
అబ్బాయికి బాబాయ్ మాటసాయం
కథకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా ఆయా పాత్రల గురించి నెరేట్ చేయడానికి ఒక హీరో చిత్రంలో మరొక హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పిస్తుండటం కామన్. తాజాగా అబ్బాయ్ రానా ‘ఘాజీ’ చిత్రానికి బాబాయ్ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తుండడం ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవల ‘బాహుబలి 2’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రానా తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఘాజీ’ చిత్రంతో పాటు తేజ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు రానా. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీస్తున్న ‘ఘాజీ’లో రానా నౌకాదళ అధికారిగా కనిపించనున్నారు. తాప్సీ కథానాయిక. ఈ చిత్రంలో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు వెంకటేశ్‌ను సంప్రదించారట చిత్ర బృందం. అన్న సురేశ్‌బాబు కొడుకు హీరో కావడం, కథ కూడా నచ్చడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ఫిలిమ్‌నగర్ టాక్.
పీవీపీ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘రుద్రమదేవి’కి చిరంజీవి, పవన్‌కల్యాణ్ ‘జల్సా’, జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ కోసం మహేశ్‌బాబు, ‘మర్యాద రామన్న’కు రవితేజ, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాకు సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రానున్న నాగచైతన్య ‘ప్రేమమ్’కి తండ్రి నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు.