుతున్నారు.

ఆ మధ్య మీ అమ్మకు బాలేనప్పుడు దగ్గరుండలేకపోతున్నా. ఈ కెరీర్‌ ఎందుకు అనుకున్నారట?
ఏమో.. అప్పుడున్న పరిస్థితిలో అలా అనిపించింది. అమ్మానాన్న నా ప్రపంచం. ఇంత చేసి వాళ్లతో ఉండలేకపోతే ఏం లాభం అని కోపం వచ్చింది. ఆ ఎమోషన్‌లో అలా అనుకున్నాను.

ఒకవేళ హీరోగా సక్సెస్‌ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?
మా నాన్నగారు ఊళ్లో వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు ఊళ్లో నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. సో.. అక్కడ ఏదైనా ప్లాన్‌ చేసుకునేవాడిని.

హీరోగానేనా? వేరే లక్ష్యాలేమైనా?
నా క్లాతింగ్‌ లైన్‌ ‘రౌడీ వియర్‌’ ఎదుగుతోంది. రానున్న రెండేళ్లలో అది 100 కోట్ల కంపెనీ అవుతుంది. ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేశాను. త్వరలో ఈ సంస్థ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్‌ గురించి అందరూ వింటారు.

 2018లో న్యూ టాలెంట్‌ వచ్చింది. 2019లోనూ జరుగుతుందా?
కచ్చితంగా.. ఎప్పుడూ న్యూ టాలెంట్‌ వస్తూనే ఉంటుంది. అది ఇండస్ట్రీకి మంచిది. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా.

ఫైనల్లీ న్యూ ఇయర్‌ ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటారో చెబుతారా?
ఈరోజు (శనివారం) వెళ్లిపోతున్నా. ఏ ప్రాంతానికి వెళుతున్నానో చెప్పను. ఫోన్‌ పని చేయని చోటు అది. ఓ దీవిలో బోటులో ఉంటాను. ఒక్క పది రోజులు ఎవరికీ అందకుండా కొత్త ప్రపంచాన్ని చూసి వస్తా.
– డి.జి.భవాని

 పుస్తకాలు చదువుతారా? చదివితే.. ఎలాంటి పుస్తకాలు?
 చదువుతాను. అయితే ఇప్పుడు తక్కువైంది. కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్‌ చేస్తాను. లవ్‌స్టోరీలు తప్ప అన్ని రకాల పుస్తకాలు చదువుతాను. 
మిమ్మల్ని మీరు మోటివేట్‌ చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఆలోచిస్తాను. ఏదైనా మన మనసుని బట్టే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement