వినాయక్‌ని డబ్బుతో కొనలేం!
వినాయక్‌ని డబ్బుతో కొనలేం!
Published Thu, Dec 5 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
‘‘నేను ప్రొడక్షన్ మేనేజర్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం మోహన్‌బాబుగారే. అలాగే, నిర్మాతగా నాకు కొత్త జీవితాన్నిచ్చిన శ్రీహరిని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు బెల్లంకొండ సురేష్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బెల్లంకొండ తను నిర్మిస్తున్న చిత్రాల గురించి మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి ‘రభస’ వర్కింగ్ టైటిల్. ‘జోరు’ అని ప్రచారంలో ఉంది కానీ ఇంకా ఖరారు చేయలేదు. ఎన్టీఆర్‌తో ‘ఆది’వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించిన 12 ఏళ్లకు మళ్లీ తనతో సినిమా చేస్తున్నా. వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం.
లారెన్స్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘ముని 3’ ఇప్పటికి 70 శాతం పూర్తయ్యింది. తాప్సీ నాయికగా ప్రత్యేక పాత్రలో, నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆది’ ద్వారా దర్శకునిగా పరిచయం చేశాననే అభిమానంతో వినాయక్ ఈ సినిమా చేస్తున్నారు. అంతేకానీ, చాలామంది అనుకుంటున్నట్లు భారీ పారితోషికం కోసం కాదు.
వినాయక్‌ని డబ్బుతో కొనలేం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం, ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. తొలి చిత్రానికే మంచి టెక్నీషియన్స్ దొరకడం శ్రీనివాస్ అదృష్టం. తను మా అబ్బాయి అని కాకుండా సినిమాకి ఏమేం కావాలో అవన్నీ చేస్తున్నాను. ఇది లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్’’ అని చెప్పారు. తదుపరి నాగార్జున హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నట్లు, కథ సిద్ధమైనట్లు బెల్లంకొండ తెలిపారు.
Advertisement
Advertisement