'ఆయన జైలు నుంచి రాగానే షూటింగ్ ప్రారంభిస్తాం'
ముంబై: బాలీవుడ్ మూవీ 'మున్నాబాయ్ ఎమ్బీబీఎస్' మూడో భాగం తీయడానికి అంతా సిద్ధంగా ఉన్నారని నటుడు అర్షద్ వార్సీ అన్నాడు. ప్రముఖ నటుడు, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి రాగానే సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని అర్షద్ తెలిపాడు. అర్షద్ వార్సీ మీడియాతో మాట్లాడుతూ.. 'మున్నాబాయ్ 3' కోసం కథ కూడా సిద్ధంగా ఉందని, సినిమా తీయడంలో ఎటువంటి సందేహాలు లేవన్నారు. సంజయ్ జైలు నుంచి తిరిగొచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోగానే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పాడు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'గుడ్డు రంగీలా' మూవీ ప్రమోషన్లలో వార్సీ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
'మున్నాబాయ్ ఎమ్బీబీఎస్', రెండో భాగం 'లగేరహో మున్నాబాయ్' మూవీలలో అర్షద్ వార్సీ నటించారు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్ దాదా ఎమ్బీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలలో శ్రీకాంత్ పోషించిన ఏటీఎమ్ పాత్రను హిందీ వెర్షన్లో అర్షద్ వార్సీ చేశారు. ముంబైలో 1993 పేలుళ్లు జరిగిన సమయంలో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని, అల్లర్లకు సంబంధం ఉందన్న కేసులలో నిందితుడైన సంజయ్ ప్రస్తుతం ముంబైలోని ఎరవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.