గబ్బర్ సింగ్ మౌనం ఎందుకు?
హైదరాబాద్: ప్రకృతి విపత్తులు ప్రజలను కష్టాల్లోకి నెట్టినపుడు చిత్ర పరిశ్రమ నడుం బిగించడం, సహాయ సహకారాలు అందించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సహాయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు రంగంలోకి దిగి మన మద్రాస్ కోసం అంటూ విరాళాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఇపుడు గబ్బర్ సింగ్ హాట్ టాపిక్ అయ్యాడు.
ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందుండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం చర్చనీయాంశం అయింది. గతంలో హూదూద్ తుఫాన్ సమయంలో అందరికంటే ముందుగా స్పందించిన పవన్ ఈసారి మాత్రం పెదవి విప్పకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగి అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నా స్పందించకపోవడం చర్చకు దారి తీసింది. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడమే కారణమా? లేక మరేమయినా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా ఉన్నారని అభిమానులంటున్నారు. అందువల్లనే సహాయాన్ని ప్రకటించలేకపోయారని, తమ అభిమాన హీరో త్వరలోనే స్పందిస్తారని చెబుతున్నారు.
కాగా వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, అల్లరి నరేష్, అఖిల్, నవదీప్,సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్, నిఖిల్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, మధు శాలిని, తేజస్వి మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఆదివారం ‘మన మద్రాస్ కోసం' అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి విరాళాలు, సహాయ సామాగ్రిని సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంజీరా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, కూకట్ పల్లిలోని ఫోరమ్ సంజానా మాల్ లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పలువురు సెలబ్రిటీలు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు.