సావిత్రిగా మారడానికి బరువు పెరగాలా?
తమిళ సినిమా: మహానటి సావిత్రి జీవిత చరిత్ర తమిళం, తెలుగు భాషల్లో వెండితెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో యువ నటి కీర్తీసురేశ్ నటిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తీనా? అని ఆశ్చర్యపోయిన వాళ్లూ, తను సావిత్రిలా ఎలా మారుతుందనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సావిత్రి ఆది నుంచి కొంచెం బొద్దుగా ఉండేవారు. కీర్తీసురేశ్ సన్నగా ఉంటుంది. దీంతో కీర్తీని దర్శక నిర్మాతలు బాగా లావెక్కాలని ఆంక్షలు విధించినట్లూ, అందుకు తను అంగీకరించినట్లూ, కాదు నిరాకరించినట్లూ రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క తను బరువును సుమారు 80 కేజీల వరకూ పెంచి నటించారు.
అలాంగే నటి కీర్తీసురేశ్ కూడా సావిత్రి పాత్ర కోసం బరువు పెంచి నటిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ విషయంపై ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ప్రోస్థేటిక్ మేకప్ ద్వారా తాను సావిత్రిలా బొద్దుగా మారుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ మధ్య అవ్వై షణ్ముగి చిత్రం కోసం విశ్వనటుడు కమలహాసన్ ఈ ప్రోస్థేటిక్ మేకప్‌తోనే ఆంటీగా మారి అలరించారన్నది గమనార్హం. పాపం ఈ మేకప్ గురించి తెలియక అనుష్క తన శరీరాన్ని భారీగా పెంచుకుని ఆనక తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. బాహుబలి–2 చిత్రంలో అనుష్కను నాజూగ్గా చూపించడానికి దర్శకుడు రాజమౌళి రూ.కోట్లు ఖర్చు చేయాల్సివచ్చింది. అనుష్క పరిస్థితిని గ్రహించే కీర్తీసురేశ్ బరువు పెరగరాదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది.