
75 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా : రానా
♦ బాక్సర్‌నే అయినా క్రికెట్ అంటే ఇష్టం
♦ రీమేక్ అంతగా ఇష్టపడను
♦ విశాఖ నా రెండో హోమ్‌సిటీ
♦ ‘సాక్షి’తో హీరో దగ్గుబాటి రానా
విశాఖ పట్నం: లీడర్‌గా కెరీర్‌లో క్రేజీహిట్‌ను చేజిక్కించుకున్నాడు.. భల్లాలదేవుడిగా బాహుబలిలో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు ‘నీలిసంద్రంలో ఇండియా–పాకిస్తాన్ మధ్య జరిగిన నిశ్శబ్ద భీకర యుద్ధాన్ని నడిపించే కెప్టెన్ అర్జున్‌గా ఘాజీ చిత్రం ద్వారా సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు దగ్గుబాటి చిన్నోడు రానా. విశాఖ నా రెండో హోమ్‌సిటీ అంటున్న ఈ హీరో కొత్తవారికి పరిశ్రమలో అవకాశాలు కల్పించేందుకు సొంతంగా బ్యానర్‌ను ఏర్పాటు చేస్తానంటున్నారు. స్వతహాగా బాక్సర్ అయినా ఖాళీ దొరికితే క్రికెట్ ఆడేస్తాననంటున్న రానా ‘సినిమాయే నా ప్రాణం’ అంటూ సాక్షితో కాసేపు ముచ్చటించారు.
75 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా
హీరో కాకముందు ఏడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. సుమారు 75 చిత్రాలకు పని చేశాను. ఈ అనుభవంతో చిత్ర నిర్మాణ రంగంలోకి వస్తున్నాను.
బ్లూఫిష్ పేరిట కథ
ఆస్ట్రేలియాలో సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో తన అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై సబ్‌మెరైన్ సెట్ వేశాడు. అది నిర్మాత రామ్మోహనరావు కంట్లో పడింది. ఏంటా అని ఆరా తీస్తే తాను బ్లూఫిష్ పేరిట షార్ట్‌ఫిల్మ్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు. కథ నచ్చడంతో అతని ఒప్పించి ఘాజీగా వెండితెరపై అద్భుతంగా చిత్రీకరించారు. ఈచిత్రానికి తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు.
చారిత్రాత్మక చిత్రాల్లో నటిస్తే ఆ థ్రిల్లే వేరు
చారిత్రక చిత్రాల్లో నటిస్తే ఆ థ్రిల్లే వేరు. బాహుబలిని అంచనాలకు మించి అద్భుతంగా తీసిన రాజమౌళి తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటాడు. ప్రస్తుతం 1945.. బ్రిటిష్ పాలనకాలం నాటి అంశంతో ఛాలెంజింగ్ కథ తయారీలో ఉన్నాం.
వెండి తెర గోల్డెన్ మూవీ– గుండమ్మ కథ
పాతచిత్రాల్లో గోల్డెన్ మూవీ గుండమ్మకథ. అలాంటి గొప్ప చిత్రాలను తీసిన మహానుభావులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అదే రంగంలో నేనుండటం నా అదృష్టం. అందుకే సినిమాలే నాకు ప్రాణం.
రిస్కీ ప్రాజెక్ట్‌లను భారీ బడ్జెట్‌తో తీస్తా
రిస్కీ ప్రాజెక్ట్›లను చేయాలన్నదే మా ఉద్దేశం. రీమేక్ చేయడానికి అంతగా ఇష్టపడను. అందుకే నేను, నాగచైతన్య కలిసి ఓ బ్యానర్ పెడుతున్నాం. ఆ బ్యానర్‌లో కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తాం. ఇప్పటి వరకు 16 కథలు విన్నాం.
మరో నాలుగు విభిన్న చిత్రాలు
ప్రస్తుతం నాలుగు విభిన్న కథా చిత్రాలలో నటించనున్నాను. వీటిలో తేజ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాతో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తొలిసారిగా ఓ చిత్రంలో నటిస్తున్నాను. బ్రిటిష్ పాలన కథాంశంతో ఒకటి, బాహుబలి–2 తో పాటు మరో చిత్రం చేయనున్నాను.
నయనతార ఇష్టం
బాలీవుడ్‌లో ఆలియాభట్ అంటే ఇష్టం. టాలీవుడ్‌లో మాత్రం నయనతార నటన నచ్చుతుంది. నయన ఎప్పటికప్పడు అప్‌డేట్ అవుతుంది. హిందీలో ఆర్యభట్ క్యూట్ బ్యూటీ.
ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడతా
వ్యక్తిగతంగా బాక్సర్‌ని. ఏమాత్రం ఖాళీ దొరికినా క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను. ఆ తరువాత సినిమాలు చూస్తాను.
హుద్‌హుద్ ఎదుర్కొన్న ధీరులు
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన విశాఖ. ఇంత త్వరగా కోలుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. అయితే ఇక్కడి వాసులు ధీరులు కావడంతో అనతికాలంలోనే ఆ చేదుగుర్తులు మరిచిపోయారు.
రాసిపెట్టినప్పడే పెళ్లి
నాగచైతన్యకు పెళ్లి అవుతుంది. మరి మీకెప్పడు అని అడిగిన ప్రశ్న మాత్రం చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. రాసిపెట్టినప్పడు తప్పకుండా పెళ్లి అవుతుంది. దానికోసం నేను ఆలోచించడంలేదు. మా ఇంట్లో మాత్రం సంబంధాలు చూస్తున్నారు.
విశాఖ తూర్పుతీరంలో 1971లో ఇండియా– పాకిస్తాన్‌ల మధ్య సాగరగర్భంలో జరిగిన నిశ్శబ్ద యుద్ధమే కథాంశంగా ఘాజీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 1971 నాటి విశాఖను కళ్లముందు ఉంచే ప్రయత్నం చేశాం. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.