
లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్ బుధవారం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరై.. కాంగ్రెస్ వర్గాలను విస్మయ పరిచారు. విపక్షాలన్నీ ఉమ్మడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించాయి. మరోవైపు యూపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ లక్నోలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి డుమ్మా కొట్టి మరీ అదితి సింగ్ అసెంబ్లీకి హాజరుకావడం గమనార్హం.
అదితి సింగ్ రాయ్‌బరేలి జిల్లా ఎమ్మెల్యే. ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నది. అదితి తండ్రి అఖిలేశ్ సింగ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. అదితి కూడా ప్రియాంక సన్నిహిత అనుచరురాలుగా ఇన్నాళ్లు కొనసాగారు. కానీ, బుధవారం అనూహ్యంగా ఆమె ప్రియాంక ర్యాలీకి గైర్హాజరై.. అసెంబ్లీకి హాజరు కావడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ ఇచ్చింది.
అదితి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని, ఈ క్రమంలో యోగి సర్కారు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తాను బీజేపీలో చేరతున్నట్టు వస్తున్న కథనాలను అతిది సింగ్ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment