Ghazi
-
టూరిజం డెస్టినీ.. పీఎన్ఎస్ ఘాజీ
విశాఖ మహా నగరాన్ని ఎన్నిసార్లు సందర్శించినా.. టూరిస్టులు మరోసారి వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా విభిన్న టూరిస్ట్ స్పాట్లు కనువిందు చేస్తున్నాయి. సువిశాల సాగరతీరం.. సబ్‌మెరైన్ మ్యూజియం, ఎదురుగా టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం.. కొత్తగా సిద్ధమవుతున్న సీ హారియర్.. ఇలా ఎన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఇప్పుడు కాస్త శ్రమిస్తే అదే జాబితాలో మరో బెస్ట్ స్పాట్ సిద్ధంగా ఉంది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో తూర్పు నావికాదళ ప్రధాన స్థావరమైన విశాఖను దెబ్బతీసేందుకు ప్రయత్నించి జలసమాధి అయిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. భిన్నమైన అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం అసలేం జరిగిందంటే.. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసి.. భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో జరిగిన అతిపెద్ద యుద్ధమిది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్) నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) విడిపోయి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. తూర్పు పాక్‌కు భారత్ మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్.. మన దేశంపై దాడులకు పాల్పడింది. భారత్, పాక్ బలగాలు తూర్పు, పశ్చిమ దిక్కుల్లో తలపడ్డాయి. పశ్చిమ ప్రాంతం వైపు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆపరేషన్ ట్రై డెంట్ పేరుతో భారత నావికా దళం కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో డిస్ట్రాయర్ పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ మహాఫిజ్ మునిగిపోగా, పీఎన్ఎస్ షాజహాన్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు.. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. పాకిస్తాన్ అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని పంపింది. విషయం తెలుసుకున్న భారత్ నావల్ కమాండ్.. ఐఎన్ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దించింది. రాజ్‌పుత్ రాకను పసిగట్టిన ఘాజీ కుయుక్తులతో రాజ్‌పుత్‌ను మట్టికరిపించేందుకు దాడికి పాల్పడ్డారు. అయితే, దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న రాజ్‌పుత్‌లోని నావికాదళం ఘాజీపై సర్వశక్తులూ ఒడ్డి ఘాజీని విశాఖ తీరంలోని సాగరగర్భంలో కుప్పకూల్చారు. బంగాళాఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఘాజీని సందర్శించేందుకు ఇలా తీసుకెళ్తారు.. సాగర గర్భంలోనే ఘాజీ.. విశాఖ తీరంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ధాటికి సైనికులతో సహా పీఎన్ఎస్ ఘాజీ జలసమాధి అయ్యింది. ఆ సమయంలో ఘాజీ నుంచి లభ్యమైన కొన్ని శకలాల్ని మాత్రమే విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం తీసుకొచ్చి భద్రపరచుకుంది. తర్వాత ఘాజీని అలాగే సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఘాజీని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేందుకు నేవీ, టూరిజం శాఖ సమాలోచనలు చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టీయూ–142 యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఘాజీ ప్రతిపాదన వచ్చింది. తర్వాత దీనిపై కదలిక లేదు. ఇటీవల మరోసారి ఘాజీ అంశం తెరపైకి వచ్చింది. పర్యాటకానికి కొత్త చిరునామా ఆర్కే బీచ్ నుంచి డాల్ఫిన్ నోస్ మధ్య ప్రాంతంలో 1.8 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర తీరంలో ఘాజీ జల సమాధి అయ్యింది. దాదాపు 30 మీటర్ల లోతులో ఘాజీ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీని వద్దకు వెళ్లి ఘాజీని నేరుగా చూసే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఘాజీ ఎక్కడ ఉందో అన్వేషించేందుకు గతంలో టూరిజం శాఖ నేవీని సంప్రదించింది. దీనిపై స్పందించిన నావికా దళం ఇందుకోసం ఓ కెప్టెన్ సహా ఇద్దరు నేవీ అధికారులు, మరో ఇద్దరు టూరిజం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖలో పలు అడ్వెంచర్, బీచ్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేసిన నగరానికి చెందిన ఓ సంస్థను ఈ కన్సల్టెన్సీ కోసం పర్యాటక శాఖని సంప్రదించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని టూరిజం వర్గాల సమాచారం. స్పెషల్ సర్టిఫికెట్ ఉండేలా.. పీఎన్ఎస్ ఘాజీని ఓపెన్ టూరిస్ట్ స్పాట్‌గా చేయబోతున్న తరుణంలో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, తీరం నుంచి కొంత దూరం వెళ్లాక అక్కడి నుంచి 30 మీటర్ల లోతుకి వెళ్లాలంటే సాహసంతో పాటు ధైర్యం ఉండాలి. ముందుగా దీన్ని చూసేందుకు సర్టిఫైడ్ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) సంస్థ అం దించే అడ్వాన్స్డ్ ఓపెన్ ఆర్డర్ డైవర్ సర్టిఫి కెట్ పొందే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వా లని భావిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ కు ఈ అంశంపై మరోసారి లేఖ రాసినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తే.. విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. -
సంకల్ప్.. ఈ సారి నేలమీదే, కానీ..!
రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఘాజీ. తొలి అండర్‌వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఘాజీ తరువాత రెండో ప్రయత్నంగా మరో ప్రయోగం చేశాడు సంకల్ప్. వరుణ్ తేజ్ హీరోగా స్పేస్‌బ్యాక్ డ్రాప్లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సంకల్ప్ తన మూడో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాను సముద్రంలో, రెండో సినిమాను అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించిన సంకల్ప్ మూడో సినిమాను మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
వరుణ్, అదితి ఫొటో షూట్ డైరీస్
-
అంతరిక్షంలో వరుణ్, అదితి..!
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. స్పేస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌తో కలిసి దిగిన ఫొటోను షూట్ డైరీస్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు అదితి. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి హాలీవుడ్ మూవీ జీరో గ్రావిటీ ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
మరో వార్ డ్రామాలో రానా..?
ఈ జనరేషన్ హీరోల్లో పీరియాడిక్, హిస్టారికల్ పాత్రలకు తగ్గ నటుడంటే ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించిన రానా.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో కూడా ఆ తరహా పాత్రల్లోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా.. 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా సైనికుడిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మరో మూవీ హాథీ మేరి సాథీలోనూ నటిస్తున్నాడు రానా. తరువాత ట్రావెన్కోర్ రాజు మార్తండ వర్మ కథతో అదే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో వార్ డ్రామాకు రానా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా ఘనవిజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ఈ సినిమా భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనుందట. అయితే ఈ వార్తలపై హీరో రానా, దర్శకుడు తేజ ఇంతవరకు స్పందించలేదు. -
అంతరిక్ష యాత్ర మొదలైంది
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హ్యాట్రిక్ సక్సెస్ కు రెడీ అవుతున్నాడు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సాధించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఘాజీ సినిమాతో ఆకట్టుకున్న సంకల్ప్.. వరుణ్ తేజ్‌ను వ్యోమగామిగా చూపించనున్నాడట. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) ప్రారంభించారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఘాజీ తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ హ్యాట్రిక్ సక్సెస్ మీద కన్నేశాడు. -
తాప్సీ స్పెషల్‌గా ఫీలవుతోంది
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 65వ జాతీయ చలనచిత్ర అవార్డులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా దగ్గుబాటి రానా నటించిన ‘ఘాజీ’ చిత్రం ఎంపికైంది. 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. తాను నటించిన ఘాజీ మూవీకి అవార్డు రావడంపై హీరోయిన్ తాప్సీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఘాజీ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు నేను నటించిన మూడు చిత్రాలకు(ఆడుకాలం, పింక్, ఘాజీ) జాతీయ అవార్డులు రావడం సంతోషం కలిగిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఘాజీలో చేసింది ప్రత్యేక పాత్రే అయినా.. వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిన పాత్ర అని తాప్సీ అన్నారు. -
వరుణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా..!
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్పేస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే మెయిన్ హీరోయిన్గా చెలియా ఫేం అదితిరావ్ హైదరీని ఫైనల్ చేశారు చిత్రయూనిట్. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు మోడల్ కావ్య తాపర్ ను ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఘాజీ తరహాలోనే ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనన్ని తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ లో ప్రారంభం కానున్న ఈసినిమాతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు వరుణ్ తేజ్. -
వరుణ్ సినిమాకు ఆసక్తికర టైటిల్
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్, తన తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టాడు. ఇటీవల ప్రయోగాలను పక్కన పెట్టి విజయాలు సాధించిన ఈ మెగా హీరో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారతీయ సినీచరిత్రలో తొలి అండర్ వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఘాజీ. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించనున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్రహాంతరవాసుల ప్రస్థావన కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా తన కెరీర్లోనే స్పెషల్ మూవీగా పేరు తెచ్చుకుంటుందన్న నమ్మకంగా ఉన్నాడు వరుణ్. త్వరలోనే చిత్రయూనిట్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
బాహుబలిని ఢీకొట్టిన విక్రంవేదా.. దుమ్మురేపిన అర్జున్‌రెడ్డి, ఘాజీ!
2017లో విడుదలైన టాప్ -10 భారతీయ సినిమాల జాబితాను ప్రముఖ సినిమా సమాచార వెబ్సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాహుబలి-2ను అధిగమించి తమిళ క్రైమ్ థిల్లర్ మూవీ 'విక్రమ్ వేదా' టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్-10 ఇండియన్ సినిమాల్లో మొదటిస్థానంలో విక్రమ్ వేదా ఉండగా.. రెండో స్థానంలో రాజమౌళి వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి-2', కొత్త దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ 'అర్జున్‌రెడ్డి' మూడోస్థానంలో ఉన్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డి రూపొందించిన 'ద ఘాజీ అటాక్' సినిమా ఆరోస్థానంలో నిలిచింది. ఐఎండీబీ యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూల ఆధారంగా ఈ టాప్-10 జాబితాను ప్రకటించింది. ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలే ఈ జాబితాలో ఉండటం విశేషం. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కి కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన 'విక్రమ్ వేదా' తొలిస్థానంలో నిలువగా, రాజమౌళి 'బాహుబలి-2' రెండోస్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాధించిన విజయం, కలెక్షన్ల ముందు 'విక్రమ్ వేదా' విజయం చిన్నదేనని చెప్పాలి. ఇక తెలుగు ట్రెండ్‌సెట్టర్, విజయ్ దేవరకొండను సూపర్‌స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' ఈ జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొంది. నాలుగోస్థానంలో ఆమిర్ఖార్ తెరకెక్కించి అతిథి పాత్ర పోషించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖామర్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్"హిందీ మీడియం' ఐదోస్థానాన్ని దక్కించుకుంది. రాణా హీరోగా మూడు (హిందీ, తమిళం, తెలుగు) భాషల్లో విడుదలైన ఘాజీ సినిమా ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలువగా.. ఇక, ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు 'జాలీ ఎల్ఎల్బీ- 2', టాయ్‌లెట్ ఏక్ ప్రేమకథ.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక అంశాలు నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన 'టాయ్‌లెట్' ఏడో స్థానంలో నిలువగా.. కోర్టుడ్రామాగా తెరకెక్కిన జాలీ ఎల్ఎల్బీ-2 సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ భారీ బడ్జెట్ చిత్రం 'మెర్సల్' ఎనిమిదో స్థానంలో నిలువగా.. మమ్మూటీ, స్నేహ జంటగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గ్రేట్ ఫాదర్ ఈ జాబితాలో పదోస్థానంలో నిలిచింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది. -
వరుణ్ సంకల్పం
ఘాజీతో తొలిసారి ‘వార్ ఎట్ సీ ఫిలిం’ అంటూ తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ రెడ్డి మరోసారి ఆడియన్స్‌ను అబ్బురపరచటానికి సిద్ధమయ్యారు. సంకల్ప్ తదుపరి చిత్రం వరుణ్ తేజ్‌తో అని తెలిసిన విషయమే. ఈ విషయమై సంకల్ప్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘ఇది సైన్స్ ఫిక్షన్‌కు సంబంధించిన కథాంశం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘ఘాజీ ’లాగే ఈ సినిమాలో కూడా ఎక్కువ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ ఉంటుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న ‘తొలి ప్రేమ’ రిలీజ్ తర్వాత మార్చ్ లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం’’ అని కొన్ని వివరాలు చెప్పారు. ‘ఘాజీ’తో నీళ్ళ లోపలికి తీసుకువెళ్లిన సంకల్ప్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకాశ వీధుల్లో విహారానికి తీసుకెళ్తారనమాట. ‘ఘాజీ’ని నిర్మించిన పీవీపీ బ్యానర్ ఈ సినిమాను నిర్మించొచ్చట. ఇందులో వరుణ్ వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా కనిపిస్తారట. అవునా.. అంటే ‘అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్’ అన్నారు సంకల్ప్ రెడ్డి. -
ఘాజీ దర్శకుడి మరో పరిశోధన
ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో మునిగిపోయిన ఓ జలాంతర్గామి కథతో ఘాజీ సినిమాను తెరకెక్కించాడు సంకల్ప్. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకుంది. ఘాజీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంకల్ప్ తన తదుపరి చిత్రం విషయంలో కూడా ప్రయోగానికే సిద్ధమవుతున్నాడు. ఘాజీ కథ కోసం ఎంతో పరిశోదన చేసిన సంకల్ప్, త్వరలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. అయితే గతంలో వచ్చిన బోస్ సినిమాల మాదిరిగా కాకుండా ఆయన జీవితంలో వెలుగులోకి రాని ఎన్నో సంఘటనలపై సుధీర్ఘ పరిశోధన చేసి ఈ కథను తయారుచేస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నేతాజీకి సంబంధించి సరికొత్త కోణం ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఘాజీ డైరెక్టర్ తో మెగా హీరో
తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఘాజీ తరువాత విరామం తీసుకున్న సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి, తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే వరుణ్, సంకల్ప్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. తన తొలి చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకే రెండో సినిమా చేసేందుకు సంకల్ప్ ఆసక్తికనబరుస్తున్నారు. పీవీపీ సంస్థ ఓకె చెపితే త్వరలోనే సంకల్ప్, వరుణ్ తేజ్ ల సినిమాలపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. -
ఘాజీ డైరెక్టర్‌తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..!
తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి, తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల మిస్టర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ ప్రస్తతుం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఇవి పూర్తయిన తరువాత సంకల్ప రెడ్డి తెరకెక్కించే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..?
తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. ఇంతటి ఘనవిజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా కూడా ఘాజీ తరహాలో ప్రయోగాత్మకంగానే ఉండబోతుందని తెలుస్తోంది. మిస్టర్ ఫెయిల్యూర్‌తో డైలామాలో పడ్డ వరుణ్‌కు ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా పూర్తయిన తరువాత సంకల్ప్ రెడ్డితో చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఇప్పటికి పదివేల మంది ఈ ప్రశ్న అడిగారు!
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ – కొందరు సినిమా స్టార్స్ తరచూ చెప్పే డైలాగ్ ఇది. కానీ, భరత్‌రెడ్డికి ఈ డైలాగ్ అవసరం లేదు. ఎందుకంటే... ఈయన డాక్టర్ కమ్ యాక్టర్. కార్డియాలజిస్ట్‌గా ప్రజల్లో ఎంత మంచి పేరుందో... నటుడిగా ప్రేక్షకుల్లో అంతే మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన ‘ఘాజీ’లో భరత్ చేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ‘డాక్టర్ అండ్ యాక్టర్‌గా చేస్తున్నారు. రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?’ – నన్ను ఎవరు కలిసినా మొదట అడిగే ప్రశ్న ఇదే. సుమారు ఓ పదివేల మందికి పైగా ఈ ప్రశ్న అడిగారు. డాక్టర్, యాక్టర్.. రెండూ విభిన్నమైన ప్రొఫెషన్స్. రెండిటినీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మా అమ్మగారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వర్రీ అయ్యారు. నాన్నగారు ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ‘సినిమాల్లోకి వెళుతున్నాడు. వీడి లైఫ్ ఏమౌతుంది? కార్డియాలజీ ప్రాక్టీస్ ఏమౌతుంది?’ అని అమ్మ భయపడ్డారు. పదేళ్లుగా రెండు ప్రొఫెషన్లనూ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నా. మంచి సినిమాల్లో నటించడంతో పాటు డాక్టర్‌గా ప్రజలకు మంచి చేయాలనే ఆశయమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ∙నటుడిగా ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ‘సిద్ధం’, ‘ఈనాడు’, ‘గగనం’, ‘ఘాజీ’ వంటి పలు స్ఫూర్తివంతమైన సినిమాల్లో నటించాను. నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. చరిత్రలో నిలిచే ఇలాంటి సినిమాలు చేయాలని కోరిక. గతేడాది ‘భయం ఒరు పయనం’ అనే తమిళ సినిమాలో హీరోగా చేశా. అది ‘భయమే ఒక ప్రయాణం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఛాన్స్ వస్తే హీరోగా చేయడానికి రెడీ. అలాగే, మంచి పాత్రలు వస్తే ‘ఘాజీ’ వంటివీ చేస్తా. ‘ఘాజీ’లో పాత్ర నటుడిగా ఓ ఛాలెంజ్. సినిమాలో లైవ్ ఫైర్‌తో ఓ సీన్ చేశాను. అందులో గ్రాఫిక్స్ ఏం లేవు. సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే... నా కనుబొమలు, జుత్తు కాలిపోయి ఉన్నాయి. షాకయ్యా. లక్కీగా స్కిన్‌కి ఏం కాలేదు. జుత్తు కాలినా తిరిగి పెరుగుతుంది. డాక్టర్‌ను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. ∙జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్ ముఖ్య తారలుగా దర్శకుడు బాల తీస్తోన్న ‘నాచియార్’లో కీలక పాత్ర చేస్తున్నా. బాలాగారి సినిమాలు నటీనటులకు ఎంత పేరు తెస్తాయో తెలిసిందే. అందుకే రెమ్యునరేషన్ గురించి అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశాను. ఓ కమర్షియల్ తెలుగు సినిమాలో మంచి అమౌంట్ ఆఫర్ చేసినా... రొటీన్ క్యారెక్టర్, అదీ చిన్నది కావడంతో అంగీకరించ లేదు. నాకు మనీ ముఖ్యం కాదు, ఆర్టిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా. -
రానాతో జతకట్టనున్న రెజీనా
యువ నటుడు రానాతో జత కట్టేందుకు నటి రెజీనా రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. టాలీవుడ్ టాలెస్ట్ నటుడు రానా. ఈయన ఒక్క తెలుగు చిత్రసీమకే పరిమితం కాకుండా హిందీ, తమిళం అంటూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. కాగా రానా తమిళంలో ఆరంభం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తరువాత బెంగళూర్ నాట్కల్, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాహుబలి–2తో పాటు ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మరో ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు కళగు అనే వైవిధ్య భరిత కథాంశంతో విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడైతిరంద అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగే చారిత్రక కథాంశంతో రూపొందనుందట. చిత్ర కథ నచ్చడంతో రానా ఇందులో నటించడానికి అంగీరించారు. ఈ విషయాన్ని ఇటీవల రానానే స్వయంగా చెన్నైలో ఘాజీ చిత్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ పిరియడ్ కథా చిత్రంలో రానాకు జంటగా నటి రెజీనా నటించనున్నారని సమాచారం. ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుందన్నది గమనార్హం. -
ఘాజీ వంటి సినిమాలు రావాలి
‘‘యువతలో స్ఫూర్తి నింపే చిత్రం ఇది. దేశంలో ఐకమత్యాన్ని పెంచి, శాంతిపథంలో పయనించేలా చేయ డంలో ‘ఘాజీ’ వంటి చిత్రాలు దోహదపడతాయి. ఇలాంటి చిత్రాలు రావాలి’’ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, కేకే మీనన్ ముఖ్య తారలుగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘ఘాజీ’ని ఆదివారం వెంకయ్య నాయుడు చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘హింస, చౌకబారు విషయాలు లేకుండా సంకల్ప్ రెడ్డి చిత్రాన్ని బాగా తీశారు. కమర్షియల్ హంగులు, రంగులు లేక పోయినా.. మెండుగా దేశభక్తిని కలిగించే చిత్రమిది. రానా చక్కటి నటన ప్రదర్శించారు. ఈ సాహసో పేతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ఇలాంటి దేశభక్తి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం సముచితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న విషయాన్ని ఆయన ముందుంచితే.. ‘‘వినోదపు పన్ను అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. పీవీపీ ఓ భారతీయ పౌరుడిగా బాధ్యతతో సినిమా తీశా రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ‘ఘాజీ’ హిందీ వెర్షన్ చూపించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. చిత్రనిర్మాత పీవీపీ పాల్గొన్నారు. -
యువత చూసి గర్వపడాల్సిన చిత్రం 'ఘాజీ'
పీవీపీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'ఘాజీ' చిత్రం విడుదలైనప్పట్నుంచి విమర్శకుల ప్రశంసలతోపాటు.. ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకుంటూ విజయ పధంలో నడుస్తోంది. రానా, తాప్సీ, కేకే.మీనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సంకల్ప్ అత్యద్భుతంగా తెరకెకెక్కించిన విధానాన్ని చూసినవారందరూ అభినందనలతో చిత్ర బృందాన్ని ముంచెత్తుతున్నారు. "ఘాజీ" చిత్ర స్పెషల్ షో చూసిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు యూనిట్ సభ్యులను అభినందించారు. 'నేటితరం యువతకు ఘాజీ చిత్రం దేశభక్తిని సరికొత్త రూపంలో పరిచయం చేసింది. 1971లో జరిగిన ఇండోపాకిస్తాన్ యుద్ధం గురించి చాలా మందికి తెలియని నిజాల్ని తెలియజెప్పిన చిత్రమిది. ప్రజలు తెలుసుకొని గర్వపడాల్సిన చరిత్ర ఇది. కథానాయకుడు రానా మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన నటనతో సన్నివేశాలను పండించారు. జాతి సమగ్రతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. సబ్ మెరైన్ గురించి కానీ సబ్ మెరైన్ ఎలా పనిచేస్తుంది వంటి విషయాలను ఆకట్టుకొనే విధంగా చూపించిన దర్శకుడు సంకల్ప్‌ను మెచ్చుకొని తీరాలి. ముఖ్యంగా యుద్ధం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హింసాత్మకమైన సన్నివేశాలు ఏవీ లేకుండా ఘాజీ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రశంసనీయం. అవార్డులు, రివార్డులు ఆశించకుండా ఒక మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతలకు అభినందనలు' తెలిపారు. -
అభిమాని పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్
టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన బ్యూటి తాప్సీ. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. బాలీవుడ్లో మాత్రం సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ. తాజాగా మల్టీ లింగ్యువల్ సినిమాగా తెరకెక్కిన ఘాజీతో మరోసారి ఆకట్టుకున్న తాప్సీ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాప్సీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తనతో మెయిల్స్ ద్వారా టచ్‌లో ఉన్న ఓ అభిమాని పెళ్లి వేడుకకు తాప్సీ హాజరుకానుందట. వచ్చే నెల సికింద్రాబాద్‌లో జరుగనున్న ఈ వేడుక కోసం తాప్సీ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చేందుకు రెడీ అవుతోంది. తాప్సీ ఫ్యాన్స్ క్లబ్లో భాగమైన ఆ అభిమాని ఎవరన్న విషయం మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. -
గుంటూరోడుకి చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాట సాయం చేశారు. రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రానికి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రానికి మెగాస్టార్ తన మాట ఇచ్చారు. ‘చిత్ర కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవిగారు తనదైన మాస్ స్టయిల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు’ అని దర్శకుడు తెలిపారు. ‘చిరంజీవిగారు మా చిత్రానికి మాట సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని మనోజ్ అన్నారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైశ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3న విడుదలవుతోంది. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వీ, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రభు తేజ. -
దూసుకుపోతున్న ’ఘాజీ’.. వసూళ్లెంతో తెలుసా?
రానా, తాప్సీ ప్రధానపాత్రలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన వార్‌డ్రామా ’ఘాజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. తెలుగులోనూ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందని చెప్తుండటంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ’ఘాజీ’ తొలి రెండురోజుల్లో రూ. 9.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 4.25 కోట్లు సాధించిన ఈ సినిమా శనివారం మరింత మెరుగైన వసూళ్లు రాబట్టింది. ’ఘాజీ’కి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఆదివారం కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండే అవకాశముందని సినీ పండితులు భావిస్తున్నారు. ’ఘాజీ ద అటాక్’ సినిమా తొలి రెండురోజుల్లో మొత్తం అన్ని వెర్షన్లలో కలుపుకొని రూ. 9.50 కోట్లు వసూలు చేసిందని, హిందీ వెర్షన్లో ఈ సినిమాకు రూ. 3.90 కోట్లు కలెక్ట్ చేసిందని సినీ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుండటంతో మున్ముందు వసూళ్లుపెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా'
c. రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా, తొలి భారతీయ అండర్ వాటర్ వార్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకున్న ఘాజీ.. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మధీ ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఘాజీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ మధీ, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఘాజీ మేకింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు అన్న అంశాలతో పాటు.. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మధీకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే అప్పటికే ఘాజీ సినిమాకు కమిట్ అవ్వటంతో దాదాపు 50 చిత్రాలకు నో చెప్పాడట. ఆవారా, మిర్చి, రన్ రాజా రన్, శ్రీమంతుడు, ఘాజీ లాంటి వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న మధీ, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భాగమతితో పాటు ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. -
నాన్నగారి కలలు నెరవేరుస్తా
‘‘నాన్నగారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే రెండేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఈ రెండేళ్లల్లో నాన్నగారిని తలచుకోని రోజు లేదు. ఇంట్లో, ఆఫీసులో, స్నేహితులతో, చుట్టాలతో నాన్న గురించి మాట్లాడని రోజు లేదు. ఆయనెప్పుడూ మా మనసుల్లోనే ఉన్నారు’’ అని ప్రముఖ నిర్మాత, స్వర్గీయ డి. రామానాయుడి పెద్ద కుమారుడు డి. సురేశ్‌బాబు అన్నారు. నేడు రామానాయుడుగారి ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు ‘సాక్షి’ సినిమాతో మాట్లాడారు. ‘‘నాన్నగారు చాలా మంచి మనిషి. జీవితంలో ఆయనకు ఒక్క శత్రువు కూడా లేరు. అందరూ స్నేహితులే. ప్రతి ఒక్కరితో బాగుండేవారు. ఒకవేళ ఎవరితోనైనా ఏదైనా ఉంటే... ‘ఫర్గివ్ అండ్ ఫర్గెట్’ అనేది ఆయన పాలసీ. ‘నేను వెళ్లిన తర్వాత నా గురించి తెలుస్తుంది రా’ అని అనేవారు. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు అచ్చంగా అలానే ఉందని చెప్పాలి. మంచి విషయం ఏంటంటే... గతేడాది నాన్నగారి జ్ఞాపకంగా మా రామానాయుడు స్టూడియోలో మెమోరియల్ నిర్మించాం. ఈ ఏడాది ఆ మెమోరియల్‌కి ఇండియాలో స్టోన్ ఆర్కిటెక్చర్ విభాగంలో స్పెషల్ అవార్డు వచ్చింది. మరణించిన తర్వాత కూడా నాన్నకు అవార్డులు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ఈ ఏడాది నాన్నగారి జయంతి (జూన్ 6) లోపు మా మెదక్‌లో ‘డాక్టర్ డి. రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘ఆల్రెడీ ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. రాగానే కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తాం’’ అన్నారు. సినిమాల విషయానికి వస్తే... ‘రాముడు–భీముడు’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాలనేది నాయుడి గారి కల. అలాగే, మీ ఫ్యామిలీ హీరోలు వెంకటేశ్, నాగచైతన్య, రానాలతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆయన కలలను నిజం చేస్తారా? అని సురేశ్‌బాబును అడిగితే... ‘‘తప్పకుండా. సరైన సమయంలో వెంకటేశ్– చైతు–రానా సినిమా ప్రకటిస్తాం. త్వరలో ‘రాముడు– భీముడు’ని రంగుల్లోకి మార్చే ప్రక్రియ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘రానా దగ్గర నాన్నగారు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు – ‘త్వరలో చేసుకుంటా తాతా’ అనేవాడు. ‘ఘాజీ’ సినిమా ఆయన చూస్తే మనవణ్ణి చూసి గర్వపడేవారు’’ అన్నారు. -
'ఘాజీ' మూవీ రివ్యూ
టైటిల్ : ఘాజీ జానర్ : సబ్ మెరైన్ వార్ డ్రామా తారాగణం : రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ సంగీతం : కె. కృష్ణ కుమార్ దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి నిర్మాత : అన్వేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, ప్రసాద్ వి పొట్లూరి భారతీయ సినిమాల్లో వార్ డ్రామాలు చాలా తక్కువ. ముఖ్యంగా స్వతంత్ర పోరాట నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కినా.. పూర్తి స్థాయి వార్ డ్రామాగా సినిమాలు రాలేదు. ఆ లోటును తీరుస్తూ.. చరిత్ర కథల్లో పెద్దగా ప్రాచుర్యం పొందని ఓ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు ఘాజీ టీం. 1971లో భారత్ పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ.. కథ : 1971... పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఒకే దేశంగా తూర్పు, పశ్చిమ పాకిస్థాన్‌లు గా ఉన్న రోజులు. పశ్చిమ పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం తూర్పు పాక్‌లో గొడవలు జరుగుతున్న రోజులు. ఆ సమయంలో వేలాదిగా శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారత దేశ సరిహద్దుకు చేరుకుంటుండటంతో వారికి భారత్ సహాయం చేస్తుందని పాకిస్థాన్ ఆర్మీ భావిస్తుంది. తూర్పు పాకిస్థాన్‌లో పరిస్థితులను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి భారత్ మీద పగ తీర్చుకోవడానికి పాక్ ఆర్మీ పథకం వేస్తుంది. భారత నావీ అమ్ములపోదిలోని బ్రహ్మాస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఎటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అది సాధ్యం కాని సమయంలో భారత్ లోని ఏదైన ఓడరేవు మీద ఎటాక్ చేసి భారత నావీ దృష్టి మళ్లించాలని నిర్ణయించుకుంటుంది. పాక్ నావీ పన్నాగాలను ముందే పసిగట్టిన భారత నావికాదళ అధికారులు, భారత సముద్ర జలాల్లో గస్తీ కోసం ఎస్ 21 సబ్ మెరైన్ పంపాలని భావిస్తుంది. ఎస్ 21 కమాండెంట్ రణ్విజయ్ సింగ్ (కేకే మీనన్). శత్రువు దగ్గర్లో ఉన్నాడని తెలిస్తే చాలు అతనే వెళ్లి ఎటాక్ చేస్తాడు. ఇంత ఆవేశపరుడు కెప్టెన్‌గా ఉంటే అనవసరంగా యుద్ధం కొని తెచ్చుకోవటమే అని భావించిన నావల్ అధికారులు రణ్విజయ్ సింగ్‌కు తోడుగా లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా)ను పంపిస్తారు. ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ పిఎన్ఎస్ ఘాజీ సబ్ మెరైన్ను కమాండెంట్ రజాక్ సారధ్యంలో భారత జలాల్లోకి పంపిస్తుంది. పిఎన్ఎస్ ఘాజీ అత్యంత శక్తివంతమైన సబ్ మెరైన్, భారత జలాంతర్గాముల కన్నా ఎన్నో రెట్లు వేగంగా శక్తివంతంగా పనిచేసే సబ్ మెరైన్. ఇంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనటానికి రణ్ విజయ్ సింగ్ , అర్జున్ వర్మలు ఏం చేశారు. చివరకు ఎవరు గెలిచారు అన్నదే ఘాజీ కథ. విశ్లేషణ : చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని మన విజయగాథను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేసిన ఘాజీ టీం ఘన విజయం సాధించారు. సినిమా అంతా ఒక్క సబ్ మెరైన్‌లో సాగే కథతో ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించటం అంటే సాహసమే. అయితే కథా కథనాల మీద దర్శకరచయిత సంకల్ప్ రెడ్డికి ఉన్న పట్టు.. ఎక్కడా పట్టు సడలకుండా సినిమాను నడిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్న కారణంతో అనవసరంగా పాటలు, కామెడీ సీన్స్ ఇరికించకపోవటం కూడా సినిమా స్థాయిని మరింత పెంచింది. అదే సమయంలో సంకల్ప్ రెడ్డి ఈ కథకోసం ఎంత రిసెర్చ్ చేశాడో తెర మీద స్పష్టంగా కనిపించింది. సంఘటన నేపథ్యంతో పాటు అప్పటి పరిస్థితులు, పరిసరాలు, సబ్ మెరైన్ లోపలి వాతవరణం.. నావల్ ఆఫీసర్లు వాడే భాష లాంటి విషయాల్లో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాయి. ఆర్ట్, ఎడిటింగ్, రీ రికార్డింగ్‌లు దర్శకుడి ఆలోచన మరింత గొప్పగా తెరమీదకు వచ్చేందుకు హెల్ప్ అయ్యాయి. ప్రతీ నటుడు నిజంగా దేశం కోసం యుద్ధం చేస్తున్నామన్నంత ఆవేశంగా తెర మీద కనిపించారు. ముఖ్యంగా కేకే మీనన్ పాత్ర సినిమాకు మెయిన్ ఎసెట్. ఆవేశం, ఆలోచన ఉన్న కెప్టెన్‌గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటన అద్భుతం. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే సిన్సియర్ అధికారిగా అదే సమయంలో దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని యోధుడిగా కనిపించిన రానా సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాడు. ఇతర పాత్రల్లో అతుల్ కులకర్ణి, తాప్సీ, నాజర్, ఓం పురిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఘాజీ ప్రతీ భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన భారత నావికాదళ విజయ గాథ. ప్రతిఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
భారతీయ సిల్వర్ స్క్రీన్ చూడని చిత్రం ఘాజీ
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఎవరూ చూడని చిత్రంగా ఘాజీ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు రానా పేర్కొన్నారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవాగా జీవించి భళా అనిపించుకున్న బహుభాషా నటుడు రానా. టాలీవుడ్ నటుడే అయినా తమిళం, హిందీ భాషల్లోనూ బహుళ ప్రాచుర్యం పొంది మోస్ట్ వాంటెడ్ నటుడిగా ఎదుగుతున్న రానా తాజాగా కథానాయకుడిగా నటించిన మరో త్రిభాషా చిత్రం ఘాజీ. నటి తాప్సీ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ.సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్ మెంట్ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవ దర్శకుడు సంకల్ప్ వెండితెరపై ఆవిష్కరించిన భారీ ఎండ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం ఘాజీ. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చిన రానాతో సాక్షి భేటీ. ప్ర: ఘాజీ చిత్ర నేపథ్యం ఏమిటి? జ: ఇది 1971లో విశాఖపట్టణంలో జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య సముద్ర భాగంలో జరిగిన యాదార్థ యుద్ధం ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం. ప్ర: ఇంతకు ముందు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఘాజీ చిత్రానికీ డిఫరెంట్ ఏమిటి? జ: ఇంతకు ముందు ఇండియా–పాకిస్తాన్ ల మధ్య పోరు కథలతో భారతీయ చిత్రాలు చాలా తక్కువే వచ్చాయి. అయితే ఘాజీ చిత్రం నేవి నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఈ తరహా చిత్రాలను ఇప్పటి వరకూ భారతీయ వెండితెరపై చూసి ఉండరు. ప్ర: ఘాజీ చిత్రంలో మీరు నటించడానికి ప్రధాన కారణం? జ: ముందుగా కొత్త కాన్సెప్‌్టతో కూడిన కథా చిత్రాల్లో నటించడానికి నేను చాలా ఆసక్తి చూ పుతాను. ఆ విధంగా నేను సినిమా లవర్ని. ఘాజీ చి త్రం మనదేశంలో మన విశాఖపట్టణంలో 1971లో నాకు తెలియని చిన్నతనంలో విన్న యుద్ధం గురించిన కథ. ఘాజీ అనే సబ్‌మెరైన్ లో 71 రోజుల పాటు జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఇతివృత్తం కావడంతో సహజంగానే ఈ చిత్రంలో నటించాలనే కోరిక కలిగింది. ఇంకా చెప్పాలంటే బ్లూఫిష్ అనే కథ చదివి దీని రచయిత, దర్శకుడు అయిన సంకల్ప్‌ను వెతుక్కుంటూ వెళ్లి ఈ చిత్ర అవకాశాన్ని అందుకున్నాను. మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే అందుకు కారణం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల పోరు, త్యాగాలే. వారిని గౌరవించేలా ఈ ఘాజీ చిత్రం ఉంటుంది. ప్ర: ఘాజీ చిత్రంలో హైలెట్స్ గురించి? జ: చిత్ర కథే ఒక హైలెట్. చిత్రం 60 శాతం అండర్వాటర్లోనే జరుగుతుంది. అండర్‌వాటర్‌లో నటించడం చాలా రిస్క్‌తో కూడింది. సూర్యరశ్మి సోకదు. సాధారణ దుస్తులు ధరించలేం. అందుకు ప్రత్యేక దుస్తులు ధరించి నటించాం. చిత్రం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఇందులో నేను లెఫ్టినెంట్ ఆర్మీ అధికారిగా నటించాను. అతి ఫోర్స్ గానీ, అనవసర సంభాషణలు గానీ ఉండవు. కథ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఘాజీ చిత్రంలో నటించడం గర్వంగా భావిస్తున్నా. ప్ర: నటి తాప్సీ గురించి? జ: నటి తాప్సీది ఇందులో కీలక పాత్ర. తను ఇందులో బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఆమె నటనకు చాలా పేరు వస్తుంది. ప్ర: మీరు ఎక్కువ పిరియడ్ కథా చిత్రాల్లోనే నటించండానికి కారణం? ప్ర: కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏ చిత్రానికైనా కంటెంట్ ముఖ్యం. కథ నన్ను ఆకట్టుకుంటే ఏ తరహా చిత్రం అయినా చేయడానికి నేను రెడీ. సక్సెస్ అవుతుందనే చిత్రాలు చేయలేం. ఉదాహరణకు బాహుబలి చిత్రాన్ని విజయం సాధించాలన్న ఒక్క కారణంతోనే చేయలేదు. ఒక గొప్ప చిత్రం, వినూత్న ప్రయోగంతో చేయాలన్న లక్ష్యంతో ఆ చిత్రం చేశాం. అది భారతీయ సినిమా గర్వించే చిత్రంగా నిలిచింది. ప్ర: బాహుబలి–2 చిత్రం గురించి? జ: బాహుబలికి సంబంధించిన రెండు కథలు ముందుగానే సిద్ధం అయ్యాయి. బాహుబలి చిత్రం అద్భుత విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ ఇంకా ప్రముఖ సాంకేతిక నిపుణులతో మరింత బ్రహ్మాండంగా తెరెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ప్ర: మీ తాతగారు డి.రామానాయుడు ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో ఏదైనా రీమేక్‌లో నటించాలన్న కోరిక ఉందా? జ: కోరిక ఉన్నా వాటిని రీమేక్ చేయడం, అందులో నటించడం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే అవన్నీ గోల్డెన్ హిట్ చిత్రాలు. సరిగా చేయలేమేమోనన్న భయం. అందుకే అలాంటి సాహసం చేయలేను. ప్ర: తదుపరి చిత్రాలు? జ: ప్రస్తుతం తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. త్వరలో దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది 1945 నేపథ్యంలో సాగే పిరియడ్ కథా చిత్రమే. -
సోలోగా యుద్ధం చేయనున్న రానా
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. మరో బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 1971లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాజీలో కే కే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ఇతర చిత్ర నిర్మాతలు తమ సినిమాల రిలీజ్‌లను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 17న కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గుంటూరోడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న వార్తలు వినిపించాయి. అయితే ఘాజీకి భారీ హైప్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఆ రెండు చిత్రాలను వాయిదా వేశారట. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ల ఎనౌన్స్మెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. -
త్వరలో ఘాజీ..
ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలతో త్వరలో వెండితెరపైకి రానుంది ఘాజీ చిత్రం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నటి తాప్సీ, కేకే, మీనన్, నాజర్, అతుల్ కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటుడు ఓంపురి నటించిన చివరి చిత్రం ఇదేనన్నది గమనార్హం. మది ఛాయాగ్రహణ, కే సంగీతాన్ని, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ప్రసాద్ కళా దర్శకత్వాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సంకల్ప్ పరిచయం అవుతున్నారు. ఇది ఘాజీ అనే సబ్‌మెరైన్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతకు ముందెప్పుడు చూసి ఉండరని అన్నారు. జనవరి 11వ తేదీన విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ నెలలోనే ఘాజీ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. -
75 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా : రానా
♦ బాక్సర్‌నే అయినా క్రికెట్ అంటే ఇష్టం ♦ రీమేక్ అంతగా ఇష్టపడను ♦ విశాఖ నా రెండో హోమ్‌సిటీ ♦ ‘సాక్షి’తో హీరో దగ్గుబాటి రానా విశాఖ పట్నం: లీడర్‌గా కెరీర్లో క్రేజీహిట్ను చేజిక్కించుకున్నాడు.. భల్లాలదేవుడిగా బాహుబలిలో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు ‘నీలిసంద్రంలో ఇండియా–పాకిస్తాన్ మధ్య జరిగిన నిశ్శబ్ద భీకర యుద్ధాన్ని నడిపించే కెప్టెన్ అర్జున్‌గా ఘాజీ చిత్రం ద్వారా సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు దగ్గుబాటి చిన్నోడు రానా. విశాఖ నా రెండో హోమ్‌సిటీ అంటున్న ఈ హీరో కొత్తవారికి పరిశ్రమలో అవకాశాలు కల్పించేందుకు సొంతంగా బ్యానర్‌ను ఏర్పాటు చేస్తానంటున్నారు. స్వతహాగా బాక్సర్ అయినా ఖాళీ దొరికితే క్రికెట్ ఆడేస్తాననంటున్న రానా ‘సినిమాయే నా ప్రాణం’ అంటూ సాక్షితో కాసేపు ముచ్చటించారు. 75 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా హీరో కాకముందు ఏడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. సుమారు 75 చిత్రాలకు పని చేశాను. ఈ అనుభవంతో చిత్ర నిర్మాణ రంగంలోకి వస్తున్నాను. బ్లూఫిష్ పేరిట కథ ఆస్ట్రేలియాలో సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో తన అపార్ట్మెంట్ టెర్రస్‌పై సబ్‌మెరైన్ సెట్ వేశాడు. అది నిర్మాత రామ్మోహనరావు కంట్లో పడింది. ఏంటా అని ఆరా తీస్తే తాను బ్లూఫిష్ పేరిట షార్ట్‌ఫిల్మ్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు. కథ నచ్చడంతో అతని ఒప్పించి ఘాజీగా వెండితెరపై అద్భుతంగా చిత్రీకరించారు. ఈచిత్రానికి తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. చారిత్రాత్మక చిత్రాల్లో నటిస్తే ఆ థ్రిల్లే వేరు చారిత్రక చిత్రాల్లో నటిస్తే ఆ థ్రిల్లే వేరు. బాహుబలిని అంచనాలకు మించి అద్భుతంగా తీసిన రాజమౌళి తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటాడు. ప్రస్తుతం 1945.. బ్రిటిష్ పాలనకాలం నాటి అంశంతో ఛాలెంజింగ్ కథ తయారీలో ఉన్నాం. వెండి తెర గోల్డెన్ మూవీ– గుండమ్మ కథ పాతచిత్రాల్లో గోల్డెన్ మూవీ గుండమ్మకథ. అలాంటి గొప్ప చిత్రాలను తీసిన మహానుభావులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అదే రంగంలో నేనుండటం నా అదృష్టం. అందుకే సినిమాలే నాకు ప్రాణం. రిస్కీ ప్రాజెక్ట్‌లను భారీ బడ్జెట్‌తో తీస్తా రిస్కీ ప్రాజెక్ట్›లను చేయాలన్నదే మా ఉద్దేశం. రీమేక్ చేయడానికి అంతగా ఇష్టపడను. అందుకే నేను, నాగచైతన్య కలిసి ఓ బ్యానర్ పెడుతున్నాం. ఆ బ్యానర్లో కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తాం. ఇప్పటి వరకు 16 కథలు విన్నాం. మరో నాలుగు విభిన్న చిత్రాలు ప్రస్తుతం నాలుగు విభిన్న కథా చిత్రాలలో నటించనున్నాను. వీటిలో తేజ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాతో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తొలిసారిగా ఓ చిత్రంలో నటిస్తున్నాను. బ్రిటిష్ పాలన కథాంశంతో ఒకటి, బాహుబలి–2 తో పాటు మరో చిత్రం చేయనున్నాను. నయనతార ఇష్టం బాలీవుడ్లో ఆలియాభట్ అంటే ఇష్టం. టాలీవుడ్లో మాత్రం నయనతార నటన నచ్చుతుంది. నయన ఎప్పటికప్పడు అప్డేట్ అవుతుంది. హిందీలో ఆర్యభట్ క్యూట్ బ్యూటీ. ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడతా వ్యక్తిగతంగా బాక్సర్‌ని. ఏమాత్రం ఖాళీ దొరికినా క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను. ఆ తరువాత సినిమాలు చూస్తాను. హుద్‌హుద్ ఎదుర్కొన్న ధీరులు ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన విశాఖ. ఇంత త్వరగా కోలుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. అయితే ఇక్కడి వాసులు ధీరులు కావడంతో అనతికాలంలోనే ఆ చేదుగుర్తులు మరిచిపోయారు. రాసిపెట్టినప్పడే పెళ్లి నాగచైతన్యకు పెళ్లి అవుతుంది. మరి మీకెప్పడు అని అడిగిన ప్రశ్న మాత్రం చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. రాసిపెట్టినప్పడు తప్పకుండా పెళ్లి అవుతుంది. దానికోసం నేను ఆలోచించడంలేదు. మా ఇంట్లో మాత్రం సంబంధాలు చూస్తున్నారు. విశాఖ తూర్పుతీరంలో 1971లో ఇండియా– పాకిస్తాన్ల మధ్య సాగరగర్భంలో జరిగిన నిశ్శబ్ద యుద్ధమే కథాంశంగా ఘాజీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 1971 నాటి విశాఖను కళ్లముందు ఉంచే ప్రయత్నం చేశాం. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. -
ఒక్క సినిమాకు ఐదు క్లైమాక్స్‌లు
యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రానాతో పాటు అతుల్ కులకర్ణి, కె కె మీనన్, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు సముద్ర జలాల్లో జరిగిన యుద్ధకథతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఘాజీనే కావటం విశేషం. కొత్త దర్శకుడు సంకల్ప రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌పై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ అనే సబ్ మెరైన్ అదృష్యమైంది. ఈ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఐదు రకాల క్లైమాక్స్‌లు రాశాడట. యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్ క్లైమాక్స్‌ను ఫైనల్ చేసి తెరకెక్కించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 17న రిలీజ్ కానుంది. -
సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి'
క్లీన్ 'యు' అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'ఘాజి'. 1970లో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు(గురువారం) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకొంది. -
తెలుగులో చిరు, తమిళ్లో సూర్య
యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ, భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని అదనపు ఆకర్షణలు జోడిస్తున్నారు. రానాతో పాటు కెకె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 1971లో జరిగిన భారత్ పాక యుద్ధంలో వైజాగ్ తీరంలో అదృశ్యమైన పాక్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యలు డబ్బింగ్ చెపుతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో కథను స్టార్ హీరోలు నారేట్ చేయనున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించగా.. తెలుగు వర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, తమిళ వర్షన్‌కు సూర్య గాత్రదానం చేసేందుకు అంగీకరించారు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహార్ ఘాజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రాంభించిన చిత్రయూనిట్ సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. -
నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా
‘‘32 ఏళ్ల నాకు 20 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్‌తో పరిచయం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను కానీ ఘాజీ కథ తెలియదు. విశాఖలో ఇంత గొప్ప కథ జరిగిందని చాలా మందికి తెలియదు. ఇలాంటి సినిమాలో నటించే ఛాన్స్ అరుదుగా వస్తుంది’’ అని హీరో రానా అన్నారు. రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ ముఖ్య తారలుగా సంకల్ప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమాస్ నిర్మించిన ‘ఘాజీ’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఏ సినిమా చేస్తున్నావని కొంతమంది స్నేహితులు, నిర్మాతలు నన్నడిగారు. సబ్‌మెరైన్ కథతో చిత్రం చేస్తున్నానని చెబితే నన్ను పిచ్చోడిలా చూసేవారు. కరణ్ జోహార్, టాన్‌డన్ మా సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. టీజర్ చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు’’ అని చెప్పారు. ‘‘నా ఐడియాను నమ్మి ఈ సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ‘ఘాజీ’ నా మొదటి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సంకల్ప్. ‘‘ఈ సినిమా నిర్మించడం గర్వంగా భావిస్తున్నా. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్ చేయని కథ ఇది’’ అని ప్రసాద్.వి.పొట్లూరి తెలిపారు. నిర్మాత జగన్మోహన్ వంచ, తాప్సీ తదితరులు పాల్గొన్నారు. -
దుమ్ము రేపుతున్న ఘాజీ
దేశభక్తిని నరనరాల్లో ఉప్పొంగించేలా చేసిన సినిమా.. ఘాజీ. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో వెండితెరను తాకనున్న విషయం తెలిసిందే. ఈలోపు విడుదలైన సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఆ ట్రైలర్‌ను దాదాపు 2 కోట్ల మందికి పైగా చూసినట్లు చిత్ర బృందం తెలిపింది. భారతీయ సినిమాల్లో మొట్టమొదటిసారిగా సముద్రంలో యుద్ధ సన్నివేశాలను ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరించిన ఈ సినిమా.. 1971 నాటి భారత్-పాక్ యుద్ధం ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే. భారతదేశానికి చెందిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ నుంచి ఘాజీ అనే జలాంతర్గామి వస్తుంది. దాన్ని ఎస్21 అనే భారత జలాంతర్గామిలో ఉన్న నౌకాదళం సిబ్బంది విజయవంతంగా ధ్వంసం చేస్తారు. ఈ సమయంలో భారత నౌకాదళ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. విశాఖపట్నం తీరంలో.. ఘటన జరిగినచోటే తీసిన ఈ సినిమాకు తూర్పు నౌకాదళానికి చెందిన సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించారు. రానా, తాప్సీ జంటగా నటించిన ఈ సినిమాలో కేకే మీనన్, ఓంపురి, అతుల్ కులకర్ణి తదితర దిగ్గజ నటులు ఉన్నారు. ఓంపురి నటించిన సినిమాల్లో చివరగా విడుదలవుతున్నది ఇదే కావడం మరో విశేషం. -
ఫిబ్రవరిలో సినిమా సందడి
సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కలకలలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్‌గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్‌తో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందిన లక్కున్నోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఆసక్తికరంగా తమ్ముడి మీద పోటికి బరిలో దిగుతోంది మంచు లక్ష్మి. లక్ష్మి లీడ్ రోల్లో తెరకెక్కిన లక్ష్మీబాంబ్ సినిమా కూడా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున మరోసారి భక్తాగ్రేసరుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు. అదే రోజు మంచు మనోజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గుంటూరోడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రానా నావీ కమాండర్‌గా నటిస్తున్న ఘాజీ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1971లో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో అదృశ్యమైన సబ్ మెరైన్ ఘాజీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే రోజు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెంపుడు కుక్కల దొంగగా కనిపించనున్నాడు. ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అయిన 24న కూడా సినిమా సందడి కొనసాగుతోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ కేశవను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు
బాలీవుడ్ తరహాలో టాలీవుడ్లో కూడా యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు పీరియాడిక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే ఇద్దరు యంగ్ హీరోలు ఒకేసారి ఒకే సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ హంక్ రానా, అల్లు వారబ్బాయి శిరీష్‌లు 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. ఘాజీ పేరుతో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వేజ్ సినిమాలో రానా హీరోగా నటిస్తుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో అల్లు శిరీష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నాడు. ఘాజీ విశాఖ తీరంలో సముద్ర గర్భంలో జరిగిన యుద్ధం కాగా.. 1971 మాత్రం సరిహద్దుల్లో జరిగిన యుద్ధాన్ని తెరమీద ఆవిష్కరిస్తున్నాయి. ఘాజీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ రిలీజ్‌కు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. -
'శత్రువుల ప్రాణాలు తీయడం దేశభక్తి'
హైదరాబాద్: 'దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేయడం కాదు.. శత్రువుల ప్రాణాలు తీయడం' అంటూ ఘాజీ చిత్రంలోని డైలాగ్ రోమాలు నిక్కపొడిచేలా ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా, తాప్సీ ప్రధాన నాయక నాయికలుగా నటించిన ఘాజీ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు దేశభక్తి నరాల్లో పొంగడంతోపాటు ఏ క్షణం ఏం జరగనుందా అనే ఉత్కంఠ రేపేలా ఈ ట్రైలర్ ఉంది. 1971లో విశాఖపట్నంలోని భారత ప్రముఖ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేసే లక్ష్యంతో పాకిస్థాన్‌కు చెందిన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ భారత జలాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ జలాంతర్గామి ద్వారా జరిగే దాడిని అడ్డుకునేందుకు భారత జలాంతర్గామి ఎస్-21 తీవ్రంగా ప్రయత్నించి పాక్ జలాంతర్గామిని ధ్వంసం చేసి సముద్రంలో ముంచివేస్తుంది. ఇదంతా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ నేపథ్యాన్ని కథగా తీసుకొని ఘాజీ పేరుతో హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో దగ్గుపాటి రానా భారత నావికా దళంలో పనిచేసే సైనికుడిగా ఉంటాడు. ఘాజీని ధ్వంసం చేసే ఆపరేషన్‌లో పాల్గొన్న భారత జలాంతర్గామిలోని ఆఫీసర్లలోని ఓ కీలక ఆఫీసర్ పాత్రలో రానా కనిపిస్తాడు. -
ఒకేసారి బాబాయ్, అబ్బాయ్
యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాజీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేసింది. సినిమా నేపథ్యంతో పాటు సముద్ర గర్భంలో నావీ టీం చేసే అద్భుత విన్యాసాలను ట్రైలర్లో చూపించారు. తెలుగుతో పాటు ఘాజీ హిందీ, తమిళ టీజర్లను కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. ఘాజీ టీజర్ తో పాటు సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న గురు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. గతంలో వెంకీ లుక్ ను మాత్రమే రివీల్ చేసిన యూనిట్, కొత్త టీజర్ లో వెంకీ క్యారెక్టరైజేషన్ ను చూపించారు. రఫ్ లుక్ లో బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తున్న వెంకీ అబ్బాయి రానాకి పోటీ ఇచ్చేలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
ఫిబ్రవరి 17న రానా ఘాజీ
టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టైటిల్ లోగో పాటు నావెల్ ఆఫీసర్‌గా రానా లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణిలు కనిపిస్తున్న ఈ పోస్టర్లో సబ్ మెరైన్ లోపలి దృశ్యాలను కూడా చూపించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న ఈ మ్యాన్లీ స్టార్ నటిస్తున్న బహు భాషా చిత్రం ఘాజీ. భారత్ పాక్ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు జోడించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. అదే వాయిస్‌ను తెలుగు వర్షన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించేందుకు అంగీకరించాడు. త్వరలోనే ఈ వాయిస్ ఓవర్లతో కూడిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
రానా...హూ ఈజ్ రాణి?
ఇంత ఫిజిక్ ఉన్నోడికి కెమిస్ట్రీ ఉండదా! ఉండకుండా ఎలా ఉంటుంది? మనం బయాలజీలో చదివాం కదా. బయాలజీతో బాడీ అర్థమైంది. బాటనీతో లవ్ అర్థం చేసుకుందాం. తీగ అల్లుకోవడానికి పొడవాటి కర్ర కావాలి. ఈ సిక్స్‌ఫీట్ ప్లస్ ప్లస్ ప్లస్ కుర్రాడికి ఎన్ని తీగలు అల్లుకొని ఉంటాయి? నిజమే. అన్నీ అల్లికలే!! జస్ట్ రూమర్స్ అంటున్నాడు రానా. ఫ్రెండ్స్ రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు ఆల్రెడీ రాణులు దొరికేశారు. వాట్ అబౌట్ యూ.. రానా? హూ ఈజ్ రాణి?∙∙l ⇔ ఏంటి రానా.. ఓ 20, 30 కిలోలు తగ్గినట్లున్నారు? (నవ్వుతూ). అవును. మామూలుగా నా వెయిట్ అటూ ఇటూగా 90 కిలోలు ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా కోసం అదనంగా 30 కిలోలు పెరిగాను. షూటింగ్ అయిపోయింది కదా.. బరువు కూడా తగ్గించేశా. ⇔ ‘బాహుబలి’, ‘ఘాజీ’... ఇలా పెద్ద సినిమాలు చేస్తున్నారు.. కానీ, స్టార్డమ్ ఎందుకు మిస్ అవుతోంది? స్టార్డమ్ వెనక నేనెప్పుడూ వెళ్లలేదు. కొత్త సినిమాలు చేయాలన్నది నా టార్గెట్. అలాంటప్పుడు స్టార్డమ్ గురించి ఆలోచించకూడదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర పది కథలున్నాయి. కానీ, నా దారి వెరీ స్పెషల్. ఈ దారిలో వెళ్లే నటులు లేరు. ‘బాహుబలి’, ‘ఘాజీ’ వంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ‘ఘాజీ’ తీయడం పెద్ద రిస్క్. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్ట్ చేయాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు. ఆ మాటకొస్తే నేను చేసే ప్రతి సినిమాకీ రిలీజైన తర్వాత లాభాలొస్తే వాటా తీసుకుంటాను. ⇔ అంటే పారితోషికం గురించి అస్సలు మాట్లాడుకోరా? మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్. నిర్మాత ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు ఆర్టిస్ట్‌గా నేను ముందుకు రావాలి. అలా రెడీ అయ్యాను కాబట్టే, ‘రానాకు ఎంత నమ్మకం ఉంటే... డబ్బులు తీసుకోకుండా ఐదు నెలలుS డేట్స్ ఇచ్చాడు’ అని ‘ఘాజీ’ నిర్మాతలు ముందుకొచ్చారు. నాలాంటి ఆర్టిస్టులు నిర్మాతకు ఆ భరోసా ఇవ్వకపోతే కొత్త సినిమాలు రావు. ⇔ పర్సనల్ విషయాలకొస్తే... మీ అమ్మగారికి ఎలాంటి కోడల్ని ఇవ్వాలనుకుంటున్నారు? మా ఇంట్లో పెద్దగా ఏం కోరుకోరు. మాది జాయింట్ ఫ్యామిలీ. పిల్లలు పెరిగే కొద్దీ ఇల్లు చిన్నది కావడంతో బాబాయ్ (వెంకటేశ్) కొత్త ఇల్లు కట్టుకున్నారు. నేను ఎప్పటికీ అమ్మానాన్నతోనే ఉంటాను. మాది ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ ఎవరి ప్రైవసీ వాళ్లకు ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాతోనే జీవించాలి. అయితే మా ఇంట్లో రూల్ బుక్ ఏం లేదు. అత్త– మామల ముందు కూర్చోకూడదు వంటి నియమాలు ఉండవు. మా ఇంట్లో అడుగుపెట్టే కోడలు హ్యాపీగా ఉండొచ్చు. ⇔ మీ బావ చైతూ (నాగచైతన్య)కి త్వరలో పెళ్లవుతోంది. మిమ్మల్ని ఇంట్లో తొందర పెట్టడం లేదా? ఆ మధ్య నా సిస్టర్ బర్త్‌డే పార్టీలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ‘చూడు... నీకన్నా చిన్నోడు. పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అన్నారు. ‘వాడికి కుదిరింది బాస్. నాకు కుదరలేదు. వాడి పెళ్లి కుదిరిందని హ్యాపీగా ఫీలవ్వండి. నేను హ్యపీగా ఉన్నాను, నన్నెందుకు ఇబ్బంది పెడతారు’ అన్నాను. ⇔ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో దేవుడికెరుక. మీ నెక్ట్స్ గాళ్ ఫ్రెండ్ ఎవరు అనేది కూడా దాదాపు అలాంటిదే? భలేవారే. నా అంతట నేను ఎవరి పేరూ చెప్పలేదు. ఎవరికి వాళ్లు ఎవరెవరి పేరో ఊహించుకుని రాశారు. విశేషం ఏంటంటే.. అలుపూ సొలుపూ లేకుండా రాస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కొంచెం జోరు తగ్గింది. రాసేవాళ్లకూ బోర్ కొట్టేసినట్టుంది. ‘వీడి గురించి ఎన్నిసార్లు రాస్తాం’ అని కొంచెం డోస్ తగ్గించారు (నవ్వుతూ). ⇔ మీరూ, త్రిష జంటగా ఓ పెళ్లికి వెళ్లారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. తర్వాత బ్రేకప్ అయ్యారనే వార్త వినిపిస్తోంది? ఆ సంగతి పక్కన పెట్టి, నా గురించి ఓ విషయం చెబుతా. నాతో జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు నేను కొన్ని అంశాలు కావాలనుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు కొన్ని కోరుకుంటారు. అందులో నాకు తగ్గట్టుగా కొన్ని ఉండకపోవచ్చు. నా లైఫ్ సై్టల్ అసాధారణంగా ఉంటుంది. హిందీ సినిమా చేస్తే ఆరు నెలలు ముంబైలో ఉంటాను. ఒక్కోసారి హైదరాబాద్ రావడం చాలా రోజులు అవుతుంది. వచ్చే ఏడాది టీవీ షోస్ గురించి డిస్కస్ చేయడానికి అమెరికా వెళ్తున్నా. మూడు నెలలు అక్కడే ఉంటాను. డిస్కషన్స్ పూర్తి కాకపోతే ఏడాది అక్కడే ఉండొచ్చు. ఒకవేళ నాకు పెళ్లైతే అవన్నీ చేసే వీలు ఉండదు. కొన్నాళ్లు ఇక్కడ? కొన్నాళ్లు ఎక్కడో అంటే లైఫ్ పార్టనర్ ఒప్పుకోవాలి కదా! పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు... కానీ, ముందు లైఫ్‌ను ఓ స్ట్రక్చర్లోకి తెచ్చుకున్నాక పెళ్లి చేసుకుంటా. ⇔ మీ క్లాస్మేట్స్ కమ్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నప్పుడు ‘మీ పెళ్లి ఎప్పుడ’నే ప్రశ్న ఎదురవుతుంది కదా? ఈ డిస్కషన్ అంతా హైదరాబాద్‌లోనే. ముంబై వెళితే అస్సలు రాదు. అక్కడ నాకంటే వయసులో పెద్దవాళ్లు పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటున్నారు. సమస్య ఏంటంటే.. నేను ఏ కల్చర్‌లోనూ పూర్తిగా లేను. మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో నన్ను ‘మదరాసీ’ అనేవాళ్లు. అక్కడేమో తెలుగబ్బాయి అంటారు. ముంబై వెళితే సౌత్ అబ్బాయి అంటారు. మొన్న నా అమెరికా ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చారు. నేను ఓ పెళ్లికి వెళ్తుంటే వివరాలు అడిగారు. పెద్దలు కుదిర్చిన పెళ్లని చెప్పగానే షాకయ్యారు. ‘అమ్మాయి, అబ్బాయి ఎప్పుడూ కలుసుకోలేదా? ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారా?’ అన్నారు. ‘మేం ఇలాంటి కాన్సెప్ట్ వినడం ఇదే ఫస్ట్ టైమ్’ అని, షాకయ్యారు. ⇔ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఫస్ట్ టైమ్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చరణ్ (రామ్ చరణ్), అల్లు అర్జున్‌లకు పెళ్లి అయినప్పుడు వచ్చింది. మనకూ ఓ అమ్మాయి దొరికితే బాగుంటుందనుకున్నా. ప్చ్.. దొరకలేదు. అంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు చరణ్, అర్జున్‌కి ఫోన్ చేసేవాణ్ణి. పెళ్లయ్యాక ‘ఏమో.. వైఫ్‌తో ఎక్కడికైనా వెళ్లారేమో.. ఫోన్ చేయొచ్చో లేదో’ అనుకోవడం మొదలుపెట్టా. అప్పుడు స్మార్ట్‌గా ఆలోచించా (నవ్వుతూ). పెళ్లైనోళ్లతో వర్కౌట్ కావడం లేదని నాకన్నా వయసులో చిన్నోళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాను. పెళ్లైనోళ్లు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్లే ఫోన్ చేసి నన్ను పిలుస్తారు కదా. ⇔ త్రిష గురించి అడుగుతుంటే.. పెళ్లి మీద మీ ఒపీనియన్ చెబుతున్నారు! అసలు త్రిషను ప్రేమించారా? లేదా? త్రిషతో రిలేషన్షిప్లో ఉండుంటే మాట్లాడేవాణ్ణి. ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ఓ జీవితం ఉంటుంది. త్రిష నాకు మంచి స్నేహితురాలు. తనంటే గౌరవం. ⇔ త్రిషతో లవ్, బ్రేకప్ అనే వార్త తర్వాత శ్రియ పేరు వచ్చింది. తనతో మీ రిలేషన్షిప్ ఏంటి? శ్రియ తెలుగులో హీరోయిన్గా చేసిన 5వ సినిమా ‘నీకు నేను నాకు నువ్వు’కి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. అప్పట్నుంచీ తను నాకు ఫ్రెండ్. అప్పట్లో మేం ఫ్రెండ్లీగా ఉంటే ఎవరూ ఏమీ మాట్లాడేవాళ్లు కాదు. నేను హీరో అయిన తర్వాత తను నాతో కనిపిస్తే అందరూ వింతగా చూస్తున్నారు. నా పర్సనల్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో శ్రియ కూడా ఉంది. మొన్న ముంబై వెళ్లినప్పుడు ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళుతూ.. మధ్యలో శ్రియను కలిశా. అక్కడ మేం మొత్తం 14 మంది ఉన్నాం. కానీ, మా ఇద్దరిని మాత్రమే ఫొటో తీసి, దాన్నో న్యూస్ కింద క్రియేట్ చేశారు. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ⇔ లైఫ్‌ని ఓ స్ట్రక్చర్లోకి తెచ్చుకునేవరకూ పెళ్లి చేసుకోనంటున్నారు... ఈలోపు పెళ్లి వయసు దాటిపోతుంది కదా? ఈ రోజుల్లో వయసనేది పెద్ద విషయం కాదు. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరికి 50 ఏళ్లు.. ఇంకొకరికి 22 ఏళ్లు. ఆ రెండు ఏజ్ గ్రూప్లవాళ్లతోనూ బాగుంటాను. నాకు 46 ఏళ్ల ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటే వయసులో చిన్నోళ్లైన స్నేహితులు పెళ్లి చేసుకున్నారు. కొందరు పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. (నవ్వులు). ఈ రోజుల్లో ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలనే రూల్ లేదు. ⇔ ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? నాకు ఏదైనా సమస్య లేదు. పక్క రూమ్‌లో ఓ పెద్దాయన (తండ్రి సురేశ్‌బాబు) ఉన్నారు. ఆయన్నే అడగండి. ⇔ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కి మీరే ఇల్లు కొనిచ్చారట? (పెద్దగా నవ్వుతూ..) నేను తనకు ఇల్లు కొనిపెట్టానా? నా గురించి వచ్చిన పరమ చెత్త రూమర్లలో ఇదొకటి. ఇలాంటి డర్టీ రూమర్స్ విన్నప్పుడు కోపంగా ఉంటుంది. నా గురించి ఎంత చెత్త రాసినా నేను పట్టించుకోను. ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం, పుకార్లు సృష్టించడం మంచిది కాదు. వాళ్లూ ఫీలవుతారు. ⇔ మరి.. ‘ఇలాంటి రూమర్స్ మానుకోండి’ అంటూ ఎప్పుడూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వరెందుకని? బురదలో రాయి వేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. పది రోజుల క్రితం జోరుగా షికారు చేసిన ఓ వార్త ఇప్పుడు చప్పగా అనిపిస్తుంది. ఎవరూ పట్టించుకోరు. నా గురించి ఏదైనా వార్త వచ్చినప్పుడు చదివిన ఆ నిమిషం, ఆ తర్వాత ఓ గంట, ఆ వారం ఇరిటేట్ అయ్యి ఆ తర్వాత ఎవడి పాపాన వాడు పోతాడని వదిలేస్తా. నాకు ఫైట్ చేసే ఓపిక లేదు. ఫైట్ చేయాలంటే హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు.. ప్రతి ఊళ్లోనూ చేయాలి. అక్కడ కూడా నా గురించి న్యూస్‌లు వస్తుంటాయి కదా. ⇔ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హిందీ హీరోయిన్ బిపాసా బసుతో ఎఫైర్ అంటూ ఓ వార్త వచ్చింది. అప్పుడు ఏమనిపించింది? నా ఫస్ట్ సినిమా ‘లీడర్’, ఆ తర్వాత హిందీలో చేసిన ‘దమ్ మారో దమ్’ టైమ్‌లో బిపాసా బసుతో వచ్చిన పుకార్లు నాపై ప్రభావం చూపాయి. అప్పుడు బయటకు వెళ్లడం మానేశా. తర్వాత ‘మన జీవితాన్ని ఎవరి కోసమో ఎందుకు మార్చుకోవాలి. మనం మార్చుకోకూడదు బాస్’ అని డిసైడ్ అయ్యా. అలా ఫిక్స్ అయిన తర్వాత, నటుడు కాకముందు ఎలా ఉండేవాణ్ణో అలాగే ఉండటం మొదలుపెట్టా. హ్యాపీగా నా కారు నేనే డ్రైవ్ చేస్తా. ఒంటరిగా నచ్చిన రెస్టారెంట్‌కి వెళ్లి, ఫుడ్ లాగిస్తా. ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయాలంటే హ్యాపీగా వెళ్తా. నాకు నచ్చినట్లుగా ఉంటున్నాను. ⇔ ఈ రూమర్స్ విని మీ అమ్మగారు ఏమంటారు? మా అమ్మను చూస్తే మీకు తెలుస్తుంది. అస్సలు టెన్షన్ పడదు. నాకంటే రిలాక్స్›్డగా, కూల్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచీ మాకు అమ్మ చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. నా ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను ఏ విషయాన్నీ దాచను. నేనేం చేస్తున్నాను? ఎక్కడ ఉన్నాను?.. ఇలా అన్నీ వాళ్లకు తెలుసు. అందుకే ఎవరేమన్నా మా అమ్మ సమాధానం చెబుతుంది. మనకు ఎవరు ముఖ్యం అనుకుంటామో.. వాళ్లకు మన గురించి నిజాలు తెలియాలి. మిగతా ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఎవరో ఏదో పార్టీలో నా గురించి మాట్లాడితే నాకేంటి? ⇔ మీరు ఫ్రీ బర్డ్‌లా ఉంటారనిపిస్తోంది.. యస్. ‘ఏం చేస్తే ఎవరేం అనుకుంటారో!’ అని ఆలోచిస్తే హ్యాపీగా ఉండలేం. ‘ఇతరులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏం అనుకుంటున్నారనేది వాళ్ల సమస్య. నీ సమస్య కాదు’ – స్కూల్ లైఫ్ నుంచి నేను ఫాలో అవుతున్న ప్రిన్సిపల్ ఇది. నా ఆనందాన్ని ఇతరుల ఆలోచనల్లో వెతుక్కోవాలనుకోవడం లేదు. అసలు ఈ సొసైటీతోనే సమస్యంతా. వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో అంటుంటారు. కులం, మతం ఏదీ పట్టించుకోకూడదు. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం... హ్యాపీగా ఉండటం. అంతే. మనకు నచ్చినట్లుగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. – డి.జి. భవాని -
కెప్టెన్ అర్జున్ వర్మ
బాబాయ్ వెంకటేశ్.. అబ్బాయ్ రానా.. ఇద్దరూ ఒకేరోజు అభిమానులను ఖుషీ చేశారు. మంగళవారం వెంకటేశ్ పుట్టినరోజు కానుకగా ‘గురు’ టీజర్ విడుదల చేశారు. బుధవారం అబ్బాయ్ రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్నే (మంగళవారం) ‘ఘాజీ’లో రానా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రెండూ కొన్ని గంటల వ్యవధిలోనే విడుదలయ్యాయి. రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే, అన్వేశ్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నిరంజన్‌రెడ్డిలు నిర్మిస్తున్న చిత్రం ‘ఘాజీ’. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేవీ అధికారి అర్జున్ వర్మ పాత్రలో రానా నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘తొలి భారతీయ జలాంతర్గామి చిత్రమిది. సాంకేతిక పరంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది. నీటి అడుగున చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వచ్చే ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, నాజర్ నటించిన ఈ చిత్రానికి ‘కె’ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. -
సముద్రం.. యుద్ధం...
ఇండియా- పాకిస్తాన్ మధ్య యుద్ధాలు కాశ్మీర్ లోయలోనూ, సరిహద్దుల్లోనూ మాత్రమే జరగలేదు. ఓ యుద్ధం నీటిలో... అదీ మన విశాఖ సముద్ర తీరంలో జరిగింది. 1971లో జరిగిన యుద్ధంలో పీఎన్ఎస్ ఘాజీ అనే పాకిస్తాన్ జలాంతర్గామి సముద్రంలో మునిగింది. చరిత్రలోని ఈ యుద్ధ గాథ కూడా ఎక్కడో అడుగున పడింది. పెద్దగా ఎవరికీ తెలీదు. ఇప్పుడీ కథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నూతన దర్శకుడు సంకల్ప్. రానా, తాప్సీ జంటగా సంకల్ప్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, అన్వేష్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఘాజీ’. ఆది వారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘హాలీవుడ్ స్థాయిలో తీసిన చిత్రమిది. నీటి అడుగున చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. వచ్చే ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. భారతీయ తొలి జలాంతర్గామి చిత్రం ఇది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హిందీలో విడుదల చేస్తున్నారు. -
విషయం ఉంటే విజయం!
‘‘దీపావళికి విడుదలైన మా ‘కాష్మోరా’ చిత్రం ఘనవిజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘కాష్మోరా’. పీవీపీ మాట్లాడుతూ -‘‘సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాలో అది ఉంది కాబట్టే విజయం సాధించింది. ఈ విజయం వెనక కార్తీ, గోకుల్, చిత్రబృందం అందరి కృషి ఉంది. ‘కాష్మోరా’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రానా హీరోగా తెరకెక్కించిన ‘ఘాజీ’ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నాం. ‘ఊపిరి’ తర్వాత నాగార్జునతో ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ చిత్రం నిర్మించబోతున్నా. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో ఓ చిత్రం నిర్మిస్తా’’ అన్నారు. -
అబ్బాయికి బాబాయ్ మాటసాయం
కథకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా ఆయా పాత్రల గురించి నెరేట్ చేయడానికి ఒక హీరో చిత్రంలో మరొక హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పిస్తుండటం కామన్. తాజాగా అబ్బాయ్ రానా ‘ఘాజీ’ చిత్రానికి బాబాయ్ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తుండడం ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవల ‘బాహుబలి 2’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రానా తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఘాజీ’ చిత్రంతో పాటు తేజ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు రానా. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీస్తున్న ‘ఘాజీ’లో రానా నౌకాదళ అధికారిగా కనిపించనున్నారు. తాప్సీ కథానాయిక. ఈ చిత్రంలో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు వెంకటేశ్‌ను సంప్రదించారట చిత్ర బృందం. అన్న సురేశ్‌బాబు కొడుకు హీరో కావడం, కథ కూడా నచ్చడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ఫిలిమ్‌నగర్ టాక్. పీవీపీ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘రుద్రమదేవి’కి చిరంజీవి, పవన్‌కల్యాణ్ ‘జల్సా’, జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్షా’ కోసం మహేశ్‌బాబు, ‘మర్యాద రామన్న’కు రవితేజ, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాకు సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రానున్న నాగచైతన్య ‘ప్రేమమ్’కి తండ్రి నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు. -
ఫిబ్రవరి 24న 'ఘాజీ'
ప్రస్తుతం బాహుబలి షూటింగ్లో బిజీగా ఉన్న రానా, అదే సమయంలో తన ఇతర సినిమాల పనులను కూడా పూర్తిచేసేస్తున్నాడు. బాహుబలి 2తో పాటే 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఘాజీ సినిమా వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు. రానా నావీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో సంకల్ప రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తయినా భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తాప్సీ, కెకె మీనన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
రానా సినిమాకు కరణ్ సపోర్ట్
యంగ్ హీరో రానా విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నాడు. విలన్‌గా, సోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రానా హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం భారీగా తెరకెక్కుతున్న బాహుబలి 2 తో పాటు యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాలో నటిస్తున్నాడు రానా . ఈ రెండు సినిమాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ రెండు చిత్రాల బాలీవుడ్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సొంతం చేసుకున్నారు. బాహుబలి తొలి భాగంతో భారీ లాభాలు సొంతం చేసుకున్న కరణ్, ఆ సినిమా సీక్వల్‌ను ఎక్కువ మొత్తం చెల్లించి మరి సొంతం చేసుకున్నారట. అదే సమయంలో 1971లో మునిగిపోయిన పాకి స్థాన్ సబ్ మెరైన్ ఘాజీ కథతో రానా హీరోగాతెరకెక్కుతున్న సినిమాను కూడా బాలీవుడ్లో ఆయనే రిలీజ్ చేస్తున్నారు. కరణ్ లాంటి బడా ప్రొడ్యూసర్ తమ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఘాజీపై బాలీవుడ్లో కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. -
కండిషన్స్ అప్లై
తెలుగు, తమిళ్, హిందీ.. ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్లకు చాయిస్ ఉండదు. వాళ్లకు కథలు ఎంపిక చేసుకునే చాయిస్ చాలా తక్కువ. ఢిల్లీ బేబీ తాప్సీ మాత్రం చాయిస్ నాదే అంటున్నారు. దర్శక-నిర్మాతలకు కండీషన్స్ పెడుతున్నారు. జనరల్‌గా ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరో.. పేరున్న దర్శకుడు.. మంచి రెమ్యునరేషన్.. చూసుకుని సినిమాలు చేస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో తాప్సీ కూడా అలాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు మాత్రం ససేమిరా అంటున్నారు. కథ, అందులో పాత్ర నాకు నచ్చాలని కండీషన్స్ చిట్టా విప్పుతున్నారు. ‘‘తెలుగులో నేనిప్పుడు ‘ఘాజీ’ సినిమాలో మాత్రమే నటిస్తున్నాను. హీరో రానా దగ్గుబాటి, నేనూ గర్వించే సినిమా అవుతుంది ఇది. ‘ఘాజీ’ తర్వాత హీరోతో రొమాన్స్, పాటల కోసమే హీరోయిన్ అన్నట్టుండే సినిమాలు, హీరోయిన్‌కి విలువ ఇవ్వని సినిమాలు చేయను. -
త్రిభాషా చిత్రంలో...
ఇది రానాకి సవాల్‌లాంటి సీజన్ అనాలి. ఎందుకంటే ఒకే సారి మూడు ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి: ది కన్క్లూజ్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఘాజి’ తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఆరంభం కానున్న ‘1945’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇప్పుడు ఏకంగా ఓ త్రిభాషా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మేజర్ రవి దర్శకత్వంలో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మేజర్ మహదేవన్ అనే పాత్ర చుట్టూ తిరిగే ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’, ‘కాందహార్’ వంటి వార్ మూవీస్ తీసిన మేజర్ రవి ఇప్పుడు ఇదే పాత్రతో తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత మూడు చిత్రాల్లోనూ మేజర్ మహదేవన్‌గా మోహన్‌లాల్ నటించారు. నాలుగో చిత్రంలోనూ ఈ పాత్రను ఆయనే చేయనున్నారు. మరో కీలక పాత్రకు రానాను తీసుకున్నారు. ఇందులో రానా లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపిస్తారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదలవుతుంది. -
క్రేజ్ వస్తుందని భయపడుతుందట..!
కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిని ఢిల్లీ భామ తాప్సీ, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. సౌత్‌లో చేసిన కాంచన 2 సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ, బేబి సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తరువాత తాప్సీ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా త్వరలో క్రేజీ ఆఫర్స్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి పింక్, నానాపటేకర్‌తో కలిసి తడ్కా సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. ఒకేసారి ఇద్దరు లెజెండరీ యాక్టర్స్‌తో కలిసి నటిస్తుండటంతో ఆ సినిమాల రిలీజ్ తరువాత తనకు భారీ క్రేజ్ వస్తుందని భావిస్తోంది ఈ బ్యూటి. ఈవిషయాన్ని స్వయంగా చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో మీడియాతో పంచుకున్న తాప్సీ. నాకు భారీ క్రేజ్ వస్తుందేమో అని భయంగా ఉందంటూ కామెంట్ చేసింది. సౌత్ లోనూ ఘాజీ లాంటి ఆసక్తికర సినిమాల్లో నటిస్తూ తన ఫాం కొనసాగించే పనిలో ఉంది ఈ బ్యూటి. -
పంజాబీ రీమేక్‌లో రానా
ప్రస్తుతం బాహుబలి, ఘాజీ లాంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న రానా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.., అది విలన్ రోల్ కావటంతో ఇప్పుడు తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే పనిలో పడ్డాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా ఘాజీని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రూపొందిస్తున్నాడు. ఇక నటుడిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే పంజాబీలో తెరకెక్కుతున్న సర్థార్ జీ 2 రీమేక్ రైట్స్‌ను తానే స్వయంగా తీసుకున్నాడు. ఈ సినిమాలో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఇలాంటి సినిమాలో నటిస్తే నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయని ఫీల్ అవుతున్నాడు రానా. అందుకే ఈ సినిమాలో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. -
పంజాబీ రీమేక్‌లో రానా..?
ప్రస్తుతం బాహుబలి, ఘాజీ లాంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న రానా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.., అది విలన్ రోల్ కావటంతో ఇప్పుడు తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే పనిలో పడ్డాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా ఘాజీని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రూపొందిస్తున్నాడు. ఇక నటుడిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే పంజాబీలో తెరకెక్కుతున్న సర్థార్ జీ 2 రీమేక్ రైట్స్‌ను తానే స్వయంగా తీసుకున్నాడు. ఈ సినిమాలో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఇలాంటి సినిమాలో నటిస్తే నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయని ఫీల్ అవుతున్నాడు రానా. అందుకే ఈ సినిమాలో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. -
పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ
హీరో రానా ఇప్పుడు ఒకటికి రెండు విధాల సంతోషంగా ఉన్నారు. ‘బాహుబలి’లో చేసిన భల్లాలదేవుడి పాత్ర గురించి, ‘బాహుబలి-2’ షూటింగ్ గురించి ఆయన ఎలాగూ ఆనందంగా ఉన్నారు. మరి, రెండో కారణం ఏమిటంటారా? అది - నౌకాదళంపై భారతదేశంలో తయారవుతున్న తొలి సినిమా ‘ఘాజీ’! ఆ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర! విశాఖ తీరం... ఇండో - పాక్ యుద్ధ నేపథ్యం... 1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి ‘పి.ఎన్.ఎస్. ఘాజీ’ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా ‘ఘాజీ’. ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ‘‘ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ. విశాఖపట్నంలో కొంతకాలం ఉన్న నాకు ఈ సబ్‌మెరైన్ కథ తెలుసు. ఇంతవరకూ ఎవరూ దీనిపై సినిమా తీయకపోవడం, ఇప్పుడు నాకు అందులో పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం’’ అని రానా అన్నారు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాను స్వయంగా రాసుకున్న ‘బ్లూ ఫిష్’ అనే నవలను ఆధారంగా చేసుకొని, స్క్రిప్ట్ అల్లుకొని, ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పి.వి.పి. సినిమా’ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోంది. అలాగే, తమిళంలోనూ అనువదించి, విడుదల చేయనున్నారు. కథానాయిక తాప్సీ, ప్రముఖ హిందీ సినీ నటుడు కేకే మీనన్‌లు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవికత కోసం... అక్కడి నటులతో... పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో సహజంగానే పాకిస్తానీ పాత్రలుంటాయి. ఆ పాత్రలకు ఇక్కడి నటులకు వేషం వేసి పెట్టకుండా, దర్శక - నిర్మాతలు వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన రంగస్థల నటులు 11 మందిని ప్రత్యేకంగా ఈ పాత్రలకు ఎంపిక చేశారు. ఏకంగా వారందరినీ ఇండియాకు రప్పించి, వారితోనే ఆ పాత్రల్ని పోషింపజేసినట్లు చిత్ర నిర్మాణ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జలాంతర్గామి సెట్స్ అన్నీ వేసి మరీ చిత్రీకరణ జరిపారు. హైదరాబాద్‌లో పెద్ద జలాశయంలో రెండు జలాంతర్గాముల్ని సృష్టించారు. భారత యుద్ధ నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’లో అప్పట్లో పనిచేసిన నౌకాదళ అధికారుల్ని కూడా రానా స్వయంగా కలిశారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొంతమంది నౌకాదళ అధికారుల్ని కూడా మేము కలిశాం. మా నాన్న గారు (ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు) తన పరిచయాలతో వారిని కలవడానికి సాయపడ్డారు. కానీ, అప్పటి యుద్ధ సంఘటనల వివరాలన్నీ ‘రహస్య సమాచారం’తో కూడిన ఫైల్ కావడం వల్ల అధికారులు పెద్దగా వివరాలు బయటపెట్టలేకపోయారు. ఇది యథార్థ గాథ అయినప్పటికీ, సినీ మాధ్యమానికి తగ్గట్లు కొంత స్వేచ్ఛ తీసుకొని సన్నివేశ కల్పన చేశాం. ఏమైనా, మా మటుకు నాకు ఇది అందరికీ చెప్పాల్సిన అద్భుతమైన కథ’’ అని రానా పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా... నీటిలోనే! భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ రెండు, మూడు రోజుల షూటింగ్ మినహా మిగతా అంతా పూర్తయిపోయింది. కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి ‘అండర్ వాటర్’ పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం. గ్రాఫిక్ వర్క్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న సినిమా ఇది. అందుకే, శ్రద్ధగా చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు తగినంత టైమ్ కేటాయించాలని దర్శక, నిర్మాతల భావన. అవన్నీ పూర్తి చేసుకొని, ఈ ఏడాది దసరాకు ‘ఘాజీ’ని రిలీజ్ చేస్తారు. -
ఒక్కసారి తప్పటడుగేస్తే...!
‘‘ఎన్ని పాత్రలు చేసినా చేయడానికి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి. అందుకే వందల సినిమాలు చేసినా కళాకారుల దాహం తీరదు’’ అని తాప్సీ అన్నారు. ఈ ఢిల్లీ బ్యూటీ గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చిత్రాల్లో కనిపిస్తారు. ఇప్పటికే మూడు చిత్రాలు కమిట్ అయ్యారామె. వాటి గురించి తాప్సీ చెబుతూ - ‘‘ప్రస్తుతం అంగీకరించిన చిత్రాల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘ఘాజి’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. నా కెరీర్‌కి ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఇది కాకుండా సంతకం చేసిన మరో రెండు సినిమాలు కూడా నటిగా నాకు ఇంకా మంచి పేరు తెచ్చే విధంగానే ఉంటాయి. మంచి పాత్రల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అందుకే, కొన్ని రోజులు ఖాళీగా కూడా ఉన్నాను. నా నిరీక్షణ వృథా కాలేదు. మంచి అవకాశాలు దక్కాయి. హిందీ పరిశ్రమలో అవకాశాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మంచి కథలు ఎంపిక చేసుకోవడం మాత్రం కష్టమే. ఒక్క సెలక్షన్ రాంగ్ అయితే చాలు... ఇక రెండోది సెలక్ట్ చేసుకునే అవకాశమే ఉండదు. అందుకే, ప్రతి అడుగూ పదిలంగా వేయాలి. ఆ... ఏముందిలే అని ఎలా పడితే అలా సినిమాలు చేసేస్తే, నిలదొక్కు కోవడం కష్టం. అందుకే సిని మాల సెలక్షన్ విషయంలో కాస్త ఓపికగా వ్యవహరించాలి’’ అని వివరించారు. -
నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా అవి కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ చష్మే బదూర్ సినిమాతో అక్కడ కూడా మంచి గుర్తింపునే సాధించింది. తాజాగా ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉందంటూ వస్తున్న వార్తలపై తాప్సీ స్పందించింది. తన చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయన్న తాప్సీ, ఘాజీతో పాటు, రైజింగ్ సన్ ఫిలింస్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించింది. కాళీగా ఉన్నప్పుడు కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు ఇండస్ట్రీ జనాలు. అలాంటిది, ఇలా అవకాశాల్లేవని చెప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావలంటున్నారు విశ్లేషకులు. For all the speculations and source stories, I'm right now on for #Ghazi and an untitled movie under #RisingSunFilms ONLY *period* — taapsee pannu (@taapsee) February 9, 2016 -
బాహుబలి కోసం భారీ కసరత్తులు
నిన్న సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియోతో సందడి చేసిన సోషల్ మీడియా ఇప్పుడు రానా జిమ్ వీడియోతో హల్ చల్ చేస్తోంది. సమంత వీడియోను అప్ లోడ్ చేసిన కునాల్ గిర్, రానా బాహుబలి కోసం రెడీ అవుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారీ చైన్లతో రానా కసరత్తులు చేస్తున్న వీడియో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకర్షిస్తోంది. రానా బాడీ బిల్డింగ్ వీడియోపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ కన్నా నీ లుక్ బాగుందంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఘాజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, ఆ సినిమాతో పాటు బాహుబలిలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి 2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!'
ఇప్పటికే చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో రానా మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం తొలి సబ్ మెరైన్ వార్ ఫిలింగా తెరకెక్కుతున్న ఘాజీలో నటిస్తున్న రానా, ఈ సినిమాతో పాటు బాహుబలి 2 షూటింగ్‌కు కూడా రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే లీడర్ సినిమాకు సీక్వల్‌ను కూడా లైన్లో పెట్టాడు. ఇవి కాకుండా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బెంగళూర్ డేస్' రీమేక్ రిలీజ్‌కు రెడీగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో సినిమాకు ఓకె చెప్పాడు. తమిళ రచయిత డేవిడ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చటంతో, ఇంత బిజీ షెడ్యూల్ లోనూ డేవిడ్‌తో బైలింగ్యువల్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. డేవిడ్ చెప్పిన లైన్ చాలా నచ్చింది అందుకే ఇంత బిజీలోనూ ఆ సినిమాను కాదనలేకపోయానన్నాడు రానా. -
టాలీవుడ్లోకి బాలీవుడ్ విలన్
సర్కార్, హైదర్, ఏబిసిడి లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నమళయాళీ నటుడు కె కె మీనన్ ఘాజీ సినిమాలో నటించనున్నాడు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న గ్యాప్‌లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తొలి సబ్ మెరైన్ వార్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. రానాతో పాటు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశారు చిత్రయూనిట్. అయితే ప్రకాష్ రాజ్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మన ఊరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు కె కె మీనన్ ని ఎంపిక చేశారు. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. -
యుద్ధం కంటే 'మాస్' ఏముంటుంది?-రానా
'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇది చరిత్రలో చోటుచేసుకున్న ఓ మిస్టరీ. 1971లో ఇండియా,పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో మునిగిపోయిన 'పీఎన్ఎస్ ఘాజి' నౌకకు సంబంధించిన మిస్టరీనే కథాంశం. ఈ సినిమాలో రానా... నేవల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సముద్ర గర్భంలో కొన్ని రోజులపాటు జరిగిన యుద్ధాన్ని తెర మీద చూపించబోతున్నారు. 'ఘాజి' పేరుతో తెలుగు, హిందీలలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ గురువారమే ప్రారంభమయింది. ఇదే విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. దీనికి స్పందిస్తూ ఓ అభిమాని 'మాకు మాస్ మూవీ కావాలి, మీ నుంచి మాస్ మూవీ కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేయగా .. 'యుద్ధం కంటే మాస్ ఏముంటుంది?' అంటూ బదులిచ్చారు రానా. ఈ చిత్ర విజయాన్ని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా రానాకు విషెస్ తెలిపారు. Pushing my experimental envelope towards mainstream cinema yet again!! #GHAZI (Hindi-Telugu bi-lingual) begins filming today!! — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 #GHAZI India's first submarine based war film!! Based on true incidents!! Wish us luck!! — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 @RanaDaggubati Bro we want mass movie..daggubati fans were expecting mass mve from u — VAMSI VENKY (@venkyfanvamsi) January 7, 2016 Yuddham Kanna Mass evi untundhi :)?? https://t.co/FkDjo4BpSg — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 -
రానా సినిమా చేయనన్న ప్రకాష్‌రాజ్
ప్రస్తుతం బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న రానా.. ఆ సినిమా తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకు కమిట్ అయ్యాడు. భారత్ పాకిస్తాన్ల యుద్ధ సమయంలో విశాఖ తీరంలో మునిగిపోయిన జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఘాజీ' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రానా. వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు మరో కీలకపాత్రకు ప్రకాష్‌రాజ్‌ను ఎంపిక చేశారు. తొలుత ఈ పాత్రలో నటించడానికి అంగీకరించిన ప్రకాష్, ఇప్పుడు చేయలేనని చెప్పాడట. తనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మన ఊరి రామాయణం' సినిమాను ఇటీవలే ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ఆ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతర సినిమాలను అంగీకరించటం సరికాదని భావించి, ఘాజీ సినిమా నిర్మాతలకు డేట్స్ ఇవ్వలేనని చెప్పాడు. ప్రకాష్ రాజ్ కాదన్న ప్లేస్‌లో మరో నటుడి కోసం వేట ప్రారంభమైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.