మన తెలుగువాళ్ల టేస్టే వేరు!
స్నేహను తెలుగువారు స్నేహంగా చూస్తారు. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా బాపు ఆమెని గుర్తించి, తన ‘రాధాగోపాళం’లో హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రియమైన నీకు, మధుమాసం, వెంకీ, శ్రీరామదాసు... ఇవన్నీ స్నేహ ఇచ్చిన హిట్స్. ఇటీవల ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తెలుగింటి గృహిణిగా మార్కులు కొట్టేసింది. ‘సాక్షి’ కోసం ఆమె సంభాషణ...
కంగ్రాట్స్ స్నేహగారూ... ప్రెగ్నెంట్ అట కదా?
ఓ విషయం తెలిసిపోయిందా? చాలా థ్యాంక్సండీ.
ఇప్పడు ఎన్నో నెల? డెలివరీ ఏ నెలలో?
ఏడో నెల. ఆగస్ట్‌లో డేట్ ఇచ్చారు.
అయితే, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సమయంలోనే మీరు గర్భవతి అన్నమాట. ఆ యూనిట్ సభ్యులు సపర్యలు బాగానే చేసి ఉంటారు?
అవును. రాజేంద్రప్రసాద్‌గారైతే మామిడికాయతో చేసిన నాలుగు రకాల పచ్చళ్లు ఇంటి నుంచి తెచ్చి ఇచ్చారు. చాలా రుచిగా అనిపించాయి. బన్నీ (అల్లు అర్జున్) అయితే ఏవేవో స్వీట్లు తెచ్చిచ్చేవాడు. ఇక నిత్యామీనన్, సమంత అయితే షూటింగ్ గ్యాప్ వస్తే చాలు.. ‘విశ్రాంతి తీసుకోండి’ అని జాగ్రత్తలు చెప్పేవారు. మొత్తం మీద నన్ను మహారాణీలా చూసుకున్నారు.
మీకు ఆవకాయంటే ఇష్టమేనా?
చాలా. నిజానికి తెలుగువాళ్లు చేసినంత రుచిగా వేరేవాళ్లు ఆవకాయ పెట్టలేరని నా ఫీలింగ్. మా ఇంట్లో కూడా చేసుకుంటాం కానీ, నాకు తెలుగువాళ్ల పచ్చడే నచ్చుతుంది. చెన్నైలో ఉండే తెలుగు ఫ్రెండ్స్ ఈ సీజన్లో తప్పనిసరిగా తమ ఇంట్లో పెట్టిన ఆవకాయని గిఫ్టుగా ఇస్తుంటారు. కొత్త ఆవకాయని తెల్లన్నంలో ఒక చుక్క నెయ్యి కలిపి తిని, వారు కనిపెట్టిన ఆ టేస్ట్‌కి సెల్యూట్ చేస్తుంటాను.
- డి.జి. భవాని