వీవీవినాయక్
‘‘నిన్నే ఫైనల్ కాఫీ చూశాం. సినిమా చాలా బాగా వచ్చింది. తేజు, లావణ్య బాగా చేశారు. నేను అందర్నీ బాగా చూసుకుంటాను. కల్యాణ్ గారు నన్నో గాజు బొమ్మలా చూసుకున్నారు. ఖచ్చితంగా ‘ఇంటిలిజెంట్’ సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు వీవీవినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్ పలు విశేషాలు పంచుకున్నారు.
► ఈ సినిమాలో ఒక సోషల్ ఇష్యూను టచ్ చేశాం. మైండ్ గేమ్స్ మీద సినిమా ఉంటుంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. నా స్టైల్‌లోనే ఫుల్ కమర్షియల్ మీటర్‌లో ఉంటుంది. సాయిధరమ్, నేను, కల్యాణ్... మా ముగ్గురిలో ఎవరు ఇంటిలిజెంట్ అంటే సి.కల్యాణ్ గారే (నవ్వుతూ).
► ఆకుల శివ మంచి కథ అందించారు. తమన్ సూపర్ మ్యూజిక్ అందించాడు. జానీ, శేఖర్ మాస్టర్‌లు డ్యాన్స్‌లు బాగా కంపోజ్ చేశారు. కాంబినేషన్ ప్రెష్‌గా ఉంటుందని తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠిను తీసుకున్నాం. తను కుడా చాలా బాగా చేసింది. సినిమా టెంపోకు అడ్డు రాకూడదని కేవలం నాలుగు పాటలే పెట్టాము. నా మునుపటి సినిమా ఖైదీ నెం.150లో కూడా నాలుగు పాటలే ఉన్నాయి.
► ఈ సినిమాతో ఎంత పెద్ద కమర్షియల్ కథనైనా మోయగలడు అనే నమ్మకం తీసుకొచ్చాడు తేజ్. తనని హీరోగా ఫిక్స్ చేశాక ‘చమక్ చమక్’ సాంగ్‌ను రీమిక్స్ చేయాలనుకున్నాను. చిరంజీవిగారి పాటల్లో అది నా ఫెవరేట్ సాంగ్. అడిగిన వెంటనే ఇళయరాజాగారు పాటను మాకు ఇచ్చారు.
► మెగా ఫ్యామిలిలో నాలుగో హీరోతో చేశాను. చిరంజీవిగారితో సినిమా అంటే సెట్‌లో అందరం చాలా టెన్షన్‌గా ఉంటాం. చరణ్, బన్నీ విషయానికి వస్తే వాళ్లను ఠాగూర్’ సినిమా అప్పుడు నుంచి చూస్తున్నాను. చరణ్ చాలా సౌమ్యుడు. బన్నీ చాలా హార్డ్ వర్కింగ్. తేజ్, వరుణ్‌తేజ్ ఒకేసారి వస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. బాగుంటే రెండు సినిమాలు ఆడతాయి. సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత.. ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో అందరికంటే సినిమానే గొప్ప.
► బయట కథలతో సినిమా ఎందుకు తీస్తున్నానంటే, ఒక్కో కథకు చాలా టైమ్ పడుతుంది. రాఘవేంద్రరావుగారు ఓసారి అన్నారు. ఎప్పుడూ మన కథలే కాదు బయట కథలు కూడా చేయాలి. లేకపోతే మన ఐడియాలే రిపీట్ అవుతాయని. బయట కథలు చేస్తే కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది.
► మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నాకా ఆలోచన లేదు. దర్శకుడిని కావాలనుకోలేదు.. అయ్యాను. సో... డెస్టినీకు వేరే ప్లాన్స్ ఏం ఉన్నాయో నాకు తెలీదు.
► రెండేళ్ల తర్వాత కొత్తవాళ్లతో సినిమా తీస్తాను. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్స్ కూడా చెబుతా. స్టార్స్‌తో అయినా కాబోయే స్టార్స్‌తో సినిమా అయినా నాకు టెన్షనే. బేసిక్‌గా సినిమా అంటేనే టెన్షన్. ఈ మధ్యన ఎవరో ఎయిర్‌పోర్ట్‌లో ఒ వ్యక్తి ‘సుమోలు గాల్లో లేస్తేనే మీ సినిమాలా ఉంటుంది సార్’ అన్నారు. ప్రతి సినిమాలోనూ సుమోలు గాల్లో ఎలా లేపుతాం (నవ్వుతూ). సినిమా సినిమాకు గ్యాప్ కావాలని తీసుకోం. రైటర్స్ కొరత కూడా అనను. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావట్లేదు. అవకాశం ఉన్నవాళ్లకు మంచి కథలు సెట్ కావట్లేదు.
► నా తర్వాత సినిమా ఏంటో నాక్కూడా తెలియదు. ‘అదుర్స్ 2’ వర్క్‌వుట్ చేద్దామనుకున్నాం. బట్ సెట్ అవ్వలేదు. కానీ తప్పకుండా ఉంటుంది. మహేశ్‌తో సినిమా చేద్దామనుకున్నాను కానీ మంచి కథ చెప్పలేకపోయా.
Comments
Please login to add a commentAdd a comment