సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనేనా?
సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనే అంటున్నారు. ఎవరలా అంటున్నది? ఏమాకథ? అలాగైతే విశ్వనాయకుడు, ఇళయదళపతి, అజిత్ లాంటి వారి పరిస్థితి ఏమిటి? అనేగా మీ ప్రశ్నలు. ఏదేమైనా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. తను ఈ స్థాయికి ఎదుగుతాడని ఆయనే ఊహించి ఉండకపోవచ్చు. రజనీమురుగన్ చిత్ర విజయం తరువాత శివకార్తికేయన్ రేంజే మారిపోయింది.
నిర్మాతలు ఎంత భారీ బడ్జెట్‌తోనైనా ఆయనతో చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. బయ్యర్లదీ అదే పరిస్థితి. శివకార్తికేయన్ చిత్రాలను భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.ప్రస్తుతం అంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం రెమో. శివకార్తికేయన్‌కు జంటగా ఆయన లక్కీ నాయకి కీర్తీసురేశ్ నటించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కూడా మెరవనున్నారు. సతీష్, దర్శకుడు కేఎస్.రవికుమార్, నటి శరణ్య, యోగిబాబు ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి నవదర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.
అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ చాయాగ్రహణం అందించిన రెమో చిత్రాన్ని 24 ఏఎం సంస్థ అధినేత ఆర్‌డీ.రాజా నిర్మించారు. ఈ చిత్రం ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా తొలిసారిగా జపాన్ లో విడుదల కానున్న శివకార్తికేయన్ చిత్రం ఇదే. విశేషం ఏమిటంటే రజనీకాంత్ మినహా ఏ ఇతర హీరోల చిత్రాలు జపాన్‌లోని యోకోయమ, టోక్యో ఏరియాల్లోనే ప్రదర్శింపబడతాయట. అలాంటిది శివకార్తికేయన్ రెమో రజనీకాంత్ చిత్రాలకు దీటుగా యోకోయమ, టోక్యో ఏరియాలతో పాటు నగోయా ఏరియాలోనూ ప్రదర్శింపబడనుందట. రెమో చిత్ర జపాన్ విడుదల హక్కులను మెడ్రాస్ మూవీస్ సంస్థ పొందిందట.