'కొండల్లో రంగురాళ్ల కోసం తిరిగాం'
హైదరాబాద్: ఆర్య, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, మొగుడు, రేయ్ చిత్రాలతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్దాదాస్. ప్రత్యేక పాత్రలతో కుర్రకారును ఆకట్టుకోవడంలో ఆమెకు తిరుగులేదు. పుట్టి పెరిగింది ముంబైలో అయినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకుంది.
మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే... ‘నేను పుట్టి పెరిగింది, విద్యాభ్యాసం, కెరీర్ అంతా ముంబయి అయినప్పటికీ రాయ్‌బరేలీతో మాత్రం విడదీయని అనుబంధం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లాలోనే మా అమ్మమ్మ వాళ్ల ఊరుంది. ప్రతి వేసవిలో మా ఇంటిల్లిపాది అక్కడికి వెళ్లేవాళ్లం. చాలా పెద్ద కుటుంబం మాది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి 25 మందిమి ఉండేవాళ్లం. ఇల్లు కూడా ఎంతో విశాలంగా ఉండేది. ఇంట్లోనే అన్ని సదుపాయాలు ఉండేవి. పాడి పశువులు బాగా ఉండేవి. పాలు, పెరుగు, వెన్న, జున్ను అంతా మా ఇంట్లోనే లభించేవి. వేసవి సెలవులను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.
పొద్దంతా ఆటలే ఆటలు. చాట్, సమోసాలతో పాటు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడూ మాకోసం సిద్ధంగా ఉండేవి. ఇదంతా ఒకవైపు.. మరోవైపు రంగురాళ్ల కోసం సాగించే అన్వేషణ. బరేలీలో వేల రకాల రంగురాళ్లు లభించేవి. వాటి కోసం కొండలు, గుట్టలు తిరిగేవాళ్లం. రంగురాళ్లను కనిపెట్టడం వాటిని ఇంటికి తెచ్చుకోవడం ఎంతో సరదాగా ఉండేది ఆ రోజుల్లో. అలా పిల్లలమంతా కలిసి రంగురాళ్ల కోసం కొండలు, గుట్టల వెంట వెళ్తున్నప్పుడు మాతో ఎవరో ఒకరు పెద్దవాళ్లు ఉండేవాళ్లు. ఆ రంగురాళ్ల వేట నా జీవితంలో ఇప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం.