ఘాజీ వంటి సినిమాలు రావాలి
‘‘యువతలో స్ఫూర్తి నింపే చిత్రం ఇది. దేశంలో ఐకమత్యాన్ని పెంచి, శాంతిపథంలో పయనించేలా చేయ డంలో ‘ఘాజీ’ వంటి చిత్రాలు దోహదపడతాయి. ఇలాంటి చిత్రాలు రావాలి’’ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.
రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, కేకే మీనన్ ముఖ్య తారలుగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ‘ఘాజీ’ని ఆదివారం వెంకయ్య నాయుడు చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘హింస, చౌకబారు విషయాలు లేకుండా సంకల్ప్ రెడ్డి చిత్రాన్ని బాగా తీశారు. కమర్షియల్ హంగులు, రంగులు లేక పోయినా.. మెండుగా దేశభక్తిని కలిగించే చిత్రమిది. రానా చక్కటి నటన ప్రదర్శించారు.
ఈ సాహసో పేతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ఇలాంటి దేశభక్తి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం సముచితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న విషయాన్ని ఆయన ముందుంచితే.. ‘‘వినోదపు పన్ను అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. పీవీపీ ఓ భారతీయ పౌరుడిగా బాధ్యతతో సినిమా తీశా రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ‘ఘాజీ’ హిందీ వెర్షన్ చూపించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. చిత్రనిర్మాత పీవీపీ పాల్గొన్నారు.