సల్మాన్‌కు ఆమె ఎందుకు కటీఫ్ చెప్పింది?
సల్మాన్‌కు ఆమె ఎందుకు కటీఫ్ చెప్పింది?
Published Sat, Nov 19 2016 4:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
దేశంలో అత్యంత ముదురు బ్రహ్మచారి ఎవరంటే.. మొట్టమొదటి వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రియురాళ్ల పేర్లు మార్చేస్తూ ఉండే సల్లూభాయ్.. గత కొంత కాలంగా మాత్రం ఒకే పేరు వినిపిస్తోంది. ఆమే రొమేనియా మోడల్ లులియా వాంటూర్. పార్టీలు, సినిమా ఫంక్షన్లు, చివరకు ఇంట్లో జరిగిన కార్యక్రమాల సమయంలోనూ వీళ్లిద్దరూ కలిసి కనిపించడంతో ఇక సల్లూభాయ్ బ్రహ్మచర్య వ్రతం ముగిసిపోయినట్లేనని, లులియాతో కలిసి జీవితాంతం సుఖంగా గడుపుతాడని అంతా అనుకున్నారు. అంతలోనే.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇద్దరికీ చెడిపోయిందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని సల్మాన్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. అందుకు కారణాలేంటో కూడా ఎవరికీ తెలియలేదు. ఇటీవలే లులియా తన సొంత దేశానికి వెళ్లిపోయింది కూడా. అంతేకాదు, రొమేనియాలో అత్యంత విజయవంతమైన మహిళగా ఓ అవార్డు కూడా తీసుకుంది. సల్మాన్ గురించి ఆ అవార్డు తీసుకునే సమయంలో పెదవి విప్పని లులియా.. ఆ తర్వాత ఒక రొమేనియా పత్రికకు మాత్రం అన్నీ చెప్పిందట. ''సల్మాన్‌కు, నాకు ప్రేమ ఏమీ లేదు. ఇప్పుడంతా బాగానే ఉంది. సల్మాన్‌కు చాలామంది బాడీగార్డులు ఉన్నారు గానీ, నాకు రొమేనియాలోనే సురక్షితంగా ఉంది. నాకు ఇక్కడ బాడీగార్డులు అక్కర్లేదు'' అని ఆమె చెప్పారు.
ఇంకా.. ''నాకు ఇంతకుముందే పెళ్లయింది. గతంలోనే నా భర్తను వదిలేశాను. కానీ, భారతదేశంలో మాత్రం నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, ఎవ్వరినీ వదిలేయలేదు'' అని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే సల్మాన్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. భారతీయ సంస్కృతికి అలవాటు పడటం ఎంత కష్టమో కూడా ఆమె తెలిపింది. తాను అక్కడ చాలా కాలం కష్టపడి పనిచేసినా, ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించే చర్చలు సాగాయన్నారు. గతంలో తాను ఆరునెలల పాటు భారతదేశంలో ఉన్నప్పుడు తాను చర్చించదలచుకోని చాలా అంశాలు జరిగాయని తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రజలు, వాళ్ల ఆలోచనా తీరు అన్నీ భిన్నంగా ఉంటాయన్నారు. అక్కడ మనకు ఎక్కువ వ్యక్తిగతం అంటూ ఉండదని, ఒకే ఇంట్లో ఎక్కువ మందితో కలిసి ఉండాలని చెప్పారు. వీధుల్లో వెళ్లేటప్పుడు ఫలానా పద్ధతిలోనే దుస్తులు వేసుకోవాలన్న విషయం కూడా తనకు అర్థం కాలేదని తెలిపారు. తన దుస్తులు చాలా కురచగా ఉన్నాయన్న విషయం ఆ తర్వాత అర్థమైందన్నారు.
Advertisement
Advertisement