
5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న హీరో
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్ను స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అల్పాదాయం గలవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ ఏడాది చివరికి 5 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పాడు.
మిషన్ 360 పేరుతో మహారాష్ట్ర వ్యాప్తంగా 360 ప్రాంతాల్లో ప్రాజెక్టు చేపట్టామని వివేక్ తెలిపాడు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పాడు. లాభాలను ఆశించకుండా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటి ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని తెలిపాడు. ఈ ప‍్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పాడు. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోలేదని ప్రైవేట్గా సేకరించామని తెలిపాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, ప్రస్తుతానికి మహారాష్ట్రలో ప్రాజెక్టు పూర్తిచేయడమే తమ లక్ష్యమని చెప్పాడు.