వైఎస్ఆర్ పాత్రలో విజయచందర్
వైఎస్ఆర్ పాత్రలో విజయచందర్
Published Wed, Aug 14 2013 12:14 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
రియల్లైఫ్ క్యారెక్టర్లు చేయడంలో విజయచందర్ మేటి. ఆయన పోషించిన జీసెస్, శిరిడీసాయి, ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ పాత్రలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన జనహృదయనేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో తెలుగు ప్రజల ముందుకు రానున్నారు. ‘మా నేత రాజన్న’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి కంకణాల శ్రీనివాసరెడ్డి దర్శకుడు.
షేక్ సైదా సూరజ్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ముహూర్తపు దృశ్యానికి మోహన్ కెమెరా స్విచాన్ చేయగా, వైఎస్ఆర్సీపీ నాయకుడు రెహమాన్ క్లాప్ ఇచ్చారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. విజయచందర్ మాట్లాడుతూ -‘‘తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహనీయులు టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, వైఎస్ఆర్.
ఈ ముగ్గురిలో టంగుటూరి, ఎన్టీఆర్ పాత్రలు చేసేశాను. ఇప్పుడు వైఎస్సార్ పాత్ర చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను నటించడం యాదృచ్ఛికం. ఆ మహానేతే నా వెనకుండి నాతో ఈ పాత్ర చేయించుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. వైఎస్ఆర్ పాత్ర చేయడానికి విజయ్చందర్ ముందుకు రావడంతో మాకు కొండంత బలం వచ్చిందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: తులసి శ్రీనివాసరావు, సహ నిర్మాత: మస్దాని సూరజ్.
Advertisement
Advertisement