జన్మలో బిపాసాతో సినిమా చేయను
బ్లాక్ బ్యూటీ అయినా కూడా బిపాసా బసు అంటే బాలీవుడ్లో బోలెడంత క్రేజ్ ఉంది. కానీ, శుక్రవారమే విడుదలైన 'హమ్షకల్స్' చిత్ర నిర్మాత వాషు భగ్నాని మాత్రం ఆమె పేరెత్తితే చాలు.. భగ్గుమంటున్నారు. ఇకమీదట పొరపాటున కూడా ఆమెతో సినిమా చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితేష్ దేశ్ముఖ్, సైఫ్ అలీఖాన్, రాం కపూర్, ఈషా గుప్తా, తమన్నా.. వీళ్లంతా కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా, బిపాసా అంటే మాత్రం ఆ నిర్మాత మండిపడుతున్నారు.
తాను ఇలాంటి మాట చెప్పి ఉండకూడదు గానీ, వీలైనంత వరకు ఆమెతో సినిమా చేయకుండానే ఉంటానన్నారు. సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషన్ ఈవెంట్కు కూడా బిపాసా వెళ్లలేదు. మిల్కీబ్యూటీ తమన్నా పక్కన తాను అంత అందంగా కనపడనని అనుకుందో ఏమో గానీ, మొత్తానికి బిప్స్ డుమ్మా కొట్టింది. ఇదే నిర్మాత గారి ఆగ్రహానికి కారణం అయ్యిందని అంతా అంటున్నారు. చివరకు సినిమా కూడా తుస్సుమందన్న టాక్ మొదటిరోజే వినిపించింది. సినిమాలో తన పాత్ర చిన్నదని ఆమె అంటున్నా.. సినిమా చూస్తే అలా ఎవరికీ అనిపించదని, తాను స్వయంగా ఆమెకు పారితోషికం కూడా ఇచ్చానని నిర్మాత అన్నారు.