ప్రియమైన హీరో అక్షయ్‌కుమార్‌కు..?
‘ఇమేజ్‌ను బట్టి ఓ నటుణ్ణి అంచనా వేయొద్దు.. జడ్జ్ చేయొద్దు. రాజ్‌కుమార్ రావు చేసిందే యాక్టింగా? అక్షయ్‌కుమార్ చేస్తే యాక్టింగ్ కాదా? బఫూనరీయా?’’ – అక్షయ్‌కుమార్‌కు మద్దతుగా ఓ ట్వీట్. ‘‘అక్షయ్ మంచి నటుడే. కానీ, ‘రుస్తుం’కి నేషనల్ అవార్డు ఇవ్వడం అవార్డులా కాదు... రివార్డులా ఉంది’’, ‘‘రుస్తుం’లో యాక్టింగ్‌కి అక్షయ్‌కి నేషనల్ అవార్డు ఇవ్వడమనేది రీసెంట్ టైమ్స్‌లో నేను విన్న పెద్ద జోక్. జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్ బెస్ట్ కామెడీ ఎవర్’’ – అక్షయ్‌కు వ్యతిరేకంగా రెండు మూడు ట్వీట్స్.
64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలు ప్రకటించగానే... సగటు సినీ ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో చెలరేగారు. అక్షయ్‌కు అవార్డు ఇవ్వడం సరికాదంటూ కొందరు, ఇవ్వడంలో తప్పేంటి? ఎందుకు ఇవ్వకూడదంటూ మరికొందరు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. మొత్తానికి, విజేతల వివరాలు ప్రకటించిన కొద్ది క్షణాల్లో వివాదం రాజుకుంది. చివరకు, అవార్డు కమిటీ జ్యూరీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రియదర్శన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
‘‘ఒక్క ‘రుస్తుం’లోనే కాదు.. ‘ఎయిర్ లిఫ్ట్’లోనూ అక్షయ్ నటన అద్భుతం. ఈ రెండిటినీ దృష్టిలో ఉంచుకునే ఆయన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేశాం. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవార్డుల జాబితాలో ‘రుస్తుం’ పేరుని మాత్రమే ఇచ్చాం’’ అని ప్రియదర్శన్ అన్నారు. రెండు చిత్రాల్లో అక్షయ్ నటనపరంగా తేడా చూపించారనీ, ఆయన నటన హృదయాలను హత్తుకునే విధంగా కూడా ఉందనీ ప్రియదర్శన్ అన్నారు. ఈ వివరణతో వివాదం సద్దుమణగలేదు. ఇంతకీ అక్షయ్ అవార్డుకి అర్హుడు కాడా? అంటే.. తప్పకుండా అర్హుడే. అయితే, అవార్డు జాబితాల పోటీలో నిలిచిన చిత్రాల్లో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ ఉండటం పై చర్చకు దారి తీసింది.
ఆమిరే అర్హుడు!
మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘దంగల్’. ఇందులో మహవీర్ పాత్రను ఆమిర్ చేశారు. మల్లయోధుడిగా, ఇద్దరు బిడ్డల తండ్రిగా నటించారాయన. వయసు మీద పడిన వ్యక్తిగా కనిపించడం కోసం ఆమిర్ బరువు పెరిగారు. బాన పొట్టతో కనిపించారు. ఆహార్యం మాత్రమే కాదు.. నటన కూడా అద్భుతం. అందుకే ‘రుస్తుం’ సినిమాకిగాను అక్షయ్‌కి ఇచ్చే బదులు ‘దంగల్’ సినిమాకిగాను ఆమిర్‌కి ఇచ్చి ఉండొచ్చన్నది పలువురి అభిప్రాయం.
ప్రియమైన హీరో అక్షయ్
అక్షయ్‌కుమార్ అంటే ప్రియదర్శన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నది చాలామందికి తెలిసిన విషయం. మలయాళంలో ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రాలను హిందీలో అక్షయ్ హీరోగా రీమేక్ చేశారు. ప్రియదర్శన్–అక్షయ్ కాంబినేషన్‌లో ‘హేరా ఫేరీ’, ‘గరమ్ మసాలా’, ‘భాగమ్ భాగ్’, ‘భూల్ భులయ్యా’, ‘దే ధనా ధన్’, ‘కట్టా మీఠా’ తదితర చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అభిమానం. బహుశా.. జాతీయ అవార్డుల ఎంపికలో ఈ ‘అభిమానం’ ఏమైనా ప్రభావితం చేసి ఉంటుందా? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.