శంకర్ 'ఐ' చిత్రానికి యూట్యూబ్లో 25లక్షల హిట్లు
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'ఐ' చిత్రం ట్రైలర్ యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది. అది విడుదలై 24 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే 25 లక్షల హిట్లు దాటిపోయాయి. ఇప్పటివరకు తాము విడుదల చేసిన ఏ ట్రైలర్కూ ఇంత భారీ ఆదరణ చూడలేదని, సినిమా పరిశ్రమలోనే ఇది సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సోనీ మ్యూజిక్ ఇండియా దక్షిణ భారత విభాగం అధిపతి అశోక్ పర్వానీ చెప్పారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దాదాపు రూ. 150 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. ఇందులో అమీ జాక్సన్, ఉపేన్ పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే చెన్నైలో ఆవిష్కరించడం, దానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ హాజరు కావడం తెలిసిందే.