దీపిక ‘ట్రిపుల్’... యాక్షన్ అదుర్స్!
సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనేకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షారుఖ్ ఖాన్ మొదలుకొని పలువురు స్టార్ హీరోలతో నటించారామె. ఒక చిన్న చిరునవ్వుతోనే కట్టిపడేయగల సమర్థత ఆమెది. బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసినా పాపులారిటీ మాత్రం ప్రాంతీయ భాషలకీ పాకింది. ప్రపంచ దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. ఆ గుర్తింపు, క్రేజ్ వల్లే దీపికాని హాలీవుడ్ ఛాన్స్ వరించింది. ప్రముఖ హాలీవుడ్ హీరో విన్ డీజిల్ కథానాయకుడిగా నటించిన ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’లో దీపిక ఓ కథానాయికగా నటించారు. ‘ట్రిపుల్ ఎక్స్’ అనేది హాలీవుడ్‌లో విజయవంతమైన ఫ్రాంచైజీ. అందులో దీపిక అవకాశం సాధించడం మామూలు విషయం కాదు. ఇది ఆమెకి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో దీపిక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. దీపికాపై ఉన్న అభిమానం వల్ల ఇండియాలో ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా మేనియా ఇండియాలో పెద్ద ఎత్తునే కనిపిస్తోంది. ఇతర దేశాలకంటే ముందుగా ఈ సినిమా మన దేశంలో రేపే విడుదలవుతుండడం విశేషం.
‘ట్రిపుల్ ఎక్స్’ హెయిర్ స్టైల్
దీపిక సినిమా మేనియా ఏకంగా ప్రేక్షకుల తలకెక్కింది. ఇండియాలో కొద్దిమంది దీపిక ఫ్యాన్స్ ‘ట్రిపుల్ ఎక్స్’ అని తలపై అక్షరాలు రాయించుకొన్నారు. రెస్టారెంట్లలోనూ, బేకరీల్లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’ పేరుతో ఆహార పదార్థాల్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్నిబట్టి ఈ సినిమాపై మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో చెప్పొచ్చు. యాక్ష¯Œ కి పెట్టింది పేరైన ‘ట్రిపుల్ ఎక్స్’ ఫ్రాంచైజీకి ఇండియాలో పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇప్పుడీ చిత్రానికి దీపిక కూడా తోడు కావడంతో ఆ అభిమానం పదింతలు పెరిగింది.
దీపిక... ఇక యాక్షన్ భామ
రొమాంటిక్ చిత్రాలతో యువతరానికి చేరువైన దీపిక ఈ చిత్రంతో ఇక యాక్షన్ భామగా అవతరించనున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఆమె చేసిన స్టంట్లు ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేస్తాయని చిత్రబృందం పేర్కొంది. ‘ప్యారమౌంట్ పిక్చర్స్’, ‘రెవల్యూషన్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని భారతదేశంలో ‘వయా కాం 18’ సంస్థ విడుదల చేస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రం పెద్ద ఎత్తున రేపే విడుదల కానుంది.