విష్ణుని ఎలా చూడాలనుకున్నానో ‘అనుక్షణం’లో అలా ఉన్నాడు!
‘‘మనకున్న గొప్ప దర్శకుల్లో వర్మ ఒకరు. ఆయన స్థాయిని వంద రెట్లు పెంచే చిత్రం ఇది. ఐపీయస్ ఆఫీసర్‌గా విష్ణు పాత్రను మలిచిన విధానం, తన నుంచి నటన రాబట్టిన వైనం అద్భుతం. ఏదో మా అబ్బాయి సినిమాని ప్రమోట్ చేయడానికి, సినిమాకి హైప్ తీసుకురావడానికి చెబుతున్న మాటలు కావివి’’ అని మోహన్‌బాబు అన్నారు. విష్ణు హీరోగా రేవతి, తేజశ్వి, మధుశాలిని తదితరులు ముఖ్య తారలుగా ఏవీ పిక్చర్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుక్షణం’. పార్ధసారధి-గజేంద్రనాయుడు-విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 12న విడుదల కానుంది.
ఈ చిత్రం రషెస్ చూసిన మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి విష్ణుని క్రమశిక్షణ గల పోలీసాధికారిని చేయాలనుకున్నాను. కానీ, తను హీరో కావాలనుకున్నాడు. నిజజీవితంలో విష్ణుని నేనెలా చూడాలనుకున్నానో ఈ చిత్రంలో వర్మ అలా చూపించాడు. తనను డార్లింగ్ అని ఎందుకు అంటానో ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. చిన్నప్పుడు నేను ఇంగ్లిష్ సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఆ భాష తెలియక హావభావాలను బట్టి అర్థం చేసుకునేవాణ్ణి. ఇలాంటి సినిమాలు మన తెలుగులో వస్తే బాగుండు అనుకునేవాణ్ణి. ‘అనుక్షణం’ ఆ తరహా సినిమాయే’’ అని చెప్పారు.