ఇప్పటికి పదివేల మంది ఈ ప్రశ్న అడిగారు!
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ – కొందరు సినిమా స్టార్స్ తరచూ చెప్పే డైలాగ్ ఇది. కానీ, భరత్‌రెడ్డికి ఈ డైలాగ్ అవసరం లేదు. ఎందుకంటే... ఈయన డాక్టర్ కమ్ యాక్టర్. కార్డియాలజిస్ట్‌గా ప్రజల్లో ఎంత మంచి పేరుందో... నటుడిగా ప్రేక్షకుల్లో అంతే మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన ‘ఘాజీ’లో భరత్ చేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి చెప్పిన విశేషాలు....
‘డాక్టర్ అండ్ యాక్టర్‌గా చేస్తున్నారు. రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?’ – నన్ను ఎవరు కలిసినా మొదట అడిగే ప్రశ్న ఇదే. సుమారు ఓ పదివేల మందికి పైగా ఈ ప్రశ్న అడిగారు. డాక్టర్, యాక్టర్.. రెండూ విభిన్నమైన ప్రొఫెషన్స్. రెండిటినీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మా అమ్మగారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వర్రీ అయ్యారు. నాన్నగారు ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ‘సినిమాల్లోకి వెళుతున్నాడు. వీడి లైఫ్ ఏమౌతుంది? కార్డియాలజీ ప్రాక్టీస్ ఏమౌతుంది?’ అని అమ్మ భయపడ్డారు. పదేళ్లుగా రెండు ప్రొఫెషన్‌లనూ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నా. మంచి సినిమాల్లో నటించడంతో పాటు డాక్టర్‌గా ప్రజలకు మంచి చేయాలనే ఆశయమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ∙నటుడిగా ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ‘సిద్ధం’, ‘ఈనాడు’, ‘గగనం’, ‘ఘాజీ’ వంటి పలు స్ఫూర్తివంతమైన సినిమాల్లో నటించాను. నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. చరిత్రలో నిలిచే ఇలాంటి సినిమాలు చేయాలని కోరిక. గతేడాది ‘భయం ఒరు పయనం’ అనే తమిళ సినిమాలో హీరోగా చేశా. అది ‘భయమే ఒక ప్రయాణం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఛాన్స్ వస్తే హీరోగా చేయడానికి రెడీ. అలాగే, మంచి పాత్రలు వస్తే ‘ఘాజీ’ వంటివీ చేస్తా.
‘ఘాజీ’లో పాత్ర నటుడిగా ఓ ఛాలెంజ్. సినిమాలో లైవ్ ఫైర్‌తో ఓ సీన్ చేశాను. అందులో గ్రాఫిక్స్ ఏం లేవు. సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే... నా కనుబొమలు, జుత్తు కాలిపోయి ఉన్నాయి. షాకయ్యా. లక్కీగా స్కిన్‌కి ఏం కాలేదు. జుత్తు కాలినా తిరిగి పెరుగుతుంది. డాక్టర్‌ను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. ∙జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్ ముఖ్య తారలుగా దర్శకుడు బాల తీస్తోన్న ‘నాచియార్’లో కీలక పాత్ర చేస్తున్నా. బాలాగారి సినిమాలు నటీనటులకు ఎంత పేరు తెస్తాయో తెలిసిందే. అందుకే రెమ్యునరేషన్ గురించి అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశాను. ఓ కమర్షియల్ తెలుగు సినిమాలో మంచి అమౌంట్ ఆఫర్ చేసినా... రొటీన్ క్యారెక్టర్, అదీ చిన్నది కావడంతో అంగీకరించ లేదు. నాకు మనీ ముఖ్యం కాదు, ఆర్టిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా.